ఆ రెండు గ్రామాలు కరోనాను దరిచేరనీయలేదు..

ABN , First Publish Date - 2021-05-22T04:15:28+05:30 IST

ఒకరి నుంచి మరొకరి సోకి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని ఆ గ్రామ ప్రజలు తమ ఊరి దరిచేరనీయలేదు.

ఆ రెండు గ్రామాలు కరోనాను దరిచేరనీయలేదు..

- ఇప్పటిదాకా నమోదు కాని ఒక్క పాజిటివ్‌ కేసు 

- మిగితా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్న నవేగాం, మంగి ప్రజలు

- గ్రామస్థుల్లో అవగాహన.. పకడ్బందీగా పారిశుధ్య పనులు

సిర్పూర్‌(టి)/తిర్యాణి, మే 21: ఒకరి నుంచి మరొకరి సోకి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని ఆ గ్రామ ప్రజలు తమ ఊరి దరిచేరనీయలేదు. వైరస్‌ వ్యాప్తితో ఎక్కడికక్కడ రోగులతో అన్ని ఆస్పత్రులు నిండిపోతున్నా.. ఆ ఊరి ప్రజల్లో ఏ ఒక్కరూ వైరస్‌ బారిన పడలేదు. ఎక్కువ కుటుంబాలు వ్యవసాయారంగానే జీవనం సాగిస్తున్నాయి. వారిలో ఎక్కువ మంది నిరక్షరాస్యులే. అయినా వైరస్‌ పట్ల ఉన్న సంపూర్ణ అవగాహనతో ఆ మేరకు తీసుకుంటున్న జాగ్రత్తల ఫలితమే వారిని వైరస్‌ నుంచి రక్షణ కల్పిస్తోంది. ఆ ఆదర్శ గ్రామాలు జిల్లాలోని సిర్పూర్‌(టి) మండలం నవేగాం ఒకటి కాగా మరొకటి తిర్యాణి మండలం మంగి గ్రామ పంచాయతీ. నవేగాం పంచాయతీలో 200 కుటుం బాలు ఉండగా 700మంది జనాభా ఉంది. ఈ గ్రామంలో తొలి విడతలోనే కాదు. రెండో విడతలోనూ ఒక్కటంటే ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. సర్పంచ్‌ నరిగేవార్‌ చిన్నుబాయి, కార్యదర్శి ఫహీంబాను ఆధ్వర్యంలో స్వీయ నియంత్రణ పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించారు. కొత్త వ్యక్తులు గ్రామాల్లోకి రాకుండా పంచాయతీ పాలకవర్గం చర్యలే ఇందుకు కారణం. రోడ్లు, మురికి కాలువలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ వివిధ క్రిమిసంహారకాలను చల్లుతూ పారిశుధ్య పనులను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. పంచాయతీ పాలకవర్గం, వైద్యశాఖ సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు. అలాగే దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న మంగి పంచాయతీలో 150కుటుంబాలు ఉండగా 500జనాభా జీవిస్తున్నారు. అటవీప్రాంతం కావడంతో ఆ గ్రామాలకు బయటికి వారు వెళ్లడం చాలా తక్కువ. ఎవరైనా వెళ్లినట్లయితే ఆ గ్రామస్థులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తున్నారు. వారికి భౌతిక దూరం పాటిస్తున్నారు. దీని ఫలితంగా అక్కడ ఇప్పటికీ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. గ్రామ పంచాయతీ పరిధిలో నిత్యం పారిశుధ్య పనులు చేపడుతూ హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేయడంతో గ్రామం కొవిడ్‌ రహితంగా నిలిచింది.  

కరోనా నివారణకు చర్యలు తీసుకుంటున్నాం..

- చిన్నుబాయి, సర్పంచ్‌, నవేగాం                                                                                 

కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటి నుంచి మా పంచాయతీలో కొత్తవారిని ఎవరినీ ఊర్లోకి రానివ్వకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే రోజు వారీగా గ్రామంలో శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ఇంటింటా ఫీవర్‌ సర్వే నిర్వహించి సాధారణ జ్వరం ఉన్న వారి పట్ల తక్షణమే స్పందించి తగ్గేలా చర్యలు తీసుకుంటున్నాం. 

బయటి నుంచి ఎవరిని రానివ్వడం లేదు..

- రాంషా, మంగి

మాకు చుట్టూ అటవీ ప్రాంతం కావడంతో బయటి నుంచి ఎవరినీ రానివ్వడం లేదు. నిత్యావసర సరుకులకు ఇంటి నుంచి ఒకరు వెళ్లి తీసుకుని వస్తున్నాం. బయట శుభకార్యాలకు వెళ్లడం లేదు. అధికారులు సూచించిన జాగ్రత్తలు పాటించడంతో మా ఆదివాసీ గూడాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఇది మాకు చాలా గర్వంగా ఉంది.

Updated Date - 2021-05-22T04:15:28+05:30 IST