ప్రాజెక్టుకు పగ్గాలు

ABN , First Publish Date - 2021-12-26T06:12:57+05:30 IST

ప్రభుత్వం యాసంగిలో వరిపంటను సాగుచేయవద్దని కేవలం ఆరుతడి పంటలను మాత్రమే సాగుచేయాలని ఆంక్షలు అమలు చేయబోతున్న నేపథ్యంలో ఆయా ప్రాజెక్టు నీటిని కూడా కట్టడి చేసే చర్యలు మొదలుపెట్టిందంటున్నారు.

ప్రాజెక్టుకు పగ్గాలు
కడెం ప్రాజెక్టు ఇదే

రబీ నీటికి రాష్ట్ర సర్కార్‌ ని‘బంధనాలు’

కేవలం ఆరుతడి పంటలకే నీటి విడుదల 

ఇక వారబందీ పద్ధతితోనే పంటలకు జలజీవం 

వరి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలనే  నీటిపై నియంత్రణ

నిర్మల్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం యాసంగిలో వరిపంటను సాగుచేయవద్దని కేవలం ఆరుతడి పంటలను మాత్రమే సాగుచేయాలని ఆంక్షలు అమలు చేయబోతున్న నేపథ్యంలో ఆయా ప్రాజెక్టు నీటిని కూడా కట్టడి చేసే చర్యలు మొదలుపెట్టిందంటున్నారు. ప్రతియేటా ఖరీఫ్‌ పంటలు పెద్దమొత్తంలో వర్షధారంపైనే అలాగే బోరు బావులపై ఆధారపడి సాగుచేస్తున్నారు. యాసంగిలో మాత్రమే సాగుచేసే వరికి ఆయా ప్రాజెక్టుల నీరు ఎక్కువగా అవసరమవుతోంది. జిల్లాలో యాసంగి పంటకోసం సాగునీటిని సక్రమంగా విడుదల చే యాలంటూ రైతులు ఆందోళనలు కొనసాగిస్తుండడం జిల్లాలో రివాజు గా మారింది. జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌, కడెం ప్రాజెక్ట్‌, గడ్డెన్న వాగు, స్వర్ణప్రాజెక్ట్‌ల ద్వారా ఆయకట్టుకు ఎంత మేరకు సాగునీరును విడుదల చేయాలనే అంశాన్ని కోటాపద్దతిలో ప్రభుత్వం నిర్ణయిస్తోంది. ఖరీఫ్‌తో పాటు యాసంగి పంటలకు ఆయా ప్రాజెక్ట్‌ల పరిధిలోని కాలువల ద్వారా నీరును విడుదల చేస్తుంటారు. ఖరీఫ్‌లో ప్రాజెక్టుకాలువలకు సంబంధించి నీటిసమస్య అంతగా ఉండకపోతున్నప్పటికి రబీసీజన్‌లోనే నీటివిడుదల వ్యవహారం సమస్యగా మారుతోంది. అయితే ప్ర భుత్వం రాబోయే యాసంగి నుంచి వరిపంట సాగుపై ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు నీటిని కట్టడి చేసే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే యాసంగిలో రైతులు తప్పనిసరిగా ఆరుతడి పంటలను మాత్రమే సాగుచేయాలంటూ హెచ్చరిస్తోంది. ప్రభుత్వ ఆదేశాలను పక్కన పెట్టి ఆరుతడి పంటలనే కాకుండా వరిని సాగుచేసేట్లు అయితే సాగునీటితో పాటు పంట కొనుగోళ్లు, మద్దతు ధరలో తమ బాధ్యత లేదంటూ చేతులేత్తేస్తోంది. దీనికి సంబంధించి రైతులకు యాసంగి సీజన్‌లో కేవలం ఆరుతడి పంటలకు మాత్రమే సాగునీరు అందిస్తామన్న సంకేతాలు పంపుతోంది. ఈ సాగునీటిని కూడా ఆయా ప్రాజెక్ట్‌ల కాలువల పరిధిలో వారబందీ పద్దతిన విడుదల చేస్తామని ముందుగానే సూచిస్తోంది. దీని కోసం గానూ ఆయా ప్రాజెక్ట్‌ల అధికారులు తమ పరిధిలోని ఆయకట్టు రైతులకు వారబందీ పద్దతి నీటి విడుదలై ముందుగానే అప్ర మత్తం చేస్తున్నారు. కేవలం ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేయాలని ఆ పంటలకు సరిపోయేంతగానే సాగునీటిని విడుదల చేస్తామంటూ ఇరిగేషన్‌ అధికారులు రైతాంగానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముందుగా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ , కడెం ప్రాజెక్ట్‌లకు సంబందించిన అధికారులు తమ ఆయకట్టు రైతులకు వారబంధి పద్దతిన నీటి విడుదల సమాచారాన్ని చేరవేస్తున్నారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరిసాగు చేయవద్దని, కేవలం ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేసుకోవాలని కోరుతు న్నారు. అయితే జిల్లాలో ప్రతియేటా ఖరీఫ్‌, రబీసీజన్‌లలో వరి పంటనే పెద్దమొత్తంలో సాగు చేస్తుంటారు. ఇక్కడి భూములు ఎక్కువగా వరి పంట సాగుకే అనుకూలంగా ఉండడంతో వారంతా ప్రత్యామ్నాయ పంటల సాగుకు అంతటా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ముఖ్యంగా ప్రాజెక్ట్‌ల పరిధిలోని కాలువల ద్వారా అనేక చెరువులు నిండిపోతుంటాయి. ఈ చెరువుల కింద పెద్దమొత్తంలో వరి పంట సాగవుతోంది. చెరువుల కిందనే ఎక్కువగా పొలాలు ఉన్నట్లు రైతులు పేర్కొంటున్నారు. అయితే ఈ భూముల్లో ఇప్పటికిప్పుడు వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ఇబ్బందికరంగా మారుతోందని దశల వారీ గా బహుళ పంటల సాగు కోసం ప్రయత్నాలు చేస్తేనే బాగుంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఇరిగేషన్‌ అధికారులు మాత్రం ప్రాజెక్ట్‌లను కట్టడి చేస్తూ యాసంగిలో నీటి విడుదలకు అనేక రకాల షరతులు విధిస్తూ వారబంధి పద్దతిని మాత్రమే అనుసరించబోతున్నారంటున్నారు. 

మొదట ఎస్సారెస్పీ, కడెం పరిధిలో

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ పరిధిలోని సరస్వతీ కాలువ, అలాగే కడెం ప్రాజెక్ట్‌ పరిధిలో తప్పనిసరిగా ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేయాలన్న నిబంధను విధిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్‌ల పరిధిలో ఆరుతడి పంటలను సాగు చేస్తేనే వారబంధి పద్దతిలో నీటిని అందిస్తామన్న హెచ్చరికలను అధికారులు పరోక్షంగా జారీ చేస్తున్నారు. వారం విడిచి వారం నీటిని కాలువల ద్వారా సాగు కోసం అందిస్తామని వారబంధి పద్దతిపై రైతులందరు అవగాహన పెంపొందించుకోవాలని అధికారులు కోరుతున్నారు. వారబంధి పద్దతిలో నీటి విడుదల విషయమై సంబందిత ఆయకట్టు రైతులకు తప్పనిసరిగా సమాచారం అందించి వారందరిని ఆరుతడి పంటల సాగు వైపు మళ్లించే ప్రయత్నాలు చేయాలంటున్నారు. దీని కోసం గాను ఇరిగేషన్‌ అధికారులు, అటు వ్యవసాయ శాఖ అధికారులు ఆరుతడి పంటలపై అలాగే వారబంధి పద్దతిపై నీటిని అందించే విషయంలో రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించనున్నారు. 

నిర్బంధంగా 

ప్రత్యామ్నాయ పంటల సాగు 

ఇప్పటి వరకు వరిపంట సాగును అనేక రకాలుగా ప్రోత్సహించిన ప్రభుత్వం అనూహ్యంగా ఈ యాసంగి నుంచి ఆ పంటలను సాగు చే యవద్దంటూ హెచ్చరికలు జారీచేయడం రైతులను కలవరపెడుతోంది. ప్రతియేటా జిల్లాలో ఖరీఫ్‌, రబీసీజన్‌లకు గానూ పెద్దఎత్తున వరి పంటసాగును సాంప్రదాయంగా వస్తోంది. ప్రభుత్వం వరి పంట కొనుగోలు కేంద్రాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం, అలాగే గిట్టుబాటు ధరలు కల్పిస్తున్న కారణంగా రైతులు ఆ పంటల సాగుకే ఆసక్తి చూ పుతూ వస్తున్నారు. అయితే అనూహ్యంగా గత నాలుగైదు సంవత్సరాల నుంచి వరి పంట దిగుబడులు పెరిగిపోవడం, ఆ పంటనిల్వ, రవాణా లాంటి వ్యవహారాలు గుదిబండగా మారడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి కేంద్రీకరించింది. సాగునీటిని అవకాశాలు జిల్లాలో ఎక్కువగా ఉన్న కారణంగా రైతులు వరిపంట సాగునే నమ్ముకున్నారు. అయితే ప్రస్తుత ఆంక్షల కారణంగా యాసంగి సీజన్‌ నుంచి వరి సాగు చేస్తే తమ బాధ్యత కాదని సాక్ష్యాత్తు ప్రభుత్వమే ప్రకటించడంతో ఇక ప్రత్యామ్నాయ పంటలసాగు నిర్భంధం కాబోతోందంటున్నారు. 

వారబందీ పద్ధతిలోనే.... 

కాగా యాసంగిలో కేవలం వారబంధి పద్దతి ద్వారానే ప్రధాన ప్రాజెక్టులు, కాలువల ద్వారా సాగునీటిని అందించనున్నాయి. దీనికి సంబంధించి అధికారులు ఆయకట్టు రైతులను అప్రమత్తం చేస్తున్నారు. ఆన్‌ ఆఫ్‌ పద్దతిలో మొత్తం ఆరు తడుల కోసం కాలువల ద్వారా నీటిని అందించేందుకు కడెం ప్రాజెక్ట్‌ అధికారులు నిర్ణయించారు. ఆ తరువాత శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ అధికారులు సైతం సరస్వతీ కాలువకు కూడా ఆరుతడి పద్దతినే అనుసరించనున్నారు. దీనికి సంబందించి రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించనున్నారు. యాసంగి చివరిలో నీటి విషయమై సమస్యలు తలెత్తవద్దన్న ఉద్దేశంతోనే అధికారులు రైతులను ముందస్తుగా అప్రమత్తం చేస్తున్నారు. 


Updated Date - 2021-12-26T06:12:57+05:30 IST