విభజన వివాదం

ABN , First Publish Date - 2021-06-23T05:21:20+05:30 IST

జాతీయ ఉపాధి హామీ పనుల వ్యవహారం వివాదాలకు దారి తీస్తోంది.

విభజన వివాదం
ఖానాపూర్‌ మండలంలోని తర్లపాడ్‌ అడవుల్లో కందకాలు తవ్వుతున్న ఉపాధి కూలీలు

వివాదాస్పదమవుతున్న ఉపాధి హామీ కూలీల కుల విభజన 

ఎస్సీ, ఎస్టీ స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ మళ్లిస్తున్నారంటూ ఆరోపణలు 

చేసిన పనులకు నిలిచిపోయిన చెల్లింపులు 

దుమారం రేపుతున్న తాజా ఆదేశాలు 

నిర్మల్‌, జూన్‌ 22 ( ఆంఽధ్రజ్యోతి )  : జాతీయ ఉపాధి హామీ పనుల వ్యవహారం వివాదాలకు దారి తీస్తోంది. ఎస్సీ, ఎస్టీ కూలీల జాబ్‌కార్డు బైఫర్‌కేషన్‌ జరగాలంటూ ఇటీవల జారీ అయిన ఆదేశాలు విమర్శలకు తావిస్తున్నాయి. కులాల ప్రతిపాదికన కూలీ వేతనాల చెల్లింపు సమంజసం కాదంటూ పలు రైతుసంఘాలు విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా నిర్మల్‌ జిల్లాలో ఈ వ్యవహారం ఆందోళనలకు దారి తీస్తోంది. ఉపాధి హమీ చట్టంలోని గైడ్‌లైన్స్‌ను పక్కకు పెట్టి ఇటీవలే సర్కారు ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతర కులాల వారీగా కూలీలను విభజన చేసి దానికి అనుగుణంగా వేతనాలు చెల్లించాలన్న నిబంధనను సర్కారు తెరపైకి తెచ్చిందన్న వాదనలు మొదలయ్యాయి. ఎస్సీ, ఎస్టీ స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ నిధులను ఉపాధి హమీ పథకానికి మరలించేందుకు ఈ కొత్త ఆదేశాలను ప్రభుత్వం తెరపైకి తెచ్చిందంటున్నారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 18 సంవత్సరాలు నిండి ఉపాధి లేని వారంతా జాబ్‌కార్డులను పొందేందుకు అర్హులుగా నిర్ధారించారు. జాబ్‌కార్డును పొందేందుకు కులం, మతం వర్గం లింగబేధం అవసరం లేదన్న నిబంధనలున్నాయి. ఇలాంటివేవి లేకుండానే జాబ్‌కార్డు కలిగిన కూలీలందరికి వంద రోజుల పాటు ఉపాధి పని కల్పించాలని చట్టంలో నిర్దేశించారు. అయితే ఎస్సీ,ఎస్టీ స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్స్‌తో పాటు సబ్‌ప్లాన్‌ నిధులను సైతం ఇతర పనులను డైవర్ట్‌ చేస్తున్నందున ఉపాధి హామీ పనులకు నిధులు తగ్గే అవకాశం ఏర్పడుతోందంటున్నా రు. ప్రతీకూలీకి 245 కనీసవేతనం చెల్లించాలని ఈజీఎస్‌ చట్టం పేర్కొంటుంది. అయితే కేంద్రప్రభుత్వం ఈజీఎస్‌ నిధులను నేరుగా ఆర్థిక శాఖకు బదిలీ చేస్తున్నందునే నిధుల తరలింపు వ్యవహారం చోటు చేసుకుంటుందంటున్నారు. దీంతో పాటు గ్రామ పంచాయతీల్లో ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్‌లకు ఉపాధి హామీ పథకానికి సంబంధించి జాబ్‌కార్డు అనుసంధానం కాలేదన్న నేపంతో కూలీలకు వేతనాలను నిలిపివేశారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈజీఎస్‌ చట్టం ప్రకారం కూలీలు తాము చేసిన పనులకు 15 రోజుల్లోపు వేతనాలను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ కులాల జాబ్‌కార్డు బైఫర్‌కేషన్‌ పేరుతోనే కాకుండా ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్‌లు జాబ్‌కార్డులకు అనుసంధానం కాలేదన్న కారణాలతో పేద కూలీలకు వేతనాలు చెల్లించడంలో జాప్యం జరుగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిర్మల్‌ జిల్లాలో 2016 - 2017 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం కింద రూ.64, 405,25 లక్షల రూపాయలను వ్యయం చేయ గా వందరోజుల పాటు పని పొందిన కూలీలు 49,027 మంది ఉన్నట్లు అధికారులు పేర్కొం టున్నారు. 

కులవిభజనపై మొదలైన ఆందోళనలు

కాగా ఉపాధి హామీ పథకం అమలు వ్యవహారం ప్రస్తుతం వివాదాలకు కారణమవుతోం ది. దీనిపై పలు రైతుకూలీ సంఘాలు ఆందోళనలను ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ స్పెషల్‌ డెవలఫ్‌మెంట్‌ ఫండ్‌ నిధులను పక్కదోవ పట్టించేందుకే కుల విభజన వ్యవహారాన్ని సర్కారు తెరపైకి తెచ్చిందంటూ రైతుసంఘాలు విమర్శిస్తున్నాయి. దీంతో పాటు ఆధార్‌ కార్డు, బ్యాంక్‌అకౌంట్‌ నంబర్‌లను జాబ్‌కార్డుతో అనుసంధానం చేయలేదన్న కారణంతో వేతనాల చెల్లింపులో కూడా అధికారులు జాప్యం చేస్తున్నారంటున్నారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతి గ్రామీణ నిరుద్యోగికి జాబ్‌కార్డును జారీ చేసి పని కల్పించాల్సి ఉంటుంది. ఇక్కడ కుల, మతా ల ప్రస్థావన ఉండదంటూ చట్టం స్పష్టం చేస్తుందని అయితే అధికారులు తాజాగా ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన కూలీల జాబ్‌కార్డులను బైఫర్‌కేషన్‌ చేసేందుకు అధికారులు చేపట్టిన చర్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

నిధుల మళ్లింపులపై భిన్నవాదనలు

ఇదిలా ఉండగా ఉపాధి హమీ పథకానికి ఇతర పథకాల నిధులను మళ్ళీంచేందుకు ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా ప్రయత్నిస్తోందన్న ఆరోపణలున్నాయి. ఎస్సీ, ఎస్టీ స్పెషల్‌ డెవలఫ్‌మెంట్‌ ఫండ్‌ను ఈజిఎస్‌కు లింకేజీ చేసేందుకే బైఫర్గేషన్‌ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారంటున్నారు. ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన ఉపాధి కూలీలను వేరు చేసి వారి వేతనాలను దానికి అనుగుణంగా చెల్లించాలన్న నిబంధనలను తాజాగా తెరపైకి తేవడం వివాదాస్పదమవుతోంది. ఎస్సీ, ఎస్టీ డెవలఫ్‌మెంట్‌ నిధులతో పాటు సబ్‌ప్లాన్‌ నిధులను ఇతర పనులకు మరలిస్తున్నారని ఆరోపణలున్నాయి. ప్రతి కూలీలకు ప్రతీరోజూ రూ.245 కనీస కూలీ దక్కే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్రప్రభుత్వం నిధులను నేరుగా ఆర్థికశాఖకే కేటాయిస్తున్న కారణంగా ఉపాధి హామీపై దీని ప్రభావం పడుతోందంటున్నారు. ఇలాంటి పలు కారణాల వల్ల ఎస్సీ, ఎస్టీ కూలీల బైఫర్గేషన్‌ అంశం దుమారం రేపుతోంది. 

జిల్లాలో 1.65లక్షల జాబ్‌కార్డులు

జిల్లాలో 2016 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 1,65,018 మందికి ఉపాధి హామీ పథకానికి గానూ జాబ్‌కార్డులను జారీ చేశారు. వీరిలో 1,17,014 మంది ఈ పథకం ద్వారా ప్రయోజనం దక్కించుకున్నారు. 64, 405.25 లక్షలను వ్యయం చేశారు. ఉపాధి హామీ పథకం కింద కూలీలందరికి పని కల్పించేందుకు సంబంధిత ఈజీఎస్‌ యంత్రాంగం స్థానికంగా ప్రయత్నిస్తున్నప్పటికీ అమలులో క్షేత్రస్థాయిలో ఆటంకాలు ఎదు రవుతున్నాయంటున్నారు. ఇటీవల ఫీల్డ్‌అసిస్టెంట్‌లను తొలగించి పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలను అప్పగించడం ఈ పథకం అమలుకు భారంగా మారింది. దీంతో పాటు గత ఏడాదిన్నర కాలం నుంచి కరోనా సంక్షోభంతో ఉపాధి హామీపథకం అమలుకు ఆటంకాలు ఏర్పడ్డాయి. అధికారులు ఉపాధి హామీ పనులు చేసే చోట అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికి కూలీలు పనులు చేసేందుకు ముందుకు రాలేదంటున్నారు. లాక్‌డౌన్‌లు, పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోవడం లాంటి అంశాలు కూడా ఉపాధి పనుల అమలుకు అవరోధాలు అయ్యాయన్న అభిప్రాయాలున్నాయి. 

కులాల పేరిట ఉపాధి కూలీల బిల్లులను ఆపడం సరికాదు

నిరుపేదలకు అండగా నిలిచేందుకు తెచ్చిన ఉపాధి హామీ చట్టానికి ఈ ప్రభుత్వం తూట్లు పొ డిచేలా వ్యవహరిస్తోంది. కరోనాలాంటి కష్ట కాలం లో ఉపాధికూలీలకు సమానపనికి సమాన వేతనం ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కులాల వారీగా విభజన చేసి వేతనాలు పంపిణీ చేయడం సరికాదు. ఇది చట్ట విరుద్ధం. ఈ విధానంతో ఉపాధి హామీ లక్ష్యం నీరుగారిపోతుంది. ఎస్టీ, ఎస్సీలకు న్యాయం చేస్తున్నట్లు ప్రచారం చేసుకునే ఈ ప్రభుత్వాలు ఇప్పుడు చేస్తున్న ఉపాధి బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో వారికి తీరని నష్టం జరుగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఉపాధి కూలీలకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలి. 

                               దుర్గం నూతన్‌కుమార్‌,                                             వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి


Updated Date - 2021-06-23T05:21:20+05:30 IST