వెక్కిరిస్తున్న వైద్యుల కొరత

ABN , First Publish Date - 2021-08-28T03:38:52+05:30 IST

సిర్పూర్‌(టి)లోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో వైద్యుల కొరత వెక్కిరిస్తోంది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారులకు మెరుగైన వైద్యచికిత్స అందించాలన్న ఉద్దేశ్యంతో లక్షలు వెచ్చించి అధునాతన పరికరాలతో ఏర్పాటు చేసిన ఎన్‌ఎస్‌బీయూ గది నిరుపయోగంగా మారింది.

వెక్కిరిస్తున్న వైద్యుల కొరత

- పిల్లల వైద్యులు లేక వృధాగా ఉన్న ఎన్‌బీఎస్‌యూ గది

- అత్యవసర సమయాల్లో ప్రైవేటే దిక్కు

- ఇంటర్వ్యూ నిర్వహించినా ఆసక్తి చూపని అభ్యర్థులు

సిర్పూర్‌(టి), ఆగస్టు 27: సిర్పూర్‌(టి)లోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో వైద్యుల కొరత వెక్కిరిస్తోంది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారులకు మెరుగైన వైద్యచికిత్స అందించాలన్న ఉద్దేశ్యంతో లక్షలు వెచ్చించి అధునాతన పరికరాలతో ఏర్పాటు చేసిన ఎన్‌ఎస్‌బీయూ గది నిరుపయోగంగా మారింది. ఇక్కడి ఆస్పత్రికి ప్రతిరోజు మండలంలోని ప్రజలతోపాటు చుట్టు పక్కల మండలాలైన కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూరు మండలాల ప్రజలు వస్తుంటారు. ఐతే పిల్లల డాక్టర్‌ లేకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆయా మండలాల గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించుకుంటే కేసీఆర్‌ కిట్‌ వస్తుందని ఉద్దేశ్యంతో ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పులు చేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఐతే ప్రసవం తరువాత శిశువు అనార్యోంగా ఉంటే ఎన్‌బీఎస్‌యూ(ఎన్‌క్యుబరేటర్‌ బాక్సు)లో చికిత్స నిమిత్తం ఉంచాల్సి వస్తుంది. అయితే స్థానికంగా వైద్యుల కొరత మూలంగా అత్యవసర సమయాల్లో వైద్యుల సలహా మేరకు కాగజ్‌నగర్‌, మంచిర్యాల, చంద్రాపూర్‌ తదితర పట్టణాల్లోని ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్తున్నారు. దీంతో నిరుపేదలకు ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి. అలాగే మహిళా గైనకాలజిస్టు లేకపోవడంతో కాన్పు కోసం వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి కాన్పు కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

ఖాళీలు ఇవే..

సిర్పూర్‌(టి) సామాజిక ఆస్పత్రిలో ప్రస్తుతం కేవలం డాక్టర్‌ కేశవ్‌రావు, డాక్టర్‌ నవత మాత్రమే సేవలందిస్తుండగా 13ఖాళీగా ఉన్నాయి. నాలుగు డిప్యూటీ సివిల్‌ సర్జన్‌, ఒక గైనకాలజిస్టు, రెండు అనస్తీషయన్‌, రెండు పిల్లల వైద్యులు, ఒక ఫిజీషియన్‌, ఒక జనరల్‌ సర్జన్‌, ఒక స్కానింగ్‌ ఆపరేటర్‌, ఒక పోస్టుమార్టం సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

ముందుకు రాని వైద్యులు

కాగా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల పోస్టుల భర్తీకి గాను కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ఆధ్వర్యంలో రెండు వారాల క్రితం డీఎంహెచ్‌వో మనోహర్‌ ఇంటర్వ్యూలు నిర్వహించగా కేవలం ఏడుగురు మాత్రమే హాజరైనట్లు ఆస్పత్రి వర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వ ఆస్పత్రిల్లో వైద్యుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించినా కొలువులు చేయడానికి వైద్యులు ముందుకు రావడం లేదన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఆస్పత్రిలో వైద్యుల పోస్టులు భర్తీఅయ్యేలా చూడాలని కోరుతున్నారు. 

ఉన్నతాధికారులకు నివేదికలు పంపించాం..

- డాక్టర్‌ కేశవ్‌రావు, సూపరింటెండెంట్‌, సిర్పూర్‌(టి)

సిర్పూర్‌(టి) సామాజిక ఆస్పత్రిలో వైద్యులు లేకపోవడంతో ఇబ్బందులు కలుగుతున్నాయి. ఆస్పత్రిలో 13 పోస్టు ఖాళీలు ఉన్నాయి. ఖాళీ స్థానాల భర్తీకి రెండు వారాల క్రితం ఇంటర్వ్యూలు నిర్వహించగా ఎవరు కూడా హాజరు కాలేదు. వైద్యుల పోస్టులు భర్తీ అయితే అన్ని విధాల సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదికలు పంపించాం. 

Updated Date - 2021-08-28T03:38:52+05:30 IST