పల్లెల సమగ్రాభివృద్ధికి తోడ్పాటునందిస్తా

ABN , First Publish Date - 2021-09-03T07:01:54+05:30 IST

పల్లెల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి పల్లెల సమగ్ర అభివృద్ధికి తోడ్పాటును అందిస్తానని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. గురువారం ప్రధానమంత్రి సంసద్‌ ఆదర్శ్‌గ్రామ్‌ యోజన కింద ఎంపిక చేసుకున్న మండలంలోని వజ్జర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.

పల్లెల సమగ్రాభివృద్ధికి తోడ్పాటునందిస్తా
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ సోయం బాపూరావు

బోథ్‌/బోథ్‌రూరల్‌, సెప్టెంబరు 2: పల్లెల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి పల్లెల సమగ్ర అభివృద్ధికి తోడ్పాటును అందిస్తానని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. గురువారం ప్రధానమంత్రి సంసద్‌ ఆదర్శ్‌గ్రామ్‌ యోజన కింద ఎంపిక చేసుకున్న మండలంలోని వజ్జర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మండలంలోని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న వజ్జర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నానని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తప్ప నేటికీ మరో కార్యక్రమం వజ్జర్‌లో చేపట్టలేదన్నారు. సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ్‌యోజన కింద గ్రామంలో తాగునీరు, రోడ్ల నిర్మాణం, సెల్‌టవర్‌ ఏర్పాటు అంగన్‌వాడీలకు సొంత భవనం పాఠశాలకు ప్రహరీనిర్మాణంతో పాటు పొడు భూములకు పట్టాలిప్పించే కార్యక్రమాన్ని చేపడతామన్నారు. మహిళల అభ్యున్నతికి కేంద్ర పథకాల ద్వారా రుణాలను ఇప్పించి ఆర్థిక ప్రగతికి తోడ్పాటును అందిస్తానని పేర్కొన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి..

వజ్జర్‌లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. వజ్జర్‌లో సెల్‌ సిగ్నల్‌ లేక పోవడంతో రేషన్‌ సరుకుల కోసం వేరే గ్రామానికి వెళ్లాల్సి వస్తుందని గ్రామస్థులు తెలుపగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పల్లెల అభివృద్ధికి ప్రభుత్వాలు పెద్ద పీట వేస్తుందని రానున్న రోజులలో వజ్జర్‌ను అన్ని రంగాలలో తీర్చిదిద్దుతామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌షేక్‌భాషా, డీఆర్డీఏ పీడీ కిషన్‌, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో రాధ, ఎంపీపీ తుల శ్రీనివాస్‌, సర్పంచ్‌ సిడాంభీంబాయి, ఎంపీటీసీ సిడాంశంభులతో పాటు అన్ని శాఖల ఉన్నతాదికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-03T07:01:54+05:30 IST