ఉపాధి అక్రమాల చుట్టూ ఉచ్చు
ABN , First Publish Date - 2021-02-06T06:08:07+05:30 IST
జిల్లాలో అమలవుతున్న జాతీయ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్)లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ప్రభుత్వం కొరఢా ఝులిపించింది.

రంగంలోకి టాస్క్‌ఫోర్సు బృందం
ఈజీఎస్ ఉన్నతాధికారి శ్రీనివాసులు నేతృత్వంలో కమిటీ
క్షేత్రస్థాయిలో పనుల విచారణ
లోతుగా రికార్డుల పరిశీలన
ఫిర్యాదులపై సీరియస్
నిర్మల్, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో అమలవుతున్న జాతీయ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్)లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ప్రభుత్వం కొరఢా ఝులిపించింది. జిల్లాతో పాటు రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాల్లో కూడా అవినీతి అక్రమాలపై విచారణ జరిపేందుకు ప్రభు త్వం సీరియస్‌గా కార్యాచరణ చేపట్టింది. దీని కోసం గాను ప్రతి జిల్లాకు ఓ టాస్క్‌ఫోర్సు కమిటీని నియమించింది. ఓ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారితో పాటు మరో ముగ్గురు అధికారులను ఈ టాస్క్‌ఫోర్సు బృందంలో సభ్యులుగా నియమించారు.
ఇందులో భాగంగానే నిర్మల్ జిల్లాకు ఈఎస్ స్టేట్ ఫైనాన్స్ ఆఫీసర్ కె. శ్రీనివాసులు ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఈజీఎస్ అధికారులు నాగభూషణం, అబేద్‌ఖాన్, అభయ్‌కుమార్‌లు ఉన్నారు. వీరు ఒకటి, రెండు రోజుల్లో జిల్లాకు చేరుకోనున్నారు. జిల్లా కలెక్టర్ ఈ కమిటీకి అవసరమయ్యే అన్ని రకాల సౌకర్యాలను కల్పించడమే కాకుండా వారికి సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ టాస్క్‌ఫోర్సు తనిఖీలకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులను సైతం జారీ చేసింది.
ముఖ్యంగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా జరిగిన ఉపాధిహామీ పథకం పనుల్లో పెద్దఎత్తున అవినీతి అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులున్నాయి. ముథోల్ నియోజకవర్గంలోని మెజార్టీ గ్రామాల్లో ఈజీఎస్ కింద నాసిరకం పనులు చేసి లక్షల రూపా యల బిల్లులు ఎత్తుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఫిర్యాదులపై జిల్లాస్థాయి అధికారులు విచారణ జరిపినప్పటికీ రాజకీయ ఒత్తిడుల కారణంగా వారు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. ఉపాధి హామీ పనుల వివరాలను ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేయకపోవడం, రికార్డులను సరిగా నిర్వహించకపోవడంతో పాటు క్షేత్రస్థాయిలో నాణ్యతకు తిలోదకాలిచ్చి అడ్డగోలుగా పనులు చేపట్టారన్న ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలో పెద్దఎత్తున అవకతవకలు జరిగినట్లు జిల్లాస్థాయి అధికారుల విచారణలో కూడా వెల్లడైంది. ఈ అక్రమాల కారణంగా ఈజీఎస్ లక్ష్యసాధన పక్కదోవ పట్టినట్లు విమర్శలు కూడా ఉన్నా యి.
జిల్లా వ్యాప్తంగా 1.63 లక్షల జాబ్‌కార్డులున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు రూ. 159 కోట్లను ఉపాధి పనుల కోసం ఖర్చు చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ఇంత భారీ మొత్తంలో నిధులు వ్యయం చేసినప్పటికీ ఆశించిన లక్ష్యం మాత్రం సాధ్యం కాలేదని చెబుతున్నారు. జాబ్‌కార్డుదారులందరికీ పూర్తిస్థాయిలో ఉపాధి కల్పించలేకపోవడం.. లక్షల రూపాయలను స్వాహా చేయడం రివాజుగా మారిందంటున్నారు. గత కొద్దిరోజుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బందిని తొలగించడంతో అంతగా పనులపై పరిజ్ఞానం లేని పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించడం అక్రమాలకు మరింత ఆస్కారమిచ్చినట్లయ్యిందంటున్నారు.
ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం క్షేత్రస్తాయిలో ఉపాధి హామీ కింద చేపట్టిన పనులన్నింటినీ తనిఖీ చేసేందుకు నిర్ణయించింది. ఈ తనిఖీ బృందం ఆకస్మికంగా జిల్లాలోని పలు గ్రామాల్లో పనుల పరిశీలన చేపట్టనుంది. సంబంధిత అధికారులకు గాని, సిబ్బందికి గాని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈ ఆకస్మిక తనిఖీలు జరగనున్నాయి.
తనిఖీలతో వెలుగుచూడనున్న అక్రమాలు
ఉపాధి హామీ పథకం పనుల్లో పెద్దఎత్తున జరిగిన అవినీతి, అక్రమా లు టాస్క్‌ఫోర్సు బృందం తనిఖీలతో వెలుగుచూడనున్నాయంటున్నారు. తీగ లాగితే డొంక కదిలే చందంగా ఉపాధిహామీలో కింది నుంచి పై స్థాయి వరకు అవకతవకలు జరిగినట్లు చెబుతున్నారు. సరియైున పర్యవేక్షణ లేకపోవడం, పనుల పూర్తికి తక్కువ సమయాన్ని టార్గెట్‌గా నిర్ణయించడం, క్షేత్రస్థాయి సిబ్బంది చేతివాటం లాంటి అంశాలన్నీ అవకతవకలకు కారణమయ్యాయంటున్నారు. ఉపాధిహామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో లేని కూలీలందరికీ పని కల్పించాలన్న లక్ష్యంతో అమలు చే స్తున్నారు. అయితే ఆచరణలో మాత్రం ఈ ఆశయం అనుకున్న ఫలితానివ్వడం లేదన్న ఆరోపణలున్నాయి.
ముఖ్యంగా ముథోల్ నియోజకవర్గంలో పెద్దఎత్తున అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడి ఓ ప్రజాప్రతినిధి ఈ పథకం కింద నాసిరకం పనులు చే పట్టి నిబంధనలకు విరుద్దంగా లక్షల రూపాయల బిల్లులు ఎత్తుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అయితే టాస్క్‌ఫోర్సు తనిఖీలతో ఈ అక్రమాల గుట్టు రట్టు కాబోతుందంటున్నారు.
అడుగడుగునా రాజకీయ జోక్యం
ఇదిలాఉండగా ఉపాధిహామీ పథకం పనుల్లో గత కొంతకాలం నుంచి రాజకీయ జోక్యం విఫరీతంగా పెరిగిపోయిందంటున్నారు. అవినీతికి పాల్పడిన సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సైతం రాజకీయ జోక్యం కారణంగా వెనకడుగు వేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కొంతమంది గ్రామస్థాయి ప్రజా ప్రతినిధులు ఉపాధి హామీ పనులపై దృష్టి సారించడం అలాగే అవకతవకలకు మద్దతునిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
వీరికి పై స్థాయిలో రాజకీయ అండదండలున్న కారణంగా క్షేత్రస్తాయి సిబ్బంది, అధికారులు సైతం నాణ్యత విషయంలో జోక్యం చేసుకోలేకపోతున్నారంటున్నారు. అయితే అధికారులు తమకు అందిన ఫిర్యాదుల మేరకు ప్రాథమిక విచారణ జరిపి సిబ్బందిపై ఏదైనా చర్య తీసుకున్న గాని రాజకీయ ఒత్తిడుల కారణంగా ఆ చర్య లు నీరుగారిపోతున్నాయంటున్నారు.
నేడో రేపో జిల్లాకు టాస్క్‌ఫోర్స్
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన పనుల పరిశీలన కోసం రాష్ట్రస్థాయి ప్రత్యేక టాస్క్‌ఫోర్సు బృందం ఒకటి, రెండు రోజుల్లో జిల్లాకు రానున్నట్లు సమాచారం. ఈ మేరకు ఈ టాస్క్‌ఫోర్సు బృందానికి ఈజీఎస్ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారి కె.శ్రీనివాసులు నేతృత్వం వహించబోతున్నారు. ఆయనతో పాటు అధికారులు నాగభూషణం, అబేద్‌ఖాన్, అభయ్‌కుమార్‌లు సభ్యులుగా జిల్లాకు రాబోతున్నారు. ఈ బృందం తమకున్న సాంకేతిక పరిజ్ఙానం, పరిపాలన అనుభవంతో పను ల అక్రమాలను వెలికితీయబోతోంది.
ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు, ఆ పనుల కోసం ఖర్చు అయిన వ్యయా న్ని కమిటీ పరిశీలించనుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన పనులను కూడా ఈ కమిటీ స్వయంగా తనిఖీ చేయనుంది. ముఖ్యంగా పనుల నాణ్యత, చెల్లించిన బిల్లులకు సరిపోయేంతగా పని జరిగిందా లేదా అనే అంశాన్ని ఈ కమిటీ వెలుగులోకి తేనుంది. విచారణలో అక్ర మాలు తేలినట్లయితే వెంటనే సంబందిత అధికారులు, సిబ్బందిపై చర్యలకు సైతం ఈ కమిటీ సిఫారసు చేయనున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.
ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన మాట వాస్తవమే
ఈ విషయమై నిర్మల్ జిల్లా డీఆర్డీఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు సంప్రదించగా ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనుల పరిశీలన కోసం ప్రతి నాలుగు జిల్లాలకు ఒక తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేసిన మాట వాస్తమేనని తెలిపారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద అర్హులైన జాబ్‌కార్డులకు వంద రోజుల పాటు పని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో రూ. 159 కోట్లను వివిధ పనుల కోసం వెచ్చించడం జరిగిందని ఆయన వివరించారు.
వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ ప్రాజెక్ట్ డైరెక్టర్, నిర్మల్