మి(కి)ల్లింగ్‌..!

ABN , First Publish Date - 2021-12-26T14:04:07+05:30 IST

శీతాకాలం నేపథ్యంలో అభివృద్ధి, నిర్వహణ పనులను వేగిరం చేసిన జీహెచ్‌ఎంసీ జాగ్రత్తలను విస్మరించింది. ఇది పౌరులకు ప్రాణ సంకటంగా మారుతోంది

మి(కి)ల్లింగ్‌..!

రోడ్లు తవ్వి.. వదిలేసి

రోజుల తరబడి అలానే..

వాహనదారులకు ప్రాణ సంకటం

ప్రమాదాల బారిన పడుతోన్న వైనం

ఎగుడుదిగుడుగా మారుతోన్న రహదారులు


హైదరాబాద్‌ సిటీ: శీతాకాలం నేపథ్యంలో అభివృద్ధి, నిర్వహణ పనులను వేగిరం చేసిన జీహెచ్‌ఎంసీ జాగ్రత్తలను విస్మరించింది. ఇది పౌరులకు ప్రాణ సంకటంగా మారుతోంది. తవ్వి వదిలేసిన రహదారులు, సగం నిర్మించిన రోడ్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కొన్నిచోట్ల పౌరులు గాయాల పాలవుతుండగా, ఇంకొన్ని ప్రాంతాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. అశాస్ర్తీయంగా నిర్మించిన గ్రేటర్‌లోని రహదారులు ఇప్పటికీ ఎగుడుదిగుడుగా ఉన్నాయి. ఇండియన్‌ రోడ్‌ కాంగ్రె్‌స (ఐఆర్‌సీ) ప్రమాణాలు రోడ్ల నిర్మాణంలో ఎక్కడా పాటించడం లేదు. కార్పెటింగ్‌, రీ కార్పెటింగ్‌, ప్యాచ్‌ వర్కులతో రహదారులు ఒక్కోచోట ఒక్కోలా ఉంటున్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే రోడ్ల నిర్మాణం, మరమ్మతు పేరిట చేపడుతోన్న పనులూ ప్రజలకు ఇబ్బందికరంగా మారుతున్నాయు. అనువైన సీజన్‌ కావడంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో వివిధ ప్రభుత్వ విభాగాలు పనులు చేస్తున్నాయి. ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో క్షేత్రస్థాయిలో కనీస భద్రతా చర్యలు తీసుకోవడం లేదు.  


జాగ్రత్తలు ఏవి..? 

కాంప్రహెన్సీవ్‌ రోడ్‌ మెయింటెనెన్స్‌ ప్రోగ్రామ్‌(సీఆర్‌ఎంపీ)లో భాగంగా ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించిన రహదారుల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఉన్నతస్థాయి ఆదేశాలు, ఒప్పందంలో భాగంగా మెయిన్‌ రోడ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో రహదారులను మొదట మిల్లింగ్‌ చేసి అనంతరం కార్పెటింగ్‌ చేస్తున్నారు. అయితే పై పొర(మిల్లింగ్‌)ను తొలగించిన అనంతరం వారం, పది రోజులు, కొన్నిచోట్ల రెండు వారాలకు గానీ రోడ్లు నిర్మించడం లేదు. పై పొర తొలగించడంతో ఆయా మార్గాల్లో రహదారులు అధ్వానంగా మారుతున్నాయి. కంకర తేలి వాహనదారులు అదుపు తప్పి పడిపోతున్నారు. హిమాయత్‌నగర్‌ ప్రధాన రహదారిలో నెల రోజుల క్రితం మిల్లింగ్‌ చేశారు. పది రోజుల తర్వాత రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే ఇప్పటికే మినర్వా, టీటీడీ తదితర ప్రాంతాల్లో ఒక లేన్‌లో మాత్రమే పూర్తిస్థాయి కార్పెటింగ్‌ చేశారు. కార్పెటింగ్‌ చేసిన లేన్‌లో రెండు అంగుళాల మేర రోడ్డు ఎత్తు పెరగగా.. పక్కనే తక్కువగా ఉంది. దీంతో ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి కింద పడుతున్నారు. శనివారం ఓ వాహనదారుడు మినర్వా సమీపంలో కిందపడగా కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. హెల్మెట్‌ ధరించడంతో సురక్షితంగా బయటపడ్డాడు. బేగంపేట, సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో ప్రధాన రహదారుల్లో పరిస్థితి ఇలానే ఉంది. మిల్లింగ్‌ చేసి వారం, పది రోజులైనా రోడ్లు నిర్మాణం చేపట్టడం లేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు.


గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌ వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు

రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు

రోడ్డు మరమ్మతు పనుల నిర్వహణ కోసం గచ్చిబౌలి ఔటర్‌ రింగ్‌ రోడ్‌ ప్రాంతంలో నాలుగు రోజులపాటు రాత్రి సమయంలో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ ఓ ప్రకటనలో తెలిపారు. గచ్చిబౌలి ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓఆర్‌ఆర్‌ ప్రాంతంలో డిసెంబర్‌ 25, 26, జనవరి 2, 3 తేదీల్లో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు వాహనాలను అనుమతించరని తెలిపారు. 

హఫీజ్‌పేట నుంచి కొత్తగూడ మీదుగా టోలీచౌకి వైపునకు వచ్చేవాహనదారులను రోలింగ్‌ హిల్స్‌, రాంకీ టవర్స్‌, ఏఐజీ ఆస్పత్రి, మైండ్‌స్పేస్‌ మీదుగా బయోడైవర్సిటీ జంక్షన్‌ వైపునకు మళ్లిస్తారు.

లింగంపల్లి నుంచి టోలీచౌకి వైపునకు వచ్చే వాహనాలను నానక్‌రాంగూడ, ఖాజాగూడ వైపునకు మళ్లిస్తారు.

ఆర్‌జీఐ ఎయిర్‌పోర్ట్‌ నుంచి టోలీచౌకి వైపునకు వచ్చే వాహనాలను యూటర్న్‌ చేసుకొని నానక్‌రాంగూడ, ఖాజాగూడ వైపునకు పంపుతారు.

టోలీచౌకి నుంచి లింగంపల్లి వైపునకు వెళ్లే వాహనాలను ఈఎ్‌ససీఐ, ఖాజాగూడ, ఓఆర్‌ఆర్‌, గచ్చిబౌలి జంక్షన్‌ వైపునకు మళ్లిస్తారు.

Updated Date - 2021-12-26T14:04:07+05:30 IST