జోరుగా మట్టి దందా

ABN , First Publish Date - 2021-12-26T03:32:25+05:30 IST

బెల్లంపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో జోరుగా మట్టి దందా సాగుతోంది. అసైన్డ్‌, ప్రభుత్వ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపడుతున్నారు. ప్రభుత్వానికి లక్షల రూపాయల రాయల్టీని ఎగవేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమాన్ని రెవెన్యూ, మైనింగ్‌ శాఖల అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ భూముల నుంచి అక్రమంగా మట్టి తరలింపు పగలు, రాత్రి అనే తేడా లేకుండా జోరుగా సాగుతోంది.

జోరుగా మట్టి దందా
ట్రాక్టర్‌లో అక్రమంగా నింపుతున్న మట్టి

ప్రభుత్వ భూముల్లో నుంచి మట్టి తరలింపు 

గుంతలుగా ఏర్పడి నిలుస్తున్న నీరు పలు సంఘ

టనల్లో పలువురు మృతి

చోద్యం చూస్తున్న అధికారులు 

బెల్లంపల్లి, డిసెంబరు 25: బెల్లంపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో జోరుగా మట్టి దందా సాగుతోంది. అసైన్డ్‌, ప్రభుత్వ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపడుతున్నారు. ప్రభుత్వానికి లక్షల రూపాయల రాయల్టీని ఎగవేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమాన్ని రెవెన్యూ, మైనింగ్‌ శాఖల అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ భూముల నుంచి అక్రమంగా మట్టి తరలింపు పగలు, రాత్రి అనే తేడా లేకుండా జోరుగా సాగుతోంది. 

ప్రభుత్వ భూముల్లో మట్టి తరలింపు 

బెల్లంపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో అసైన్డ్‌, ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. మండలంలోని కన్నాల శివారులో, కాసిరెడ్డిపల్లి, చిన్నబుగ్గ, ప్రభుత్వ ఆసుపత్రి వెనుక, కన్నాల బస్తీ, పోచమ్మ చెరువు వెనుక, పెద్దబూద సమీపంలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ మట్టి తవ్వకాలకు  అడ్డూఅదుపు లేకుండాపోతుంది. మట్టిని అక్రమంగా తరలించేందుకు ఎక్స్‌కావేటర్లతో తవ్వి లారీలు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఇటుక తయారీ, వెంచర్లలోకి  పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా రోజు దాదాపు వందకు పైగా ట్రిప్పుల మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌ ట్రిప్పునకు రూ. 500 నుంచి 1000 వసూలు చేస్తున్నారు. 

నిబంధనలకు విరుద్ధంగా

ఇటీవల కొందరు అక్రమ మట్టి దందాకు తెరలేపారు. ట్రాక్టర్‌ యజమానులతో కుమ్మక్కై పెద్ద ఎత్తున ఎక్స్‌కావేటర్లను తీసుకువచ్చి ఆయా గ్రామాల్లో మట్టిని తరలిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల్లో, చెరువు ప్రాంతాల్లోని మట్టిని తీసి తరలిస్తున్నారు. నిబంధనల ప్రకారం రెవెన్యూ, మైనింగ్‌ శాఖల నుంచి అనుమతులు తీసుకుని మట్టిని తరలించాలి. క్యూబిక్‌ మీటరు చొప్పున గనుల శాఖకు రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది.  ఇందులో కొంత మొత్తం సీనరేజీ నిధులుగా గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ ఖాతాల్లోకి చేరుతాయి. అంతేకాకుండా నిబంధనల మేరకు మూడు మీటర్ల లోతు వరకు మాత్రమే మట్టి తవ్వాలి. కానీ అక్రమార్కులు నిబంధనలను ఉల్లంఘించి ప్రతీ చోట 8 నుంచి 10 మీటర్ల లోతులో తవ్వుతున్నారు. ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వకాలతో పెద్ద పెద్ద గోతులు ఏర్పడుతున్నాయి. దీంతో ఈ భూములు దేనికి పనికి రాకుండా పోతుండడంతోపాటు వర్షాకాలం నీరు చేరి ప్రమాదకర గుంతలుగా మారుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు మండలంలో అక్రమంగా కొనసాగుతున్న మట్టి దందాకు అడ్డుకట్ట వేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. 

అనుమతి లేకుండా తరలిస్తే చర్యలు

కుమారస్వామి, తహసీల్దార్‌

నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా ఎవరైనా మట్టి తవ్వకాలు చేపడితే కఠినచర్యలు తీసుకుంటాం. మట్టి తరలిస్తే ట్రాక్టర్లు, ఎక్స్‌కావేటర్లను సీజ్‌ చేస్తామని, ఎవరైనా ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వకాలు చేపడితే సమాచారం అందించాలని సూచించారు.

Updated Date - 2021-12-26T03:32:25+05:30 IST