ఆర్టీసీలో ఆపరేషన్‌ గుట్కా

ABN , First Publish Date - 2021-11-02T06:19:41+05:30 IST

ఆర్టీసీలో గత కొద్దిరోజుల నుంచి సరికొత్త సంస్కరణలు అమలవుతున్నాయి.

ఆర్టీసీలో ఆపరేషన్‌ గుట్కా

తంబాకు నమిలే వారిపై కఠినచర్యలు 

బస్టాండ్‌లో పాన్‌ మసాలాపైనా గురి 

బస్సుల శుభ్రతకు ప్రత్యేక యాక్షన్‌ప్లాన్‌ 

ఆదేశాలు అతిక్రమిస్తే వేటుకు రంగం సిద్ధం 

నిర్మల్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : ఆర్టీసీలో గత కొద్దిరోజుల నుంచి సరికొత్త సంస్కరణలు అమలవుతున్నాయి. ముఖ్యంగా గత కొంతకాలం నుంచి గుట్కాలు, పాన్‌ మసాలాలు తింటున్న వారితో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. వీటిని తినేవారు బస్సుల్లోనే ఉమ్మివేయడంతో బస్సులన్నీ దుర్గంధమయవుతున్నాయి. అలాగే బస్సుడ్రైవర్‌లు, కండక్టర్‌లు సైతం గుట్కాలు, పాన్‌మసాలాలు తింటూ డ్రైవింగ్‌ చేస్తున్న కారణంగా వారి ఏకాగ్రతపై ప్రభావం పడుతోంది. గుట్కామత్తులో డ్రైవింగ్‌ చేస్తున్న కారణంగా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి వ్యవహారాలన్నింటినీ ఆర్టీసీ సీరియస్‌గా పరిగణిస్తోంది. సంస్థ ఎండీగా పోలీసు ఉన్నతాధికారి సజ్జనార్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇలాంటి వ్యవహారాలపై సీరియస్‌గా దృష్టి కేంద్రీకరించి ఆ దిశగా కఠినచర్యలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఇక నుంచి ఏ డ్రైవర్‌ గాని, కండక్టర్‌ గాని ఇతర అన్ని రకాల ఆర్టీసీ సిబ్బంది గుట్కా తినడం, తంబాకు నమలడం, పాన్‌మసాలాను వినియోగించడం చేయవద్దంటూ అధికారికంగా హుకూం జారీచేశారు. అలాగే ప్రయాణికులు కూడా గుట్కాలు తిని బస్సులో ఉమ్మి వేయడాన్ని పూర్తిగా నిషేదిస్తున్నట్లు ఆ ఆదేశాల్లో వెల్లడించారు. సంస్థ ఎండీ ఆదేశాలతో ఆర్టీసీలో గుట్కాను వినియోగిస్తున్న సిబ్బంది హడలెత్తిపోతున్నారు. యేళ్ల నుంచి గుట్కా అలవాటు ఉన్న డ్రైవర్‌లు, కండక్టర్‌లు, మెకానిక్‌లు, ఇతర సిబ్బంది ఆ అలవాటును ఎలా మానుకోగలుగుతారోనన్న అంశం ఆసక్తిని రేకేత్తిస్తోంది. ఈ గుట్కాపై నిషేదాస్త్రం అమలు చేసేందు కోసం రూట్ల వారిగా ప్రత్యేక తనిఖీ బృందాలను సైతం నియమించారు. ఈ తనిఖీ బృందా లు ఆకస్మికంగా బస్సులను తనిఖీ చేసి డ్రైవర్‌, కండక్టర్‌లు గుట్కాను వినియోగిస్తున్నారో లేదోననే అంశాన్ని నిర్ధారించనున్నారు. ఒకవేళ గుట్కాను వినియోగిస్తే వెంటనే ఉన్నతాధికారులకు ఆ విషయాన్ని వివరించనున్నారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోనున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా గుట్కా, తంబాకు, పాన్‌ మసాలాపైనే కాకుండా ఆర్టీసీ బస్టాండ్‌లలో నిషేధిత సరుకుల నాణ్యత అలాగే ధరలపై కూడా సంస్థ ఫోకస్‌ పెడుతోంది. బస్టాండ్‌లలోని హోటళ్లలో అలాగే అక్కడి స్టాల్‌లలో నాణ్యత లేని ఆహార వస్తువులను విక్రయించడం, ఎంఆర్‌పీ ధరల కన్నా ఎక్కువ రేట్లలో వాటిని అమ్ముతుండడం లాంటి అంశాలపై దృష్టి సారిస్తున్నారు. ప్రయాణికులను మోసం చేసే వ్యాపారులపై ఇక నుంచి పకడ్భంధీ చర్యలు చేపట్టనున్నట్లు చెబుతున్నారు. డ్యూటీలో ఉన్నప్పుడు గుట్కాను వినియోగించే వారిపై మొద ట చర్యలకు శ్రీకారం చుట్టబోనున్నారు. కాగా డ్యూటీలో చేరే ముందు తప్పనిసరిగా తాము గుట్కా తినడం లేదన్న విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించాల్సి ఉంటుంది. దీని కోసం ప్రత్యేకంగా రిజిస్ర్టార్‌ను కూడా వినియోగిస్తున్నారు. ఔట్‌గోయింగ్‌ కంట్రోల్‌ చార్జ్‌ పేరిట ఈ రిజిస్ర్టార్‌లను ఏర్పాటు చేయనున్నారు. కాగా డిపోల్లోనే కాకుండా బస్టాండ్‌లలో కూడా గుట్కా, పాన్‌మసాలా తినవద్దని అలాగే వాటిని ఉమ్మివేయవద్దంటూ పెద్దఎత్తున ప్రచారం చేపట్టబోతున్నారు. 

డ్రైవింగ్‌ చేస్తూ గుట్కా తింటే ఇక ఇంటికే..

ఆర్టీసీడ్రైవర్‌లు అలాగే కండక్టర్‌లు తమ డ్యూటీ సమయంలో గు ట్కాలు తింటే ఇక వారిపై సస్పెన్షన్‌ వేటు తప్పదని సంస్థ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు ఎండీ ద్వారా జారీ అయిన మార్గదర్శకాలతో కూడా ఆదేశాలపై విసృతంగా ప్రచారం చేస్తున్నారు. గుట్కా, పాన్‌మసాలా నిరోధించేందుకు ప్రత్యేకబృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ బృందాల తనిఖీల్లో గుట్కాలు తినే వారి వివరాలు బయట పడితే వారిపై చర్యలు తప్పవంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. డ్రైవర్‌, కండక్టర్‌లు డ్యూటీలకు వెళ్లే సమయంలో సంబంధిత అధికారుల వద్ద ఉన్న రిజిస్ర్టార్‌లో సంతకాలు చేయాల్సి ఉంటుంది. అలాగే బస్సుల్లో గుట్కాలు తింటూ ఉమ్మివేయడంపై కూడా అధికారులు సీరియస్‌గా చర్యలు తీసుకోబోతున్నారు. 

విస్తృతస్థాయిలో అవగాహన

ఇదిలా ఉండగా డ్రైవర్‌లు, కండక్టర్‌లు, మెకానిక్‌లు, ఇతర సిబ్బంది డ్యూటీ సమయాల్లో గుట్కాలు, పాన్‌మసాలాలు తినవద్దన్న అంశంపై పెద్దఎత్తున ప్రచారం చేపట్టనున్నారు. డిపోల్లోనే కా కుండా బస్టాండ్‌లలో ఫైన్‌బోర్డుల ద్వారా కర పత్రాలు, వాల్‌పోస్టర్ల ద్వారా ప్రచారం చేపట్టాలని నిర్ణయించారు. వివిధ రకాల సిబ్బందిని పర్యవేక్షించే అధికారులు తమ పరిధిలోని సిబ్బందికి గుట్కా విషయంపై పూర్తి అవగాహన కల్పించనున్నారు. గుట్కా వలన చేకూరే నష్టాలను, ప్రయాణికులకు కలిగే ఇబ్బందులను వివరించేందుకు చర్యలు తీసుకోబోతున్నారు. ఇలా పూర్తిస్థాయిలో అవ గాహనతో ఆర్టీసీలో ఇక గుట్కా, పాన్‌మసాలా పూర్తిగా వినియోగాన్ని తెర మరుగు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. 

క్యాంటీన్‌లు, స్టాల్స్‌పైనా నజర్‌

ఆర్టీసీ బస్టాండ్‌లలో కొనసాగుతున్న క్యాంటీన్‌లు అలాగే వివిధ రకాల వస్తువులను విక్రయించే స్టాల్స్‌పైనా అధికారులు దృష్టి సారించబోతున్నారు. ముఖ్యంగా క్యాంటీన్లలోని ఆహర వస్తువుల్లో నాణ్యత ఉండడం లేదన్న ఆరోపణలతో పాటు అధిక ధరలకు విక్రయిస్తుండడం, అలాగే స్టాల్స్‌లో అమ్ముతున్న వస్తువుల్లో కూడా నాణ్యత లేకపోవడం, వాటిని ఎక్కువ ధరలకు అమ్ముతుండడం సాధారణమైందంటున్నారు. ప్రయాణికులు ఈ అంశంపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదన్న వాదనలున్నాయి. అయితే ఎట్టకేలకు అధికారులు ఇటువైపు దృష్టి కేంద్రీకరించారు. క్యాంటీన్‌లలో నాణ్యతను పాటించకపోవడం అలాగే ఆహర వస్తువులను అధిక ధరలకు విక్రయించే నిర్వాహకులపై చర్యలు చేపట్టబోతున్నారు. వారి లైసెన్సులను రద్దు చేసి ఈఎండీని జప్తు చేయనున్నారు. అలాగే స్టాల్స్‌ నిర్వహకులపై కూడా ఫిర్యాదులు వస్తే అప్పటికప్పుడే విచారణ జరిపి చర్యలు చేపట్టబోతున్నారు. మొత్తానికి ప్రయాణికులను మోసాల నుంచి కాపాడడమే కాకుండా వారికి అన్ని రకాల సౌకర్యాలను సమ కూర్చి సంస్థను కాపాడడమే ద్యేయంగా పెట్టుకుంటున్నారు. 

Updated Date - 2021-11-02T06:19:41+05:30 IST