ప్రాజెక్టుల మరమ్మతులకు కూలీల కొరత

ABN , First Publish Date - 2021-05-21T07:02:09+05:30 IST

జిల్లాలోని ప్రధాన నీటిప్రాజెక్టుల మరమ్మతు పనులకు తీవ్రమైన ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

ప్రాజెక్టుల మరమ్మతులకు కూలీల కొరత
లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిన సదర్‌మాట్‌ బ్యారేజీ నిర్మాణం పనులు

లాక్‌డౌన్‌ కారణంగా పనుల కొనసాగింపునకు ఆటంకాలు 

అందుబాటులో లేని మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌ కూలీలు 

అయోమయంలో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్ట్‌ల మరమ్మతులు, కాలువల నిర్మాణ పనులు 

నెల రోజులు దాటితే ఇక పనులు కష్టసాఽధ్యమే!

నిర్మల్‌, మే 19 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని ప్రధాన నీటిప్రాజెక్టుల మరమ్మతు పనులకు తీవ్రమైన ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రాజెక్ట్‌లతో పాటు కాలువల మరమ్మతులకు సైతం అవరోధాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా కరోనా ప్రభావంతో లాక్‌డౌన్‌ విధించకన్నా ముందుగానే మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన వందలాది మంది కూలీలు తమ స్వస్థలాలకు వెనుదిరిగిపోయారు. ఉన్న కొద్ది మంది ఇప్పటికే ముం దుగా కుదుర్చుకున్న ఒప్పంద పనుల్లో తలమునకలవుతున్నారు. కాగా స్థానిక కూలీల్లో సరియైున నైపుణ్యాలు లేని కారణంగా ఈ ప్రాజెక్ట్‌ పనులు వారితో చేయించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికే వర్షాకాల ప్రభావం మొదలవ్వడంతో ఇరిగేషన్‌ అధికారులు ప్రాజెక్ట్‌ల మరమత్తుల విషయంలో ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్ట్‌లన్నీ ప్రస్తుతం కూలీల కొరత కారణంగా మరమ్మతులకు నోచుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా ప్రతీయేటా వేసవికాలంలో ప్రాజెక్ట్‌లకు సంబంధించిన గేట్లకు మరమత్తులు చేయాల్సి ఉంటుంది. గేట్లకు లీకేజీలు ఏర్పడినట్లయితే వాటికి మరమ్మతులుచేసి గ్రీసింగ్‌ను చేపడతారు. దీంతో పాటు లీకేజీలకు పకడ్బందీ మరమ్మతులు చేసి గేట్లు వరద నీటి ప్రవాహాన్ని తట్టుకునే విధంగా పనులు చేపట్టాల్సి ఉంటుంది. అలాగే కాలువలకు బుంగలు పడకుండా పనులు చేయడమే కాకుండా లైనింగ్‌ పనులను కూడా చేపట్టాలి. ఇలా ప్రాజెక్ట్‌లు, కాలువలకు ప్రతియేటా రిపేర్లు చేయడం సేఫ్టీ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా మారింది. ముఖ్యంగా గేట్ల మరమత్తుల పనుల వ్యవహారం స్థానిక కూలీలతో సాధ్యం కాదు. దీని కోసం మహరాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌ కూలీల అవసరం ఏర్పడుతోంది. గేట్ల మరమత్తు పనుల్లో వారికున్న అనుభవం నిర్ణీతకాలంలో పనులు పూర్తయ్యేందుకు దోహదపడుతోంది. ఈ సారి కరోనా కారణంగా కూలీల సమస్య తీవ్రంగా మారింది. లాక్‌డౌన్‌ కన్నా ముందుగానే మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌ కూలీలు తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టానికి చెందిన కూలీలు కూడా ఇప్పటికే తమ స్వస్థలాలకు చేరుకున్నారు. కడెం ప్రాజెక్ట్‌, స్వర్ణ ప్రాజెక్ట్‌, గడ్డెన్నవాగు ప్రాజెక్ట్‌తో పాటు సరస్వతీ కాలువ, కాళేశ్వరం ప్యాకేజీ నంబర్‌ 27,28 కాలువల పనులన్నీ ప్రస్తుతం ఎక్కడికక్కడ స్తంభించిపోవడం ఇరిగేషన్‌ అధికారుల్లో గుబులు రేకేత్తిస్తుండగా.. ఈ ప్రాజెక్ట్‌ కాలువల కింది ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం కడెం ప్రాజెక్ట్‌కు సంబంధించి మాత్రం స్థానిక కూలీలతో పనులు సాగిస్తున్నప్పటికీ.. ఆ పనుల్లో వేగం కనిపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు నైపుణ్య లోపం కూడా స్థానిక కూలీలు చేపట్టే పనులకు ఆటంకాలు సృష్టిస్తున్నాయి. మరో పక్షం రోజుల్లోగా పనులన్నీ పూర్తికానట్లయితే రాబోయే వర్షాలతో ఇక ఆ పనులను నిలిపివేయాల్సి ఉంటుంది. ఇదే జరిగితే ప్రాజెక్ట్‌ల ద్వారా సాగునీటి పంపిణీకి తీవ్రమైన ఆటంకాలు కలగవచ్చని భావిస్తున్నారు. 

ఫ కష్టాల్లో ప్రధాన ప్రాజెక్టులు

గత కొంతకాలం నుంచి మరమ్మతులకు నోచుకోలేక జిల్లాలోని ప్రధాన ప్రాజెక్ట్‌ల పరిస్థితి దయనీయంగా మారింది. కడెం ప్రాజెక్ట్‌కు ప్రస్తుతం స్థా నిక కూలీలతో మరమత్తులు జరుగుతున్నప్పటికీ ఆ పనులన్నీ నిర్ణీత వ్యవధిలో పూర్తవుతాయోలేదోనన్న సంశయాలు నెలకొంటున్నాయి. ప్రస్తుతం స్థానిక కూలీల చేత ప్రాజెక్ట్‌ గేట్లకు మరమ్మతులు చేపడుతున్నారు.  ఈ పనులన్నీ నత్తనడకన సాగుతున్న కారణంగా ఎప్పట్లోగా పూర్తవుతాయోనన్న దానిపై స్పష్టత కనిపించడం లేదు. అధికారులు మాత్రం కూలీల వెంట పడి పనులు చేయించడంలో నిమగ్నమయ్యారు. దీంతో పాటు స్వర్ణ ప్రాజెక్ట్‌ మరమత్తు పనుల విషయమై ఇప్పటికి సందిగ్ధత కొనసాగుతోంది. ఇప్పటి వరకు మరమత్తు పనులు చేపట్టకపోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. అలాగే గడ్డెన్న వాగు ప్రాజెక్ట్‌ పరిస్థితి కూడా గందరగోళమవుతోంది. ఈ మూడు ప్రాజెక్ట్‌లకు ప్రతియేటా మే మొదటి వారంలోనే మరమత్తులు చేపట్టాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్‌ రక్షణచర్యల్లో భాగంగానే ప్రతియేటా ప్రభుత్వం ఈ మరమతులకు ప్రతిపాదనలు స్వీకరించడం, వెంట నే నిధులను మంజూరు చేయడం జరుగుతోంది. ఈ సారి అధికారులు ప్రతిపాదనలు రూపొందించినప్పటికీ సకాలంలో నిధులు విడుదలకాక స్వర్ణ వాగు ప్రాజెక్టు గేట్ల మరమత్తుల పనులు మొదలుకాలేదు. కేవలం పాత నిధులతో కడెం ప్రాజెక్ట్‌ గేట్ల పనులను మాత్రం కొనసాగిస్తున్నారు. ప్రాజెక్ట్‌గేట్ల మరమత్తులు ఇప్పటికీ పూర్తికాకపోవడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్షాలు భారీగా కురిసి రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు చేరుకున్నట్లయితే గేట్ల నుంచి దిగువకు ఆ నీటిని వదలాల్సి ఉంటుంది. గేట్లకు మరమత్తులు సక్రమంగా జరగనట్లయితే రిజర్వాయర్‌లోని నీటిని వదలడానికి ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. 

కాలువల పరిస్థితి దయనీయం

జిల్లాలో వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ప్రధాన కాలువల ప్రాజెక్ట్‌ల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ కాలువలకు ఎప్పటికప్పుడు మరమత్తులు చేపట్టకపోతుండడం శాపమవుతోంది. కాలువల లైనింగ్‌కు మరమత్తులు చేయకపోవడం, అలాగే ఇరువైపులా కట్టలను ధృఢంగా చేయకపోతుండడం ప్రతియేటా సమస్యగా మారింది. కాలువల నుంచి నీటిప్రవాహం మొదలుకాగానే చాలా చోట్ల గండ్లు పడుతుండడం సహజమవుతోంది. ఎస్సారెస్పీ పరిధిలోని సరస్వతీ కాలువతో పాటు స్వర్ణ కాలువలు,జౌళినాళ కాలువ అలాగే గడ్డెన్నవాగు ప్రాజెక్ట్‌ కాలువలకు పూర్తిస్థాయిలో మరమత్తులు జరగలేదు. దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పరిధిలోని 27,28వ నంబర్‌ కాలువల నిర్మాణ పనులు ఇప్పటి వరకు పూర్తికాకపోవడం ఆయకట్టు రైతులకు శాపంగా పరిణమిస్తోంది. యేళ్ల క్రితం చేపట్టిన ఈ కాలువల పనులు ఎప్పటివరకు పూర్తవుతాయోనన్న దానిపై కూడా స్పష్టత లేదు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులను విడుదల చేయని కారణంగానే పనులన్నీ ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. పనులు చేపట్టిన గుత్తేదారులు సైతం నిధుల కొరతతో బిల్లులు రాక చేతులేత్తేశారు. దీంతో కాలువల కింద ఆయకట్టు లక్ష్యం నెరవేరడం లేదు. 

సెఫ్టీ నిబంధనలు గాలికి.. 

ప్రతీప్రాజెక్ట్‌కు ఇరిగేషన్‌శాఖ సెఫ్టీ నిబంధనలను రూపొందిస్తోంది. సెఫ్టీ నిబంధనలు అన్ని సక్రమంగా ఉంటేనే ఆ ప్రాజెక్ట్‌ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తుంటారు. ఇరిగేషన్‌ శాఖ అధికారులు ప్రతీయేటా ప్రాజెక్ట్‌ల వారిగా సెఫ్టీ నిబంధనలు అమలవుతున్నాయోనన్న అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్‌ అధికారులు సైతం సెఫ్టీ నిబంధనలకు ప్రాధాన్యతనిచ్చి దానికి అనుగుణంగా పనులు చేయాలి. గత కొన్ని సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సమయాన కడెం ప్రాజెక్ట్‌ గేట్లకు సంబంధించి  సెఫ్టీ నిబంధనలను విస్మరించడంతో పెద్ద విఫత్తు ఏర్పడింది. సంబందిత అధికారులు తక్షణమే స్పందించి ఆ గేట్లకు యుద్ద ప్రాతిపాదికన నిపుణులతో మరమ్మతులు జరిపించిన కారణంగా విఫత్తు తప్పింది. లేనట్లయితే దిగువ ప్రాంతంలోని గ్రామాలన్నీ ముంపునకు గురయ్యేవి. అప్పట్లో సెఫ్టీ డ్యాం నిబంధనల అమలుపై  శాసనసభ కమిటీ సైతం కడెం ప్రాజెక్ట్‌ను సందర్శించింది. ఈ కమిటీకి ప్రతిపక్ష నాయకుడైనా సమరసింహారెడ్డి చైర్మన్‌గా వ్యవహారించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కడెంతో పాటు స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్ట్‌లకు సంబంధించి కూడా సెఫ్టీ నిబంధనలపై పకడ్భందీగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. చిన్ననిర్లక్ష్యం భారీ మూల్యంగా మారకముందే సంబందిత అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. 

స్థానిక కూలీలతో మరమ్మతు పనులు 

కడెం ప్రాజెక్ట్‌కు సంబంధించి మరమ్మతు పనుల ను స్థానిక కూలీలతో చేయిస్తున్నాం. లాక్‌డౌన్‌ కారణంగా ఇతర రాష్ర్టాలకు చెందిన నైపుణ్యం గల కూలీల కొరత ఉంది. ఇరిగేషన్‌ సిబ్బంది సహకారంతో కూలీలు పనులు నిర్వహిస్తున్నారు. ముందు జాగ్రత్తకు సంబంధించిన పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. సకాలంలో పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 

రాజశేఖర్‌ ( ఈఈ, కడెం ప్రాజెక్ట్‌ )

ఇరిగేషన్‌ పనులపై లాక్‌డౌన్‌ ప్రభావం

 ఈ విషయమై జలవనరులశాఖ నిర్మల్‌ ఈఈ రామారావును సంప్రదించగా.. ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ పనులతో పాటు కెనాల్‌ మరమ్మతు పనులపై లాక్‌డౌన్‌ ప్రభావం స్పష్టంగా ఉందన్నారు. ముఖ్యంగా గోదావరినదిపై నిర్మిస్తున్న సదర్‌మాట్‌ బ్యారేజీ నిర్మాణ పనులను ఇతర రాష్ర్టాల కూలీల చేత నిర్మించాల్సి ఉందని.. కానీ లాక్‌డౌన్‌ కారణంగా కూలీలు సకాలంలో రాలేకపోయారన్నారు. అందుబాటులో ఉన్న కూలీలతో పనులు చేయిస్తున్నామని తెలిపారు. ఇలా జిల్లాలో ని ఆయా సాగునీటి ప్రాజెక్ట్‌ కాలువల మరమ్మతు పనులను ఈజీఎస్‌ కూలీలతో చేయించాల్సి ఉందని.. కానీ కరోనా ఉధృతి కారణంగా పెద్ద సం ఖ్యలో కూలీలు రావడం లేదన్నారు. దీంతో ప్రధాన కాలువల మరమ్మతు  పనులు సక్రమంగా జరగడం లేదన్నారు. ఓ పక్క కరోనా ఉధృతి.. మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా కూలీల కొరతతో పనులు వేగంగా జరగడం లేదని రామారావు వివరించారు. 


Updated Date - 2021-05-21T07:02:09+05:30 IST