పింఛన్‌దారులకు పాత, చినిగిన నోట్లతో తంటాలు

ABN , First Publish Date - 2021-03-15T04:58:33+05:30 IST

గ్రామాల్లో ఉండే వారికి వృద్ధాప్య పెన్షన్‌ అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టల్‌ శాఖ బీపీఎంలకు బాధ్యతను అందజెప్పింది.

పింఛన్‌దారులకు పాత, చినిగిన నోట్లతో తంటాలు
పంపిణీ చేసిన పెన్షన్‌లో వచ్చిన చినిగిన నోట్లు

-ప్రతీనెల ఇదే తంతు

-లబోదిబోమంటున్న వృద్ధులు 

-తమతప్పు లేదంటున్న బీపీఎంలు

‘ ప్రభుత్వ వృద్ధులకు రెండువేల రూపాయల పింఛన్‌ అందించి ఆదుకుంటోంది. ఈ రెండు వేల రూపాయల పింఛన్‌ కోసం వారంతా మొదటి తారీఖు కోసం ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తుంటారు. ప్రభుత్వం అందించే పింఛన్‌ తమకు కుటుంబంలో ఒక మంచి గుర్తింపు నిస్తోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐతే మండలంలో వృద్ధులు పింఛన్‌ తీసుకోవడానికి జంకుతున్నారు. ఫించన్‌లో రెండు వేల రూపాయలన్నిటినీ పాతబడిన నాసిరకం, చిరిగి ఇరవై రూపాయల నోట్లను ఇస్తున్నారు. దీంతో వృద్ధులు వాటిని భద్రపరుచుకోవడానికి, చెలామణి చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు.’

కాగజ్‌నగర్‌, మార్చి 14: గ్రామాల్లో ఉండే వారికి వృద్ధాప్య పెన్షన్‌ అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టల్‌ శాఖ బీపీఎంలకు బాధ్యతను అందజెప్పింది. ఆశయం బాగానే ఉన్నప్పటికీ ఈ గ్రామీణ ప్రాంతంలోని వృద్ధులకు పెన్షన్‌ అందజేతలో ఎక్కడా లేని చిక్కులు వచ్చి పడుతున్నాయి. చినిగిన నోట్లను బీపీఎంలు అందజేయడంతో వృద్ధాప్య పెన్షన్‌దారులు నరకయాతన పడతున్నారు. ఈ చినిగిన నోట్లను తాము తీసుకోమని తెగేసి చెప్పినప్పటికీ కూడా అదే తరహాలో ప్రతినెల పంపిణీ చేస్తుండటం పట్ల అంతటా ఆగ్రహం వ్యక్తం వ్యక్తం అవుతోంది. కాగజ్‌నగర్‌, సిర్పూరు, కౌటాల, బెజ్జూరు, పెంచికల్‌పేట తదితర మండలాల్లో మారు మూల గ్రామాల్లోని వృద్ధులకు ఈ విధంగా పెన్షన్లను అందజేస్తున్నారు. కాగజ్‌నగర్‌ పోస్టాఫీసు నుంచి కాగజ్‌నగర్‌ మండలం, సిర్పూరు(టి)లోని వేంపల్లి తదితర మండలాలకు సంబంధిత బీపీఎంలు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఇక సిర్పూరు(టి), కౌటాల, బెజ్జూరు, పెంచికల్‌పేట మండలాల వారికి సిర్పూరు(టి) పోస్టాఫీసు అధికారులు డబ్బులను పంపిణీ చేస్తున్నారు. సంబంధిత పోస్టాఫీసు నుంచి అధికారులు వీరికి నగదును అందజేస్తున్నారు. ఈ నగదును తీసుకొని గ్రామీణ ప్రాంతాల వారికి బీపీఎంలు పెన్షన్‌ అందజేస్తున్నారు. తమకు ప్రతినెల పెన్షన్‌ తీసుకోవాలంటే భయం వేస్తోందని, వచ్చే రూ.2వేలలో తమకు కనీసం రూ.400 మేర చినిగిన నోట్లు రావడంతో ఏమి చేయాలో పాలుపోవడం లేదని పలువురు లబ్ధిదారులు పేర్కొంటున్నారు. తమకు వృద్ధాప్యంలో కనీసం పెన్షన్‌ అండగా ఉంటుందని అనుకొంటే ప్రతినెల ఈ విధంగా చిరిగిన, నాసిరకం నోట్లను అంటగడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వయసులో ఈ నోట్లను ఎక్కడ మార్చుకోవాలి, ఇంత నాసిరకం నోట్లను ఎలా భద్రపరుచుకోవాలి అని మదనపడుతున్నారు.

చినిగిన నోట్లు అధికంగా వస్తున్నాయి..

-గోపాల్‌, పెన్షన్‌ దారుడు, వేంపల్లి 

ఈ నెల పెన్షన్‌ తీసుకుంటే అన్నీ రూ.20 నోట్లు ఇచ్చారు. ఇందులో కనీసం రూ.400 మేర చినిగిన నోట్లు ఉన్నాయి. దుకాణాల వద్దకు పోతే ఎవరూ తీసుకోవడం లేదు. పెన్షన్‌ తీసుకున్న సంబరం కూడా లేని పరిస్థితి ఉంది. చినిగిన నోట్లను ఏమి చేయాలో అర్థం కావడం లేదు. ప్రతినెల ఇదే సమస్య వస్తోంది. అధికారులకు చెప్పితే ఉన్నతాధికారులు అలానే ఇస్తున్నారని చెబుతున్నారు. కనీసం వృద్ధులమని చూడకుండా ఇచ్చి పోతున్నారు. చాలా దారుణంగా ఉంది. ఈ విషయంలో ఉన్నతాధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. 

Updated Date - 2021-03-15T04:58:33+05:30 IST