కొడుకును కడతేర్చిన తల్లి

ABN , First Publish Date - 2021-03-14T05:41:30+05:30 IST

క్షణికావేశంలో కొడుకునే రోకలి బండతో మోది దారుణంగా హత్య చేసిన ఘటన లక్ష్మణచాంద మండలం మల్లాపూర్‌లో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

కొడుకును కడతేర్చిన తల్లి
సంఘటన స్థలంలో కేశం శ్రీకాంత్‌ మృతదేహం,

క్షణికావేశంలో రోకలిదుడ్డుతో కొట్టి హత్య

లక్ష్మణచాందలో విషాద ఘటన

లక్ష్మణచాంద, మార్చి 13 : క్షణికావేశంలో కొడుకునే రోకలి బండతో మోది దారుణంగా హత్య చేసిన ఘటన లక్ష్మణచాంద మండలం మల్లాపూర్‌లో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికంగా విషాదం నింపిన ఘటన వివరాల్లోకి వెళితే.. మల్లాపూర్‌ గ్రామానికి చెందిన కేశం ఇంద్ర- చిన్నయ్య దంపతులకు శ్రీనివాస్‌, శ్రీకాంత్‌(17) అనే ఇద్దరు కుమారులు, అనూష అనే కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడైన శ్రీనివాస్‌ వివాహం చేసుకొని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా, శ్రీకాంత్‌కు ఇంకా వివాహం కాలేదు. కూతురు అనూషకు సైతం రెండేళ్ల క్రితమే వివాహమైంది. అయితే తండ్రి చిన్నయ్య కొన్నేళ్లక్రితం గల్ఫ్‌లో ఉండ గానే అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో అప్పటి నుంచి శ్రీకాంత్‌ మానసికంగా కుంగుబాటుకు గురై మద్యానికి అలవాటు పడ్డాడు. రోజూ తాగి ఇంటికి వచ్చి తల్లితో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం నిర్వహించనున్న అక్క కుమారుడి కేశఖండన కార్యక్రమానికి బట్టలు, వస్తువులు తీసుకెళ్లే విషయంలో శుక్రవారం అర్ధరాత్రి వీరిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన తల్లి కేశం ఇంద్ర క్షణికావేశంలో శ్రీకాంత్‌ తలపై రొకలి దుడ్డుతో గట్టిగా కొట్టడంతో.. అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు శనివారం ఘటనా స్థలికి చేరుకొని విచారించారు. కొడుకు శ్రీకాంత్‌ను తానే ఆవేశంలో చంపినట్లు తల్లి ఇంద్ర అంగీకరించడంతో.. ఆమెను అరెస్టు చేసినట్టు డీఎస్పీ ఉపేందర్‌ రెడ్డి తెలిపారు. 


Updated Date - 2021-03-14T05:41:30+05:30 IST