అధికారులు సమన్వయంతో పనిచేయాలి

ABN , First Publish Date - 2021-10-30T04:57:21+05:30 IST

జిల్లాలో అటవి సంపదను కాపా డేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు.

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

ఆదిలాబాద్‌టౌన్‌, అక్టోబరు29: జిల్లాలో అటవి సంపదను కాపా డేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులతో అటవీ సంరక్షణ, గంజాయి, గుడుంబా వినియోగం వంటి అంశాలపై ముందస్తు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో అడవులను సంరక్షించాలని, సంబంధిత శాఖల సహకారంతో అటవీ క్షేత్రాలను, సంపదను కాపాడాలని సూచించారు. జిల్లాలో గంజాయి, గుడుంబా వినియోగంపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గంజాయి సాగుచేస్తున్న ప్రాంతాలలోని వారిని గుర్తించి కౌన్సెలింగ్‌ నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ రవీందర్‌రాజు మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, గుడుంబాను సంపూర్ణంగా నిర్మూలించేందుకు శాఖ పరంగా చర్యలు తీసు కుంటున్నామన్నారు. సమాచారం అందిన వెంటనే ఆయా ప్రాంతాలకు చేరుకుని గంజాయి మొక్కలను ధ్వంసం చేయడం జరుగుతుందని తెలిపారు. పత్తి, పసుపు తదితర పంటల మధ్యలో గంజాయి సాగు జరుగుతుందని అన్నారు. అటవీ ప్రాంతాలలో గంజాయి సాగు చేస్తున్నట్లు కూడా సమాచారం ఉందని, కొంత మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులు గంజాయి వినియోగిస్తున్నట్లు కూడా సమాచారం వచ్చిందని వారికి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రలోభాలకు లొంగి గంజాయి సాగు చేయవద్దని రైతులకు తెలియజేశామన్నారు. గిరిజన ప్రాంతాలలో ఇప్పపువ్వు సారాను వినియోగిస్తున్నారని వివరించారు. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల నుంచి జైనథ్‌, బేల మండలాల్లోని గ్రామాలలో దేశిదారు వినియోగిస్తున్నారని వాటిని కూడా వినియోగించకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీసు, అటవీ, ఎక్సైజ్‌ శాఖల ద్వారా సంయుక్తంగా చర్యలు చేపట్టాలని ఆశించిన ప్రగతి సాధించేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ రాజేశ్‌చంద్ర, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంకిత్‌, అదనపు కలెక్టర్లు నటరాజ్‌, రిజ్వాన్‌భాషా షేక్‌, జిల్లా అటవీ అధికారి రాజశేఖర్‌, ఉట్నూర్‌ అటవీ అభివృద్ధి అధికారి రాహుల్‌జాదవ్‌, ఆర్డీవో రాజేశ్వర్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-30T04:57:21+05:30 IST