నయా సాల్... నయా జోష్
ABN , First Publish Date - 2022-01-01T04:08:40+05:30 IST
కాలం గిర్రున తిరిగింది. కాలగమనంలో మరో ఏడాది కరిగిపోయింది. కోటి ఆశలను రేకెత్తిస్తూ సరికొత్త సంవత్సరం ఆరంభం అయింది. గత చేదు, తీపి మధుస్మృతులకు వీడుకోలు పలుకుతూ జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు.
-2022 కొత్త సంవత్సరంపై కోటి ఆశలు
- జోరందుకున్న మద్యం, మాంసం విక్రయాలు
- కేక్‌లకు భలే గిరాకీ
- ఆనందోత్సవాల్లో మునిగితేలిన యువత
- మార్కెట్లో న్యూ ఇయర్ సందడి
ఆసిఫాబాద్‌రూరల్, డిసెంబరు 31: కాలం గిర్రున తిరిగింది. కాలగమనంలో మరో ఏడాది కరిగిపోయింది. కోటి ఆశలను రేకెత్తిస్తూ సరికొత్త సంవత్సరం ఆరంభం అయింది. గత చేదు, తీపి మధుస్మృతులకు వీడుకోలు పలుకుతూ జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. కొత్త సంవత్సరానికి కొంగొత్త ఆశలతో జిల్లావాసులు స్వాగతం పలికారు. 2021సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. 2022కు స్వాగతం పలుకుతూ శుక్రవారం అర్ధరాత్రి 12గంటలకు జిల్లా కేంద్రంతోపాటు జిల్లా వ్యాప్తంగా యువత కేరింతలతో హంగామా చేశారు. తమ ఆశలు ఫలించాలని, కోరికలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ న్యూఇయర్‌కు వెల్కమ్ చెప్పారు. డిసెంబర్ 31ని చిరకాలం గుర్తుండి పోయే ఓ కమ్మని తీపి గుర్తుగా ఘనంగా జరుపుకోవడానికి శుక్రవారం ఉదయం నుంచే పట్టణమంతా సిద్ధమైంది. వస్తువుల కొనుగోళ్లతో మార్కెట్లో సందడిగా కనిపించింది. రాత్రి 12గంటల సమయంలో వేడుకలు జరుపుకోవడానికి యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు సంసిద్ధులయ్యారు. కళాశాలలు, పాఠశాలల్లో రాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు సిద్ధం చేసుకున్నారు.
జోరుగా మాంసం, మద్యం విక్రయాలు
వేడుక అంటే జోష్, ఎంజాయ్. మధ్యాహ్నం నుంచే మాంసం విక్రయాలు కొనసాగగా మద్యం షాపుల వద్ద సందడి కనిపించింది. పార్టీలు జరుపుకోవడానికి వేదికలను వెతుక్కున్నారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు విభిన్న వంటకాలను తెప్పించుకొని రుచులను ఆస్వాదించారు.
కేకులకు భలే గిరాకీ
నూతన సంవత్సరంలో వాహనాలు కొనుగోలు చేయాలనే కోరికతో ద్విచక్ర వాహనాల నుంచి మొదలు భారీ వాహనాల వరకు కొనుగోళ్లు జరిగాయి. ఇక జిల్లా అంతా పలుచోట్ల ఏర్పాట్లు చేసిన కేకుల దుకాణాలు, బేకరీల వద్ద యువత, విద్యార్థుల సందడి కనిపించింది. వస్త్రనిలయాలు, వ్యాపార సంస్థల వద్ద మహిళలు తమకు నచ్చిన వస్త్రాలు, వస్తువులు కొంటూ కనిపించారు. రయ్‌మని కొత్త బైకులపై కుర్రకారు షికారు చేస్తూ హ్యాపీ న్యూయర్ అంటూ అరుపులతో ఎంజాయ్ చేశారు. జనవరి 1కి స్వాగతం చెబుతూ తమ ఇళ్ల లోగిళ్లను రంగులమయం చేసేందుకు రంగులను, టపాసులనుకొనుగోలు చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
పోలీసుల బందోబస్తు
న్యూ ఇయర్ వేడుకల్లో ఎలాంటి అపశృతులు చోటు చేసుకోకుండా జిల్లాలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమయ్యారు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పోలీసు సబ్‌డివిజన్ పరిధిలో డీఎస్పీల ఆధ్వర్యంలో సీఐలు, ఎస్సైలు ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేక తనిఖీ చేపట్టారు.
కాగజ్‌నగర్: పట్టణంలోని పలు బేకరీల్లో కొత్త సంవత్సర వేడుకలకు భారీగా కేక్‌లు సిద్ధం చేశారు. సాయంత్రం నుంచి వివిధ బేకరీల వద్ద సందడి కన్పించింది. కాలనీల్లో యువకులు డ్యాన్సులు చేశారు. డీఎస్పీ కరుణాకర్ ఆధ్వర్యంలో సీఐరవీందర్ బందోబస్తు నిర్వహించారు.