చిక్కేదెప్పుడో?

ABN , First Publish Date - 2021-01-14T04:32:29+05:30 IST

రెండు నెలలుగా పులి జాడ కనుక్కొనేందుకు అటవీ శాఖ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నా చిక్కడం లేదు.

చిక్కేదెప్పుడో?

-బెజ్జూరు మండలంలో ప్రయాణికులకు తారసపడిన పులి 

- రెండు రోజులుగా కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారె్‌స్ట్‌ ఆధ్వర్యంలో గాలింపు 

- రంగంలోకి ర్యాపిడ్‌ రెస్క్యూ టీం

-భయాందోళనలో ప్రజలు

బెజ్జూరు, జనవరి13: రెండు నెలలుగా పులి జాడ కనుక్కొనేందుకు అటవీ శాఖ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నా చిక్కడం లేదు. బుధవారం రాత్రి బెజ్జూరు మండలం సులుగుపల్లి, సలుగుపల్లి గ్రామాల మధ్య పెద్దపులి పలువురు ప్రయా ణికులకు ఎదురైంది. దీంతో ప్రజలు భయాం దోళనలకు గురవుతున్నారు. పెద్దపులి దాడిలో ఇప్పటికే జిల్లాలో ఇద్దరు మృత్యువాత పడిన నేప థ్యంలో అటవీ శాఖ అధికారులు అప్రమత్త మయ్యారు. మూడు రోజులుగా కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు వినోద్‌కుమార్‌ ఇక్కడే మకాం వేసి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ర్యాపిడ్‌ రెస్క్యూ టీంలను రంగంలోకి దించారు. ఎలాగైనా పులిని పట్టుకొని బోనులో బంధించేందుకు రెండు రోజుల నుంచి నిపుణులతో ప్రయత్నాలు చేపడుతున్నారు. మండలంలోని తలాయి సమీపంలోని కంది బీమన్న అటవీ ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేసి పులి కదలికలను పసిగడుతున్నారు. 

అటవీ ప్రాంతంలో వివిధ చోట్ల కెమెరా ట్రాప్‌లు, బోనులు అమర్చి నిరంతరం పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా 60మంది టైగర్‌ ట్రాకర్స్‌ను నియ మించి వేట కొనసాగిస్తున్నారు. ప్రత్యేక షూటర్ల ద్వారా పులికి మత్తు మందు ఇచ్చి పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.  బెజ్జూరు మండలం కంది భీమన్న అటవీ ప్రాంతంలో పెద్దపులిని పట్టుకు నేందుకు ఎరగా ఉంచిన ఆవును సోమవారం పులి చంపడం కలకలం సృష్టించింది. మళ్లీ మంగళవారం ఉదయం ఆవు కళేబరాన్ని తినేందుకు పులి వచ్చినట్లు సమాచారం. అయితే మత్తు మందు ఇచ్చే షూటర్లు ఆ ప్రాంతానికి చేరుకునే సరికి పులి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. 

అటవీ గ్రామాల్లో 144 సెక్షన్‌ 

పెద్దపులిని పట్టుకొనే క్రమంలో అటవీ ప్రాంతంలోకి ఎవరినీ రాకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అటవీ గ్రామాల పరిధిలో 144 సెక్షన్‌ అమలు చేశారు.  పులి సంచరించే అటవీ ప్రాంతంలో అలజడి లేకుండా ఉండేందుకు ఎవరూ లోపలికి వెళ్లకుండా హద్దులు ఏర్పాటు చేశారు.  పెద్ద పులిని పట్టుకొనే క్రమంలో కన్జర్వేటర్‌ వినోద్‌కుమార్‌ కంది బీమన్న అటవీ ప్రాంతంలో మకాం వేసి స్థానిక అటవీ అధికారులకు తగు సూచనలు ఇస్తూ దిశా నిర్దేశాన్ని ఇస్తున్నారు. ఓ జిల్లా స్థాయి అధికారి అక్కడే ఉండి   అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.

డ్రోన్‌ కెమెరాలతో పర్యవేక్షణ

అటవీ శాఖ అధికారులకు చిక్కకుండా తిరుగుతున్న పెద్దపులిని పట్టుకునేందుకు బుధ వారం సాయంత్రం డ్రోన్‌ కెమెరాలతో కందిభీమన్న అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. హైదరాబాద్‌కు చెందిన వైల్డ్‌ లైఫ్‌ కన్జర్వేటింగ్‌ స్వచ్చంద సంస్థకు చెందిన ఇద్దరు సభ్యులు పులి కదలికలపై డ్రోన్‌ కెమెరాలతో పర్యవేక్షించనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని అటవీ శాఖాధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.  

పులి అడుగులు గుర్తింపు

బెజ్జూరు మండలం సులుగుపల్లి, సలుగుపల్లి గ్రామాల మధ్య బుధవారం రాత్రి పెద్దపులి పలువురు ప్రయాణికులకు ఎదురైంది. సులుగుపల్లి గ్రామానికి చెందిన సోయం చిన్నయ్య, ఆత్రం రామయ్యలు కుంటలమానేపల్లి నుంచి సులుగుపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా తీగల ఒర్రె సమీపంలో పులి కనిపించింది. అనంతరం బెజ్జూరు మండలం కుశ్నపల్లి గ్రామానికి చెందిన దోమల అనిల్‌, అంజలిలు ద్విచక్ర వాహనంపై పెంచికలపేట వైపు వెళ్తుండగా పులి తారసపడింది. కొద్దిసేపటి తర్వాత పులి సమీపంలోని పొలాల్లోకి వెళ్లడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ప్రయాణికులు అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో కాగజ్‌నగర్‌ ఎఫ్‌డీవో విజయ్‌కుమార్‌ పులి సంచరించిన ప్రాంతాలను పరిశీలించి వాటి అడుగులను గుర్తించారు.  ఏ-2 పెద్దపులి ఇదేనా అన్న అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి.  


Updated Date - 2021-01-14T04:32:29+05:30 IST