విధుల్లో నిర్లక్ష్యం.. ‘అగ్ని’కి ఆజ్యం
ABN , First Publish Date - 2021-05-05T17:35:18+05:30 IST
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం షార్ట్‌సర్క్యూట్‌లకు, అగ్నిప్రమాదాలకు ఆజ్యం పోస్తోంది. వేసవికాలం వచ్చిందటే చాలు షార్ట్ సర్యూట్ ప్రమదాలు...

నిబంధనలకు విరుద్ధంగా కరెంట్ కనెక్షన్లు
తనిఖీ చేయకుండా సర్టిఫికెట్ల జారీ
నకిలీ సర్టిఫికెట్లతో అపార్ట్‌మెంట్లకు..., గోదాముల్లో అక్రమంగా విద్యుత్ వాడకం
హైదరాబాద్ సిటీ: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం షార్ట్‌సర్క్యూట్‌లకు, అగ్నిప్రమాదాలకు ఆజ్యం పోస్తోంది. వేసవికాలం వచ్చిందటే చాలు షార్ట్ సర్యూట్ ప్రమదాలు ఎక్కడ జరుగుతాయోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శివారుప్రాంతాల్లో కొత్తగా నిర్మించే అపార్ట్‌మెంట్లకు సైతం నకిలీసర్టిఫికెట్లతో విద్యుత్‌కనెక్షన్లు ఇస్తూ అధికారులు చేతులు దులుపుకోవడంతో షార్ట్‌సర్క్యూట్ ప్రమాదాలు పెరుగుతున్నాయి. గ్రేటర్‌జోన్ 9 సర్కిళ్ల పరిధిలో 6,82,230 కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. కమర్షియల్ కనెక్షన్ల సంఖ్య ఏటా 5 శాతం పెరుగుతున్నా వాటిలో సగం కనెక్షన్ల విషయంలో ఎలాంటి నిబంధనలూ పాటించడంలేదు.
కొంతమంది వ్యాపారంలో నష్టాలు వస్తే షార్ట్‌సర్యూట్ పేరుతో ప్రమాదాలు సృష్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రతిఏటా నగరంలో జరుగుతున్న విద్యుత్ ప్రమాదాల్లో 30 శాతం షార్ట్‌సర్క్యూట్ కారణంగానే జరుగుతున్నాయని అధికారులు ధ్రువీకరిస్తున్నారు. వేసవికాలంలో షార్ట్‌సర్క్యూట్ ప్రమాదాలు ఎక్కువ జరిగేందుకు అవకాశాలున్నా విద్యుత్ శాఖ వాటి నియంత్రణకు ఎలాంటిచర్యలూ తీసుకోవడం లేదు. 15 విద్యుత్ మీటర్లు దాటిన భవనాలు, 50 కిలో వాట్ల సామర్థ్యంపైన ఉన్న పరిశ్రమలు, కొత్తగా ఏర్పాటు చేస్తున్న కంపెనీలకు హెచ్‌టీ విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు సీఈఐజీ(విద్యుత్ తనిఖీశాఖ) ద్వారా సర్టిఫికెట్లు తీసుకోవాలి. కానీ కొంతమంది ప్రైవేట్ కాంట్రాక్టర్లు నకిలీ సరిఫికెట్లు తయారుచేస్తూ వాటితో విద్యుత్ కనెక్షన్లు తీసుకుంటున్నారు. నకిలీ సర్టిఫికెట్లతో కనెక్షన్లు జారీ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గత సంవత్సర కాలంగా సైబర్‌సిటీ సర్కిల్‌లో 3321 బహుళ అంతస్థుల భవనాలు నిర్మిస్తే వాటిలో 40 శాతం పైగా భవనాలకు ఎలాంటి తనిఖీలూ చేయకుండానే విద్యుత్‌కనెక్షన్లు ఇచ్చేశారు.
లోడ్ చెక్ చేయరు...కనెక్షన్లు పట్టించుకోరు..
గ్రేటర్‌లో నాలుగేళ్లుగా విద్యుత్ డిమాండ్ రికార్డుస్థాయిలో పెరుగుతోంది. డొమెస్టిక్ కనెక్షన్లతో పాటు కమర్షియల్, హెచ్‌టీ కనెక్షన్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే విద్యుత్‌శాఖ అధికారులు లోడ్ చెక్‌చేయకుండానే కొత్త కనెక్షన్లను ఇష్టానుసారంగా మంజూరు చేస్తుండడంతో ప్రమాదాలు జరిగేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. రాజేంద్రనగర్, అల్లాపూర్, కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్, చార్మినార్, సున్నంచెరువు, తుమ్మిడికుంట. కొండాపూర్, హాఫీజ్‌పేట్ ప్రాంతాల్లో కొందరు వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటూ అక్రమంగా విద్యుత్ వినియోగిస్తుండటంతో సంబంధిత ఫీడర్లపై అధిక లోడ్ పడుతోంది.
తనిఖీలు లేకుండా సర్టిఫికెట్లు
ప్రైవేటు కంపెనీలు, వ్యాపార సంస్థలు, అపార్ట్‌మెంట్లకు విద్యుత్‌కనెక్షన్లు ఇచ్చే ముందు పూర్తిస్థాయిలో అధికారులు తనిఖీలు చేయాలి. కానీ పలు ప్రాంతాల్లో తనిఖీలు లేకుండా సర్టిఫికెట్లు జారీచేస్తుండటంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. హెచ్‌టీ కనెక్షన్ కోసం విద్యుత్ తనిఖీ శాఖ ఇస్తున్న సర్టిఫికెట్ల జారీలో కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారు. శివారు ప్రాంతాలతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో పలు వ్యాపార సంస్థలు అనుమతులు లేకుండానే గోదాములు నిర్వహిస్తున్నాయి.
విద్యుత్‌శాఖ నిబంధనల ప్రకారం గోదాములకు విద్యుత్‌కనెక్షన్ ఇవ్వకూడదనే నిబంధనలున్నాయి. అయినా స్థానిక అధికారులకు అడిగినంత డబ్బులు చెల్లిస్తూ విద్యుత్ కనెక్షన్లు తీసుకుంటున్నారు. కాటేదాన్, బేగంబజార్, చార్మినార్, సికింద్రాబాద్, ఆబిడ్స్, కోఠి, అఫ్జల్‌గంజ్‌తో పాటు పలు ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో నిర్వహిస్తున్న గోదాముల్లో విద్యుత్‌కనెక్షన్లు ఉన్నా వాటిని చూసీచూడనట్లు వదిలేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.