కొనుగోళ్లకు సన్నద్ధం
ABN , First Publish Date - 2021-10-29T06:16:32+05:30 IST
జిల్లాలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు దిశగా సంబంధిత యంత్రాంగం సీరియస్‌గా కసరత్తు ప్రారంభించింది.
జిల్లాలో 185 కేంద్రాల ఏర్పాటుకు రంగం సిద్ధం
ఆలస్యంపై అన్నదాతల ఆగ్రహం
కొనుగోలులో కోతల గత అనుభవాలపై రైతుల ఆందోళన
సమస్యగా మారనున్న గన్నీబ్యాగుల కొరత
నిర్మల్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు దిశగా సంబంధిత యంత్రాంగం సీరియస్‌గా కసరత్తు ప్రారంభించింది. పొరుగు జిల్లాల్లో ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అవుతుండగా జిల్లాలో మాత్రం వీటిని ఆలస్యంగా ఏర్పాటు చేస్తుండడం అన్నదాతల ఆగ్రహానికి కారణమవుతోంది. ఈ క్రమంలోనే బుధవారం సారంగాపూర్ మండలంలోని ఆలూర్ గ్రామం లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మొట్టమొదటగా ప్రారంభించారు. అయితే మరో 184 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. అధికారులు అన్ని కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాల కల్పనపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఎలక్ర్టానిక్ కాంటాల ఏర్పాటుతో పాటు గన్నీబ్యాగుల సమీకరణను పూర్తి చేశారు. అలాగే కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందు లు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై కార్యాచరణ ఊపందుకుంటోంది. జిల్లాలో మొత్తం 185 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చే యాలని నిర్ణయించారు. ఇందులో నుంచి ఐకేపీ ఆధ్వర్యంలో 24, పీఏసీ ఎస్‌ల ఆధ్వర్యంలో 121, డీసీయంయస్ ఆధ్వర్యంలో 35, జీపీసీయంఎస్ ఆధ్వర్యంలో 05 సెంటర్‌లను ఏర్పాటు చేయబోనున్నారు. కాగా జిల్లాలో ఈ సారి రైతులు 95వేల ఎకరాల్లో వరిసాగును చేపట్టారు. దీనికి సం బంధించి 1,30,385 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే గత కొంతకాలం నుంచి ప్రతియేటా ఖరీఫ్, రబీసీజన్‌లలో ధాన్యం దిగుబడుల అంచనా రెట్టింపవుతున్న సంగతి తెలిసిందే. ఇబ్బడి ముబ్బడిగా దిగుబడులు వస్తున్న కారణంగా సంఖ్య రెట్టింపవుతోంది. అయితే అధికారులు మొత్తం ధాన్యం కొనుగోళ్ల కోసం 15లక్షల గన్నీబ్యాగులు అవసరం కానున్నట్లు లెక్క గట్టారు. ఇందులో నుంచి 9లక్షల గన్నీబ్యాగులను అందుబాటులో ఉంచారు. మిగతా 7లక్షల గన్నీబ్యాగులను సేకరించాలని కూడా యోచిస్తున్నారు. గతంలో గన్నీబ్యాగుల కొరత కారణంగా కొనుగోళ్ల ప్రక్రియకు ఆటంకం ఏర్పడిన సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోలు ఎంత ముఖ్య మో ఆ ధాన్యాన్ని గన్నీబ్యాగుల్లో నింపి నిల్వ చేయడం కూడా అంతే ముఖ్యమంటున్నారు. ఇదిలా ఉండగా చాలా గ్రామాల్లో ఇప్పటికే వరి పంట కోతలు ప్రారంభమై ఊపందుకున్నాయి. చాలా మంది రైతులు ఎప్పటి మాదిరిగానే తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి అక్కడే నిల్వ ఉంచుతున్నారు. అయితే ఆ కొనుగోలు కేంద్రాలు అధికారికంగా ప్రారంభంకాకపోవడంతో రైతులు తాము తీసుకువచ్చిన ఽధాన్యాన్ని అక్కడే నిల్వ ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్న వాదనలున్నాయి. దీంతో పంటలకు పలు రకాలుగా నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదంటున్నారు. ప్రభుత్వం రాబోయే వరి సీజన్ నుంచే ధాన్యం కొనుగోలు చేయమంటూ పరోక్ష సంకేతాలు జారీ చేస్తున్న క్రమంలో ప్రస్తుత కొనుగోళ్లపై ఎంత మేరకు ప్రభావం ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంటోంది.
కోతలు పునరావృతం కావద్దంటున్న రైతులు
ఇదిలా ఉండగా మొన్నటి రబీసీజన్‌లో జరిగిన ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం అంతటా విమర్శలకు ఆస్కారమిచ్చింది. చాలా కొనుగోలు కేంద్రాల్లో కొంతమంది అక్కడి నిర్వాహకులు కొనుగోళ్లలో రకరకాలుగా కోతలు విధించి అన్నదాతను నట్టేట ముంచినట్లు చెబుతున్నారు. రైతుల అమాయకత్వం అవసరాన్ని ఆసరాగా చేసుకున్న నిర్వాహకులు రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంలో బహిరంగంగానే కోతలు విధించడం వివాదానికి కారణమయ్యింది. క్వింటాల్‌కు 3 నుంచి 6 కిలోల వరకు ధాన్యంలో కోతలు విధించారని పేర్కొంటున్నారు. అయితే చాలా గ్రామాల్లో దీనిపై రైతులు నిర్వాహకులను బహిరంగంగానే నిలదీయడం కాకుండా కొన్ని గ్రామాల్లో జరిమానాలు కూడా విధించేట్లు చేశారు. ఇందులో తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా అందరికీ పరోక్ష భాగస్వామ్యం ఉన్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొనుగోలు కేంద్రాల నిర్వహకులు, రైస్‌మిల్లుల యాజమాన్యాలు మిలాఖతై తమకున్న రాజకీయ అండదండలతో మళ్లీ ఈ సారి కూడా కోతలను విధిస్తారేమోనన్న ఆందోళనకు అన్నదాతలు గురవుతున్నారు.
సమస్యగా మారనున్న గన్నీ బ్యాగుల కొరత
అధికారుల అంచనాలకు మించి ఈ సారి ధాన్యం దిగుబడులు రానున్న కారణంగా కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలపై యంత్రాంగం దృష్టి సారించాలని కోరుతున్నారు. ముఖ్యంగా గన్నీబ్యాగుల కొరత లేకుండా చూడాలని సూచిస్తున్నారు. ప్రతియేటా కొనుగోళ్ల చివరి సమయంలో గన్నీ బ్యాగుల కొరత ఏర్పడుతుండడం సహజంగా మారుతోంది. కేంద్రాలకు తరలిస్తున్న ధాన్యానికి అనుగుణంగా గోనే సంచులను అందుబాటులో ఉంచకపోతుండడం సమస్య తీవ్రతకు కారణమవుతోంది. అధికారులు వేసిన అంఛనాల ప్రకారం జిల్లాకు 15లక్షల గోనే సంచులు అవసరం కాగా ఇప్పటి వరకు 9లక్షల గోనే సంచులు మాత్రమే జిల్లాకు వచ్చాయి. మరో 7 లక్షల గన్నీబ్యాగుల అవసరం తప్పనిసరి కానుందంటున్నారు. ఇటు కొనుగోళ్ల ప్రక్రియ సాగిస్తూనే అధికార యంత్రాంగం గన్నీ బ్యాగుల కొరతను కూడా తీర్చేందుకు ప్రయత్నాలు చేయాలని పలువురు కోరుతున్నారు.