మానవ వ్యర్థాలతో ఎరువు తయారీ!

ABN , First Publish Date - 2021-11-06T03:25:46+05:30 IST

మానవ వ్యర్థాలతో ఎరువును తయారు చేసే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇందుకోసం ఎఫ్‌ఎస్‌టీపీ (ఫీకల్‌ స్లడ్జ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌)లను నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 71 పాత మున్సిపాలిటీలను ఇందుకోసం ఎంపిక చేశారు. జిల్లాలోని మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి మున్సిపాలిటీలలో ఒక్కొక్కటి సుమారు రూ.4 కోట్లతో ఎఫ్‌ఎస్‌టీపీ ప్లాంట్లు ఏర్పాటు చేయనుండగా ఇప్పటికే టెండర్‌ ప్రక్రియ పూర్తయింది.

మానవ వ్యర్థాలతో ఎరువు తయారీ!
ఎఫ్‌ఎస్‌టీపీ నమూనా

జిల్లాకు మూడు ఎఫ్‌ఎస్‌టీ ప్లాంట్లు మంజూరు

ఇప్పటికే స్థలాలు కేటాయించిన మున్సిపాలిటీలు

త్వరలో ప్రారంభం కానున్న నిర్మాణ పనులు 

స్థలం ఎంపిక పట్ల మంచిర్యాలలో ప్రజల అభ్యంతరం

మంచిర్యాల, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): మానవ వ్యర్థాలతో ఎరువును తయారు చేసే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇందుకోసం ఎఫ్‌ఎస్‌టీపీ (ఫీకల్‌ స్లడ్జ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌)లను నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 71 పాత మున్సిపాలిటీలను ఇందుకోసం ఎంపిక చేశారు. జిల్లాలోని మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి మున్సిపాలిటీలలో ఒక్కొక్కటి సుమారు రూ.4 కోట్లతో ఎఫ్‌ఎస్‌టీపీ ప్లాంట్లు ఏర్పాటు చేయనుండగా ఇప్పటికే టెండర్‌ ప్రక్రియ పూర్తయింది. ప్లాంట్‌ నిర్మాణానికి అవసరమైన ఎకరం స్థలాన్ని ఆయా మున్సిపాలిటీలు కాంట్రాక్టర్లకు అప్పగించగా అగ్రిమెంట్‌ ప్రక్రియ కూడా పూర్తయింది. త్వరలో ప్లాంట్‌ నిర్మాణ పనులు చేపట్టనుండగా మూడు నెలల వ్యవధిలోపు పూర్తి చేయనున్నారు. ప్లాంట్‌ ప్రారంభమైన నాటి నుంచి 30 సంవత్సరాల వరకు సదరు కాంట్రాక్టరే నిర్వహణ బాధ్యతలు చేపడతారు. మున్సిపాలిటీల నుంచి స్థలంతోపాటు అప్రోచ్‌ రోడ్డు, విద్యుత్‌ సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది. మానవ వ్యర్థాలను బయట పడేయం ద్వారా వాతావరణం కలుషితమై ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుండటంతో ప్రభుత్వం ఎఫ్‌ఎస్‌టీపీలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 

పర్యావరణ పరిరక్షణకు దోహదం

పట్టణాల్లో నివాస గృహాల్లోని సెప్టిక్‌ ట్యాంకుల నుంచి మున్సిపాలిటీల ద్వారా లైసెన్సు పొందిన స్లడ్జింగ్‌ ఆపరేటర్లు మురికిని సేకరించి నేరుగా ఎఫ్‌ఎస్‌టీపీలకు తరలిస్తారు. అక్కడ దాన్ని ట్యాంకర్లో డంప్‌ చేసిన తరువాత ఎరువుగా మారుస్తారు. ఇలా తయారు చేసిన ఎరువును తొలుత మున్సిపాలటీల పరిధిలోని మొక్కలకు ఉపయోగిస్తారు. పంట పొలాలకు, చేలకు అవసరమైన రైతులు ఎరువును కొనుగోలు చేసి వినియోగిస్తారు. సాధారణంగా ఇండ్లలోని సెప్టిక్‌ ట్యాంకులు నిండగానే ప్రైవేటు ఆపరేటర్లు దాన్ని సేకరించి బహిరంగ ప్రదేశాల్లో డంప్‌ చేస్తారు. బహిరంగ ప్రదేశాల్లో పారబోయడం మూలంగా వాతావరణం కలుషితమయ్యే ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా చెరువులు, కుంటలు, కాలువలు, నదులు, వాగుల పక్కన పడవేస్తే నీరు కలుషితమై ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. దాన్ని నివారించేందుకు ప్రభుత్వం ఎఫ్‌ఎస్‌టీపీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. సెప్టిక్‌ ట్యాంకుల నుంచి మురికి సేకరించేందుకు ఆపరేటర్లకు మున్సిపాలిటీ లైసెన్సులు మంజూరు చేశాయి. మంచిర్యాల మున్సిపాలిలో నలుగురు, బెల్లంపల్లిలో ఇద్దరు చొప్పున ఆపరేటర్లను ఎంపిక చేసిన అధికారులు వారికి ఇప్పటికే లైసెన్సులు మంజూరు చేశారు. ఇక మీదట ఇండ్లలోని సెప్టిక్‌ ట్యాంకుల నుంచి కేవలం లైసెన్సు పొందిన ఆపరేటర్లు మాత్రమే మురికిని సేకరించవలసి ఉంటుంది. ఇతరులు సేకరించడం, బహిరంగ ప్రదేశాల్లో డంప్‌ చేయడం నిషేధం.

నిబంధనలు ఇలా

ఫీకల్‌ స్లడ్జ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంటు ఏర్పాటు చేసే స్థలం విషయంలో పర్యావరణ శాఖ కొన్ని నిబంధనలు విధించింది. నివాస గృహాలు, మతపరమైన స్థలాలు, విద్యాలయాలు, ఆసుపత్రులు, నీటి ప్రదేశాలు, పార్కులు, రోడ్లకు నిర్ణీత దూరంలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. జాతీయ రహదారికి 100 మీటర్లు, రాష్ట్ర రహదారికి 50 మీటర్లు, అంతర్గత రోడ్ల నుంచి 25 మీటర్లు, నదుల నుంచి 100 మీటర్లు, చెరువులు, కొలనుల నుంచి 200 మీటర్లు, నివాస గృహాలు, పార్కులు, మంచినీటి బావులు, హైవేలకు 200 మీటర్ల దూరంలో ఎఫ్‌ఎస్‌టీపీ ఏర్పాటుకు  స్థలం కేటాయించాల్సి ఉంటుంది. 

అభ్యంతరాల వెల్లువ

మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని సాయికుంట ఎఫ్‌ఎస్‌టీపీ కోసం అధికారులు స్థలం కేటాయించారు. స్థలం నివాస గృహాలకు దగ్గరంగా ఉండటంతో స్థానిక ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నివాస గృహాలకు కేవలం 100 మీటర్ల దూరంలో ప్లాంటు నిర్మాణానికి స్థలం కేటాయించడంతో భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఆవేదన చెందుతున్నారు. పర్యావరణశాఖ నిబంధనల మేరకు నివాస గృహాలకు కనీసం 200 మీటర్ల దూరం ఉండాలని,  మరో చోట ప్లాంటు నిర్మాణం చేపట్టాలని స్థానికులు చిప్పకుర్తి శ్రీనివాస్‌, అవునూరి రాజ్‌కుమార్‌, చిప్పకుర్తి జగన్‌, తదితరులు కలెక్టర్‌ భారతి హోళికేరి, స్థానిక ఎమ్మెల్యేకు వినతిపత్రాలు అందించారు. 

ఎలాంటి ప్రభావం ఉండదు

బాలకృష్ణ, మున్సిపల్‌ కమిషనర్‌ 

సాయికుంటలో ఎంపిక చేసిన స్థలం నివాస గృహాలకు దూరంగానే ఉంది. ప్రజలు భయపడుతున్న విధంగా ప్లాంటు నిర్మాణం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఎలాంటి దుర్వాసనగానీ, ఇతరత్రా కలుషితాలు ఉండే అవకాశమే లేదు. ప్లాంటు నిర్మాణం పూర్తయిన తరువాత మొక్కలు పెంచడం వల్ల అక్కడి వాతావరణం పార్కు మాదిరిగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవలసిన అవసరం లేదు.

Updated Date - 2021-11-06T03:25:46+05:30 IST