సింగరేణి సమ్మె సక్సెస్‌

ABN , First Publish Date - 2021-12-10T03:41:55+05:30 IST

సింగరేణి వ్యాప్తంగా బొగ్గు బావుల్లో చేపట్టిన సమ్మె తొలి రోజు విజయవంతం అయింది. గురువారం మొదటి షిప్టు నుంచే కార్మికులు విధులను బహిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని నిరసిస్తూ జాతీ య సంఘాలు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్‌, బీఎంఎస్‌తోపాటు సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌ ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు సమ్మెకు పిలుపునిచ్చాయి.

సింగరేణి సమ్మె సక్సెస్‌
శ్రీరాంపూర్‌ ఓపెన్‌ కాస్టు వద్ద నిలిచిన డంపర్లు

విధులకు  గైర్హాజరైన కార్మికులు

బోసిపోయిన బొగ్గు బాయిలు

28వేల పైచిలుకు టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం

రూ.60 కోట్లకుపైగా నష్టం 

మంచిర్యాల, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): సింగరేణి వ్యాప్తంగా బొగ్గు బావుల్లో చేపట్టిన సమ్మె తొలి రోజు విజయవంతం అయింది. గురువారం మొదటి  షిప్టు నుంచే కార్మికులు విధులను బహిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని నిరసిస్తూ జాతీ య సంఘాలు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్‌, బీఎంఎస్‌తోపాటు సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌ ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు సమ్మెకు పిలుపునిచ్చాయి. నేపథ్యంలో కార్మికులు ఇళ్లకే పరిమితం అయ్యారు. అత్యవసర సిబ్బంది మినహా ఓపెన్‌ కాస్టు గనులు, అండర్‌ గ్రౌండ్‌ మైన్లలో ఇతర కార్మికులెవరూ విధులకు హాజరు కాలేదు. సమ్మె పురస్కరించుకొని జేఏసీగా ఏర్పడ్డ కార్మిక సంఘాల నేతలు కార్మికులు విధులకు హాజరుకాకుండా గనుల వద్ద గస్తీ తిరిగారు. జిల్లాలోని శ్రీరాంపూర్‌, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాలలోని ఓసీపీలు, అండర్‌ గ్రౌండ్‌ మైన్లు, కార్యాలయాల్లో దాదాపు 16వేల మంది కార్మికులు పని చేస్తుండగా వీరంతా విధులకు గైర్హాజరయ్యారు. మూడు ఏరియాల పరిధిలో మొదటి షిప్టు నుంచి సమ్మె ప్రారంభం కాగా మూడు షిఫ్టులకు సంబంధించి సుమారు 28వేల పైచిలుకు టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడగా దాదాపు రూ.60 కోట్లకుపైగా సింగరేణికి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. 

చర్చలు విఫలం కావడంతో

బొగ్గు బ్లాకులను వేలం వేయడానికి నిరసనగా మొదట గుర్తింపు సంఘమైన టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చింది. అనంతరం టీబీజీకేఎస్‌ సహా జాతీయ సంఘాలన్నీ ఏకతాటి పైకి వచ్చి జేఏసీగా ఏర్పడగా ప్రైవేటీకరణపై ఉద్యమం చేపట్టేందుకు నిర్ణయించాయి. ఈ క్రమంలో స్పందించిన యాజమాన్యం జేఏసీ నాయకులను చర్చలకు ఆహ్వానించింది. దీంతో ఈనెల 3న సీఎండీ శ్రీధర్‌తో జరిపిన చర్చలు విఫలం కాగా, 6న రీజనల్‌ కమిషనర్‌ చర్చలకు ఆహ్వానించారు. చర్చల్లో భాగంగా తమ చేతిల లేదని, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేలా సీఎంను ఒప్పించాలని ఆర్‌ఎల్‌సీ సూచించింది. దీంతో సీఎంతో సమావేశానికి అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ 8వ తేదీ వరకు గడువు ఇచ్చారు. సీఎంవో నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో జేఏసీ నాయకులు సమ్మెకు పిలుపునిచ్చారు. 

గనుల వద్ద కార్మిక సంఘాల నిరసనలు

నస్పూర్‌: సింగరేణిలో సమ్మె సైరన్‌ మోగడంతో శ్రీరాంపూర్‌ ఏరియాలో గురువారం ఉదయం షిప్టు నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్ళారు. నాలుగు బ్లాక్‌లను సింగరేణికే కేటాయించాలని, మరో 12 డిమాండ్లతో మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి. శ్రీరాంపూర్‌ ఏరియాలోని ఏడు భూగర్భ గనులు, రెండు ఓపెన్‌ కాస్టు గనుల వద్ద కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకు దిగాయి. కార్మిక సంఘాల నేతలు, నాయకులు ఏరియాలోని అన్ని గనులు, ఓపెన్‌ కాస్టుల వద్ద నిరసనలు తెలిపి తిరిగి శ్రీరాంపూర్‌ కాలనీలోని కార్మికుడి విగ్రహం వద్దకు చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. మూడు రోజుల పాటు సింగరేణిలో సమ్మె కొనసాగుతుందని ఐక్య కార్మిక సంఘాల జేఏసీ నాయకులు చెప్పారు. సమ్మె సందర్భంగా ఆయా ప్రాంతాల్లో జైపూర్‌ ఏసీపీ నరేందర్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ బందోబస్తు నిర్వహించారు.  టీబీజీకేఎస్‌ మాజీ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య, కేంద్ర ఉపాధ్యక్షుడు మంద మల్లారెడ్డి, అన్నయ్య, వీరభద్రయ్య, ఏనుగు రవీందర్‌ రెడ్డి, వెంగల కుమార్‌, ఏఐటీయుసీ ప్రధాన కార్యదర్శి వాసీరెడ్డి సీతారామయ్య, ఉప ప్రధాన కార్యదర్శి బాజీసైదా, ముస్కె సమ్మయ్య, సీఐటీయు నాయకులు  రామస్వామి, భాగ్యరాజ్‌, జీవన్‌ జోయల్‌,అనిల్‌ రెడ్డి, రమేష్‌, నాతాడి శ్రీధర్‌ రెడ్డి,  మేకల దాసు, దొడ్డిపల్లి రవీందర్‌ పాల్గొన్నారు. 

కార్మిక సంఘాల జెఏసీ ప్రదర్శన

కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను ప్రైవేట్‌ వారికి అప్పగించడానికి వేలంలో చేర్చడంపై నిరసన వ్యక్తం చేస్తూ శ్రీరాంపూర్‌లో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కార్మికవాడలు, గనుల వద్ద ప్రదర్శన నిర్వహించాయి. మూడు రోజులపాటు సమ్మె కొనసాగుతుందని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. కాంట్రాక్టు కార్మికులకు 11వ వేతన ఒప్పందంలో మొదటి క్యాటగిరి వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.  ఐఎఫ్‌టీయు జాతీయ నాయకులు శ్రీనివాస్‌, ఐఎఫ్‌టీయు-ఎస్‌సీసీ డబ్య్ల్లుయు రాష్ట్ర ఉపాధ్యాక్షుడు బ్రహ్మనందం, నాయకులు సంజీవ్‌, యాదగిరి, సోమయ్య, పద్మ, రాజకళ, రఘు, రాజు, కిరణ్‌, నాగరాజు  పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-10T03:41:55+05:30 IST