ప్రజలతో మమేకమై మన్ననలు పొందాలి: ఎస్పీ
ABN , First Publish Date - 2021-10-28T05:48:56+05:30 IST
ప్రజలతో మమేకమై వారి మన్ననలు పొందాలని ఎస్పీ రాజేశ్‌చంద్ర పోలీసులకు సూచించారు. అమరవీరుల త్యాగం ఎప్పటికి మరువలేనిదని ఫ్లాగ్‌డే సందర్భంగా వారి త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు.

ఆదిలాబాద్‌టౌన్, అక్టోబరు 27: ప్రజలతో మమేకమై వారి మన్ననలు పొందాలని ఎస్పీ రాజేశ్‌చంద్ర పోలీసులకు సూచించారు. అమరవీరుల త్యాగం ఎప్పటికి మరువలేనిదని ఫ్లాగ్‌డే సందర్భంగా వారి త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఫ్లాగ్‌డే వారోత్సవాల్లో భాగంగా పట్టణంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. అంతేకాకుండా ర్యాలీలో పాల్గొని సైకిల్ తొక్కుతూ పది కిలో మీటర్ వరకు ర్యాలీలో పాల్గొని పోలీసులను ఉత్సాహపరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజారక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో విధి నిర్వహణ చేస్తూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగుతున్న పోలీసుల కృషి అభినందనీయమన్నారు. దేశవ్యాప్తంగా ప్రజల క్షేమం కోసం పనిచేస్తూ అమరులైన వారి త్యాగాలను స్మరించుకునేలా ప్రతియేటా పోలీసు ఫ్లాగ్‌డే నిర్వహిస్తున్నామన్నారు. అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలతో సత్సంబంధాలను కొనసాగిస్తూ వారి మన్ననలను పొందాలని సూచించారు. అయితే తెలంగాణ పోలీసులకు దేశంలోనే మంచి పేరు ఉందని దానిని మరింత ఇనుమడింప చేసే విధంగా పని చేయాలన్నారు. అంతకు ముందు చేపట్టిన పోలీసు హెడ్‌క్వార్టర్ నుంచి కలెక్టర్‌చౌక్, గాంధీచౌక్, అంబేద్కర్‌చౌక్ గుండా మావల భైపాస్ స్వాగత కమాన్ వరకు కొనసాగింది. ఇందులో అదనపు ఎస్పీలు సమైజాన్‌రావు, వినోద్‌కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వర్‌రావు, విజయ్‌కుమార్, సీఐలు పురుషోత్తంచారి, పోతారాం శ్రీనివాస్, రామకృష్ణ, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.