వంతెనలు పూర్తయ్యేదెన్నడో?

ABN , First Publish Date - 2021-06-23T05:10:01+05:30 IST

జిల్లాలో వర్షాకాలం వచ్చిందంటే వాగులు, వంకలు ఉప్పొంగడంతో చాలా ప్రాంతాల్లో వంతెనలు లేక ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతుంటారు.

వంతెనలు పూర్తయ్యేదెన్నడో?
ఆసిఫాబాద్‌లో అసంపూర్తిగా గుండి వంతెన

-దశాబ్దాలుగా కొనసాగుతున్న నిర్మాణ పనులు
-వర్షాకాలంలో వాగులు ఉప్పొంగి రాకపోకలకు అంతరాయం
-పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

ఆసిఫాబాద్‌ రూరల్‌, జూన్‌22: జిల్లాలో వర్షాకాలం వచ్చిందంటే వాగులు, వంకలు ఉప్పొంగడంతో చాలా ప్రాంతాల్లో వంతెనలు లేక ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతుంటారు. వర్షాకాలం వచ్చిందంటే పలు గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. వాగులు ఉప్పొంగి రహదారులను దిగ్బంధిస్తాయి. గర్భిణులకు పురిటి నొప్పులు వచ్చినా, అనారోగ్యం పాలైనా, అత్యవసర పరిస్థితి తలెత్తినా వాగు దాటాలి. జిల్లాలోని అనేక గ్రామాలకు ఇప్పటికీ 108 వాహనం వెళ్లలేని దుస్థితి నెలకొంది. గర్భిణులు, రోగులు ఆసుపత్రికి వెళ్లలేక మృతిచెందిన సంఘటనలు కూడా ఉన్నాయి. జిల్లాలోని ఆయా మండలాల్లో వాగులపై వంతెనలు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ప్రత్యేక కథనం...


ఇబ్బందులు పడుతున్న ప్రజలు
గ్రామాల్లో రవాణా ఇబ్బందులు తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా ఆశించిన స్థాయిలో లక్ష్యం నెరవేరడం లేదు. వర్షాకాలంలో మారుమూల గ్రామాల ప్రజలు ఇప్పటికీ కష్టాలు పడుతున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు దశాబ్దలుగా కొనసాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆసిఫాబాద్‌ మండలంలోని పెద్దవాగుపై గుండి గ్రామానికి వెళ్లడానికి ప్రజలు నడుము లోతు నీటిలో నడుస్తూ అవస్థలు పడుతుంటారు. వర్షాకాలం ముగిసే వరకు ప్రజలకు ఇబ్బందులు తప్పవు. కెరమెరి మండలంలోని ఉమ్రి వంతెన అసంపూర్తిగా ఉండడం వల్ల మహారాష్ట్రలోని 12 గ్రామాల ప్రజలకు రాకపోకలు వర్షాకాలంలో నిలిచి పోతాయి.


కనర్‌గాం వంతెన మోక్షమెప్పుడో?
కాగజ్‌నగర్‌-వాంకిడి మండలాల మధ్య కనర్‌గాం వద్ద 15 సంవత్సరాల నుంచి వంతెన నిర్మాణం అసంపూర్తిగా ఉంది. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రెండు మండలాలకు రాకపోకలు నిలిచి పోయాయి. కెరమెరి మండలంలోని అనార్‌పల్లి-కరంజివాడ, లక్మాపూర్‌, ఉమ్రి వంతెనల నిర్మాణ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.   పెంచికల్‌పేట పెద్దవాగుపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండటంతో ఆయా గ్రామాల ప్రజలు నాటు పడవలను ఆశ్రయిస్తూ మృత్యువాత పడుతున్నారు. తిర్యాణి మండలంలోని అమీన్‌గూడ, ఎదులపాడ్‌ల సమీపంలోని వాగులపై వంతెనలు మంజూరైనా ఆటవీశాఖ అనుమతుల కారణంగా పనులు ప్రారంభం కాలేదు.

వంతెన త్వరగా పూర్తి చేయాలి
-బొమ్మకంటి కిరణ్‌, గుండి
గుండి పెద్దవాగుపై నిర్మిస్తున్న వంతెన పనులు వెంటనే పూర్తి చేయాలి. పెద్దవాగుపై 15 ఏళ్లుగా నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ప్రతి ఏటా గుండి ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రానికి రావాలంటే వాంకిడి మండలం ఖమాన మీదుగా రావాల్సిన పరిస్థితి నెలకొంది.

గుండి వంతెన నిర్మాణానికి రీటెండర్‌
-రాంమోహన్‌రావు, ఈఈ పీఆర్‌
ఆసిఫాబాద్‌ మండలంలోని గుండి పెద్దవాగుపై వంతెన నిర్మాణానికి మళ్లీ రీ టెండర్‌ పిలువనున్నాం. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాం. కెరమెరి మండలం అనార్‌పెల్లి-కరంజివాడ వంతెన నిర్మాణ పనులు ఇటివలనే ప్రారంభించాం. వర్షాల కారణంగా పనులు నిలిచిపోయాయి.

Updated Date - 2021-06-23T05:10:01+05:30 IST