ఆపరేషన్‌ పెద్దపులి

ABN , First Publish Date - 2021-01-13T04:25:32+05:30 IST

జిల్లా ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులిని బంధిం చేందుకు అటవీశాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది.

ఆపరేషన్‌ పెద్దపులి
బెజ్జూరు మండలం గొల్లదేవర సమీపంలో ఏర్పాటు చేసిన బోను

-వ్యాఘ్రాన్ని బంధించేందుకు తీవ్ర యత్నాలు

-అటవీ ప్రాంతాల్లో బోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు

-రంగంలోకి టైగర్‌ ట్రాకర్లు

బెజ్జూరు జనవరి12: జిల్లా ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులిని బంధిం చేందుకు అటవీశాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే జిల్లాలో పెద్దపులి పంజాకు ఇద్దరు గిరిజనులు మృతిచెందారు. గత నవంబరు 11న దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన విఘ్నేష్‌ అనే యువకుడిని పులి హతమార్చింది. అదేనెల 29న పెంచికలపేట మండలం కొండపెల్లికి చెందిన నిర్మల అనే బాలికను పొట్టన పెట్టుకుంది. ఈ క్రమంలో రెండు నెలలుగా పెద్దపులిని పట్టుకు నేందుకు అటవీశాఖ సిబ్బంది శ్రమిస్తున్నారు. 

నిరంతరం నిఘా

పెద్దపులిని పట్టుకోవడానికి అటవీశాఖ అధికా రులు నిరంతంర నిఘా పెడుతున్నారు. ఇందులో భాగంగా బెజ్జూరు, పెంచికలపేట, దహెగాం మండ లాల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో బోన్లు, సీసీ కెమెరాలు అమర్చారు. అంతేకాకుండా 60 మంది టైగర్‌ ట్రాకర్లను ఏర్పాటు చేశారు. వీరు నిత్యం అటవీ ప్రాంతంలో సంచరిస్తూ పులి కదలి కలను గుర్తించే పనిలో ఉన్నారు. పులి కదలికలను ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల్లో పరిశీలిస్తూ అది ఎటు నుంచి ఎటువైపు వెళ్తుందో పసిగట్టే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. 

చివరి అస్త్రంగా మత్తు మందు ప్రయోగం

పెద్దపులిని పట్టుకోవడానికి ఇదివరకే బోన్లు ఏర్పాటు చేసిన అధికారులు ఇక చివరి ప్రయత్నంగా మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి పట్టుకోవాలని నిర్ణయించారు. బోన్లతో పాటు అటవీ ప్రాంతాల్లో మంచెలు ఏర్పాటు చేశారు. తలాయి సమీపంలో కందిబీమన్న అటవీ ప్రాంతంలో పులిని పట్టుకోవడానికి ఆవును ఎరగా ఉంచగా దాన్ని సోమవారం చంపి వేయడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆవును చంపిన పులి మళ్లీ తినడానికి వచ్చే సమయంలో షూటర్ల సహాయంతో మత్త మందు ఇచ్చి బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పులిని పట్టుకోవడానికి ఎరవేసిన ప్రాంతంలో మంచెను ఏర్పాటు చేశారు. పశువుపై పులిదాడి చేయడానికి రాగానే మత్తు మందును ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం రెస్క్యూ టీం, మత్తు మందు షూటర్లు, వైద్యులు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈవిషయాలను అటవీ అధికారులు   అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. పులిని పట్టుకు నేందుకు జిల్లా కన్జర్వేటర్‌ వినోద్‌ కుమార్‌ బెజ్జూర్‌లోనే మఖాం వేశారు. కన్జర్వేటర్‌ పర్యటనను సైతం సిబ్బంది గోప్యంగా ఉంచారు. 

వ్యూహం ఫలించేనా?

మనుషులపై దాడులు చేస్తున్న పెద్దపులిని కట్టడి చేయడానికి అటవీ అధికారులు వ్యూహం ఇకనైనా ఫలిస్తుందా అనే చర్చ జరుగుతోంది. పులిని పట్టుకో వడానికి విస్తృతంగా కెమెరా ట్రాపుల ఏర్పాటు, టైగర్‌ ట్రాకర్ల బృందాలను నియమించి కదలికలను ఎప్పటికప్పుడు నిఘా వేస్తున్నారు. ఇప్పటికే పెద్దపులి దాడిలో ఇద్దరు మరణించడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో అటవీశాఖ అప్రమత్తమైంది. మనుషులపై దాడి చేసిన పులిని కూడా అటవీ అధికారులు గుర్తించినట్లు సమా చారం. అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పడం లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మహారాష్ట్ర నుంచి వచ్చిన ఎ2 పులే ఇద్దరిని చంపింది. అయితే ఈ విషయాన్ని అధికారులు నిర్ధారించడం లేదు. ఏదిఏమైనా సాధ్యమైనంత త్వరగా పులిని పట్టుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

పెద్దపులి పట్టుకొని తీరతాం: జిల్లా కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌  

పెద్దపులిని పట్టుకొని తీరుతామని జిల్లా కన్జర్వేటర్‌ ఫారెస్ట్‌ వినోద్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం కంది భీమన్న అటవీ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపులిని పట్టుకునేందుకు 40 మంది సిబ్బందితో పర్యవేక్షిస్తున్నామన్నారు. అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేసి నిఘా కొనసాగిస్తామన్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణులతో పర్యవేక్షణ కొనసాగుతుందని, పులిని పట్టుకునే వరకు ప్రత్యేక క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట డీఎఫ్‌వో శాంతారాం, కాగజ్‌నగర్‌ ఎఫ్‌డీవో విజయ్‌కుమార్‌, రేంజ్‌ అధికారులు దయానంద్‌, వేణుగోపాల్‌, డిప్యూటి రేంజర్‌ శీలానంద్‌ ఉన్నారు. 


Updated Date - 2021-01-13T04:25:32+05:30 IST