సమసిపోని భైరవునిపల్లి గ్రామదీపిక వివాదం
ABN , First Publish Date - 2021-12-20T04:46:39+05:30 IST
మండల పరిధిలోని గ్రామదీపిక వ్యవహారంపై మళ్లీ రాజుకుంటోంది. గ్రామ దీపిక గుండపనేని కృష్ణవేణిపై వచ్చిన ఆవినీతి ఆరోపణలతో ఆమెపై పలుమార్లు అధికారులు విచారణ జరిపారు.
నేలకొండపల్లి, డిసెంబరు19: మండల పరిధిలోని గ్రామదీపిక వ్యవహారంపై మళ్లీ రాజుకుంటోంది. గ్రామ దీపిక గుండపనేని కృష్ణవేణిపై వచ్చిన ఆవినీతి ఆరోపణలతో ఆమెపై పలుమార్లు అధికారులు విచారణ జరిపారు. ఈనేపఽథ్యంలో 20 సంఘాల సభ్యులు నవంబరులో సమావేశమై గ్రామదీపికగా కృష్ణవేణిని తొలగిస్తూ, పొదిల గురులక్ష్మిని నూతన గ్రామదీపికగా ఎన్నుకున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. సంఘాలు చేసిన తీర్మానాన్ని ఐకేపీ కార్యాలయానికి పంపారు. సమావేశం నవంబరు నెలలో జరిపారు. డిసెంబరు అయిపోవస్తున్నా నేటికీ డ్వాక్రా సంఘాలు చేసిన తీర్మానాన్ని ఖమ్మంలోని కార్యాలయానికి పంపకుండా తాత్సారం చేస్తున్నట్లుగా ఆరోపిస్తున్నారు. అంతే గాకుండా ఆరోజు సమావేశానికి హాజరైన వారిని తిరిగి పిలిపించుకుంటూ గ్రామంలోని ఓ నాయకుడు సమావేశంలో పెట్టింది మా సంతకాలు కాదు అని తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. మాకు ఆ గ్రామదీపిక వద్దు, కొత్త గ్రామ దీపికను ఎన్నుకున్నామని చెపుతున్నా.. ఐకేపి అధికారులు పట్టించుకోవటం లేదని, దయచేసి దీన్ని రాద్దాంతం చేయకుండా 20 సంఘాలు చేసిన తీర్మానాన్నిఆమోదించాలని డ్వాక్రా సభ్యులు కోరుతున్నారు.