కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌

ABN , First Publish Date - 2021-08-10T07:20:50+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ ఇంద్రవెల్లిలో నిర్వహించిన దళిత, గిరిజన దండోరాతో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో ఫుల్‌జోష్‌ కనిపించింది. టీపీసీసీ చీఫ్‌గా పదవీ బాద్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రేవంత్‌రెడ్డి జిల్లాలో పర్యటించడం కాంగ్రెస్‌లో ఉత్సాహాన్ని నింపింది.

కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌

ఇకపై కాంగ్రెస్‌.. నాయకుల పార్టీ కాదు.. కార్యకర్తల పార్టీ

ఇంద్రవెల్లి స్తూపం సాక్షిగా అమరవీరుల పేరిట శిలాఫలకం వేయిస్తాం

ప్రతి కార్యకర్తనూ కాపాడుకుంటాం.. నన్ను పూర్తిగా నమ్మండి

ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

దండోరా సభకు వేలాదిగా తరలి వచ్చిన జనం

ఆకట్టుకున్న కళాకారుల నృత్యాలు... ఎమ్మెల్యే సీతక్క పాటలు

అర్కాపూర్‌ నుంచి ఇంద్రవెల్లి వరకు జనజాతర

కాంగ్రెస్‌ శ్రేణులను హుషారెత్తించిన రేవంత్‌రెడ్డి ప్రసంగం

ఆదిలాబాద్‌, ఆగస్టు9 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ ఇంద్రవెల్లిలో నిర్వహించిన దళిత, గిరిజన దండోరాతో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో ఫుల్‌జోష్‌ కనిపించింది. టీపీసీసీ చీఫ్‌గా పదవీ బాద్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రేవంత్‌రెడ్డి జిల్లాలో పర్యటించడం కాంగ్రెస్‌లో ఉత్సాహాన్ని నింపింది. ఉద్యమాల పురిటిగడ్డ ఇంద్రవెల్లి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దళిత గిరిజన దండోరా కార్యక్రమానికి కాంగ్రెస్‌ శ్రీకారం చుట్టింది. 1980 ఏప్రిల్‌ 20న ఇంద్రవెల్లి కాల్పుల్లో నేలకొరిగిన అమరవీరులకు నివాళులర్పించిన కాంగ్రెస్‌ నేతలు వారి ఆశయ సాధనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఉదయం నుంచే ఇంద్రవెల్లి బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నేతలు దండుకట్టారు. గుడిహత్నూర్‌ మీదుగా సభావేదికకు వచ్చే కార్యకర్తలను అర్కాపూర్‌ వద్ద దారి మళ్లించారు. అక్కడి నుంచి కాలినడకన సభా ప్రాంగణానికి కాలినడకన చేరుకున్నారు. మధ్యాహ్నం 2గంటలకు సభా ప్రారంభం కావాల్సిఉండగా 2గంటలు ఆలస్యంగా రేవంత్‌రెడ్డి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. రేవంత్‌రెడ్డి సభా వేదిక పైకి వచ్చే సమయంలో కార్యకర్తలు కేరింతలతో స్వాగతం పలికారు. రేవంత్‌రెడ్డిని సభా వేదికపై ఘనంగా సన్మానించి శాలువాలతో సత్కరించారు. మొదట రాష్ట్ర స్థాయి నేతలు మధుయాష్కీగౌడ్‌, బట్టివిక్రమార్క, జీవన్‌రెడ్డి, సీతక్క, షబ్బీర్‌ఆలీ, మహేశ్వర్‌రెడ్డి, వినోద్‌కుమార్‌, శ్రావణ్‌, అద్దంకి దయాకర్‌ తదితరులు మట్లాడారు. అనంతరం రేవంత్‌రెడ్డి సభను ఉద్దేశించి సుమారుగా 30 నిమిషాల పాటు మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ప్రసంగం కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇంద్రవెల్లి బహిరంగ సభకు ఉదయం నుంచి సాయంత్రం 6గంటల వరకు జనజాతర కనిపించింది. సుమారుగా లక్ష వరకు జనం సభకు హాజరైనట్లు అంచనా వేస్తున్నారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన తొలి బహిరంగ సభ ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సక్సెస్‌ అయింది. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేందుకు కాళాకారులు దూంధాం ఆట పాటలు అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా గుస్సాడిల నృత్యాలు సభలో ప్రత్యేకతను చాటుకున్నాయి. 

ఫ అమరవీరుల పేరిట శిలాఫలకం వేయిస్తాం..

ఇంద్రవెల్లి మండలంలో నిర్వహించిన దళిత, గిరిజన దండోరా సభకు ముఖ్య అతిథిగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. మొదట ఇంద్రవెల్లి స్తూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించిన రేవంత్‌రెడ్డి అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడారు. ‘జై భీం.. జై జై గోండ్వానా’ అంటూ డప్పు కొట్టి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇంద్రవెల్లి పేరు వింటేనే వెంట్రుకలు నిక్కపొడ్చుకుంటున్నాయని, ఇంద్రవెల్లి గడ్డమీద నిలబడితే రక్తం సలసల మరుగుతుందని ఇక్కడి గాలి పీల్చుకుంటే స్వేచ్ఛ కోసం పోరాటాలు చేయాలనిపిస్తుందన్నారు. ఇంద్రవెల్లి గడ్డకు ప్రత్యేక చరిత్ర, పౌరుషం ఉందని ఈ గడ్డ మీది నుంచే గాండ్రించి నిజాం సర్కారును తరిమికొట్టిన ఘనత కొమురంభీందన్నారు. 1981 ఏప్రిల్‌ 20న తుపాకి తూటాలకు ఎందరో మంది ఆదివాసీ బిడ్డలు నేలకొరిగిన పుణ్య భూమి ఇంద్రవెల్లి అన్నారు. ఇంద్రవెల్లి సాక్షిగా అమరవీరుల పేరిట శిలా ఫలకాన్ని వేయించే బాధ్యత నాదన్నారు. కొమురంభీం చెప్పిన విధంగా గోల్కొండా ఖిల్లా కింద గోరి కడుతాం బిడ్డో అన్నట్లుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని పాతరేస్తామన్నారు. ఒక్కప్పుడు ఆదిలాబాద్‌ అంటే కడెం ప్రాజెక్టు, బాసరసరస్వతి, గోదావరి గుర్తొచ్చేవని ఇప్పుడు మాత్రం జోకుడు రామన్న, గుడిలో లింగాన్ని మింగిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిలే గుర్తోస్తున్నారని ఆరోపించారు. దామోదర్‌ రాజనర్సింహా, గీతారెడ్డి, వినోద్‌కుమార్‌,  బలిరాంనాయక్‌లను మంత్రులను చేసిన ఘతన కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. ఈ దేశానికి దళితులను రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్‌ను చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుందన్నారు. కానీ ఓ సన్యాసి బాల్కసుమన్‌ మాత్రం కాంగ్రెస్‌ పార్టీ దళితులకు ఏంచేసిందని ప్రశ్నించడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రిజర్వేషన్లు ఇవ్వడంతోనే ఎందరో మంది దళిత, గిరిజనులు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నారని గుర్తు చేశారు. మాదిగలకు మంత్రి వర్గంలో స్థానం లేదని ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చినట్లే ఇచ్చి అవినీతి ఆరోపణల ముద్ర వేసి తొలగించడం టీఆర్‌ఎస్‌ కుట్రలో భాగమేనన్నారు. రాష్ట్ర ఇంటలిజెన్స్‌ చీఫ్‌ ప్రభాకర్‌రావును ఇంద్రవెల్లి స్తూపం ముందు మోకాళ్లపై నిలబెడతామన్నారు. లెక్కకు లెక్క దెబ్బకు దెబ్బ.. ఒకటికి వంద కేసులు పెట్టి కేసీఆర్‌ను బొందపెడుతామని హెచ్చరించారు. ఫౌంహౌజ్‌లో ఉన్న ప్రగతి భవన్‌లో ఉన్న గోడలు బద్ధలు కొట్టి కేసీఆర్‌ను చర్లపెల్లి జైల్‌లో పెడుతామన్నారు. టీఆర్‌ఎస్‌ చేస్తున్న ఘోరాలకు వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. గ్రామ, మండల, నియోజక వర్గ స్థాయిలో కాంగ్రెస్‌ జెండాలు మోసిన కార్యకర్తలను కాపాడుకుంటామన్నారు. ఇప్పటి నుంచి కాంగ్రెస్‌ నాయకుల పార్టీకాదని కార్యకర్తల పార్టీ అన్నారు. 

ఫ కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం..

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ఎన్నికైన తర్వాత తొలిసారి ఇంద్రవెల్లిలో దళిత దండోరా సభను నిర్వహించడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌ కనిపించింది. లక్షమందితో దండోరాను నిర్వహిస్తామని చెప్పినట్లుగానే కాంగ్రెస్‌ పార్టీ నేతలు భారీగా జన సమీకరణను చేశారు. 18 ఎకరాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సుమారుగా 50వేలకు పైగా జనం హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు లక్ష జనాభా వరకు కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు సభకు హాజరైనట్టేనని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశం మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా 2గంటలు ఆలస్యంగా సాయంత్రం 4గంటలకు ప్రారంభమైంది. అయినా కొందరు రాష్ట్రస్థాయి నేతలు ప్రసంగాలు చేయడంతో మరింత ఆలస్యమైంది.  రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్‌ శ్రేణులు చప్పట్లు, కేరింతలు కొడుతు ఉత్సాహాంగా కనిపించారు. దాదాపుగా 30 నిమిషాల పాటు రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. ఆలస్యంగా వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు సభాస్థలికి రాకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. పది కిలో మీటర్ల దూరంలో ఉన్న మన్కాపూర్‌ నుంచి కాలినడకన సభాస్థలికి చేరుకోలేక పోయారు. అలాగే ఉట్నూర్‌ మండల కేంద్రంలో వందలాది మంది కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.  కొందరు పోలీసు అధికారులు టీఆర్‌ఎస్‌ పార్టీకి గులాంగిరి చేస్తున్నారంటూ హెచ్చరించారు. కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర విమర్శలు చేయడంతో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు కేరింతలు కొడుతూ రేవంత్‌రెడ్డి ప్రసంగానికి మద్ధతుగా నిలిచారు.

ఫ ట్రాఫిక్‌తో తీవ్ర ఇబ్బందులు..

ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభకు తీవ్రంగా ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడ్డాయి. సభా ప్రాంగణానికి దగ్గరలో కాకుండా సుమారుగా 10కి.మీల దూరంలో ఉన్న అర్కాపూర్‌ వద్ద వాహనాలను నిలిపి వేయడంతో దారి వెంట పార్కింగ్‌ చేస్తూ కాలినడకన సభా ప్రాంగణానికి చేరుకోవాల్సి వచ్చింది. వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు ట్రాపిక్‌ ఇబ్బందులు ఎదురయ్యాయి. సభా ప్రాంగణం వరకు నాలుగైదు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిన జనం రద్దీతో ట్రాపిక్‌ సమస్యలు తలెత్తాయి. సభాకు వచ్చే వాహనాలతో పాటు ఇతర వాహనాలను అనుమతించడంతో రోడ్డంతా కిక్కిరిసి పోయింది. ఇంద్రవెల్లి మండలాన్ని దాటి వెళ్లడానికి గంటల తరబడి సమయం పట్టింది. కిలో మీటర్ల దూరంలో పార్కింగ్‌ చేసిన వాహనాల వద్దకు వెళ్లి ఇంటికి తిరుగుముఖం పట్టారు.

Updated Date - 2021-08-10T07:20:50+05:30 IST