ఘరానా దొంగల అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-12-19T17:14:20+05:30 IST

వయసు 27 ఏళ్లు.. ఇప్పటికే 59 దొంగతనాలు చేశాడు.. రెండు సార్లు పోలీసులు పీడీయాక్టు నమోదు చేశారు.. అయినా బుద్ధి మార్చుకోలేదు. ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చిన

ఘరానా దొంగల అరెస్ట్‌

ఒకరు 59, మరొకరు 120 చోరీలు

హైదరాబాద్‌ సిటీ: వయసు 27 ఏళ్లు.. ఇప్పటికే 59 దొంగతనాలు చేశాడు.. రెండు సార్లు పోలీసులు పీడీయాక్టు నమోదు చేశారు.. అయినా బుద్ధి మార్చుకోలేదు. ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చిన 8 రోజులకే 70తులాల బంగారం చోరీ చేశాడు. పోలీసులు సదరు ఘరానా దొంగ అతని భార్యతోపాటు మరో దొంగను అరెస్టు చేశారు. వారి నుంచి 41 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సీపీ అంజనీకుమార్‌, జాయింట్‌ సీపీ విశ్వప్రసాద్‌తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. కర్నూలు జిల్లా కండేలికి చెందిన చెందిన గుంజపాగు సుధాకర్‌ అలియాస్‌ సాయి అలియాస్‌ ఆంధోనీ అలియాస్‌ కాకా అలియాస్‌ డేంజర్‌ కొన్నేళ్ల క్రితం బతుకు దెరువుకోసం నగరానికి వచ్చాడు. మెహిదీపట్నంలో ఉంటూ ఆటోడ్రైవర్‌గా పనిచేసేవాడు. దొంగతనాలు చేయడం ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. 


120 చోరీల దొంగతో జైల్లో జతకట్టి.. 

జైల్లో సుధాకర్‌కు చేవెళ్లకు చెందిన మరో ఘరానా దొంగ మహ్మద్‌ ఆయూబ్‌ అలియాస్‌ బడా ఆయూబ్‌తో జైల్లోనే పరిచయం అయింది. ఆయూబ్‌ అప్పటికే 120 దొంగతనాలు చేసిన ఘనుడు. ఇద్దరూ ఈ ఏడాది అక్టోబర్‌-13న జైలు నుంచి విడుదలయ్యారు. అక్టోబర్‌-21న తెల్లవారుజామున 2:00గంటలకు గగన్‌మహల్‌ స్వామి నిలయం అపార్ట్‌మెంట్‌ పక్కింటి గోడ దూకి అపార్టుమెంట్‌లోకి చొరబడి, 70 తులాల బంగారం చోరీచేశారు. అల్మారాలో మరో బ్యాగులో ఉంచిన 30 తులాల బంగారాన్ని చూడలేదు. దాన్ని వదిలేసి వెళ్లారు. చోరీ సొత్తును సుధాకర్‌ తన భార్య నాగమణి అలియాస్‌ నాగవేణి అలియాస్‌ బుజ్జి అలియాస్‌ చిట్టితల్లికి ఇచ్చాడు. ఆమె కొంత సొత్తును ముంబైకి చెందిన మహ్మద్‌ తబ్రేజ్‌దౌడ్‌ షేక్‌ సహకారంతో అమ్మేసి సొమ్ముచేసుకుంది. దాంతో పోలీసులు ఇద్దరు దొంగలు సుధాకర్‌, ఆయూబ్‌తో పాటు.. సుధాకర్‌ భార్యని కూడా అరెస్టు చేసినట్లు సీపీ వెల్లడించారు. మాన్వవల్‌ పద్ధతిలో ఇన్వెస్టిగేషన్‌ చేసి చాకచక్యంగా దొంగలను పట్టుకున్న సిబ్బందిని సీపీ అభినందించారు. 


పోలీసులతో దొంగ వాగ్వాదం

ప్రెస్‌మీట్‌లో సీపీ.. చోరీ జరిగిన తీరుతో పాటు.. నిందితుల వివరాలు వెల్లడిస్తుండగా.. పక్కనే  అదుపులో ఉన్న నిందితుడు సుధాకర్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ‘దొంగతనం చేసింది నేను.. నన్ను ఏమైనా చేసుకోండి. అవసరమైతే చంపేసుకోండి. అంతేగానీ నా భార్య పేరు ఎందుకు తెస్తున్నారు. 

ఆమెను ఎందుకు ఇందులోకి లాగుతున్నారు. దొంగతనంతో ఆమెకు ఏం సంబంధం’ అంటూ గట్టిగా అరిచాడు. దీంతో పోలీసులు అతన్ని పక్కనే ఉన్న గదిలోకి తీసుకెళ్లారు. ‘మా పాపకు ఫిట్స్‌ (మూర్చ) ఉంది. ఏమైనా అయితే ఎవరు చూసుకోవాలి’ అంటూ పోలీసులతో వాదించినట్లు తెలిసింది.

Updated Date - 2021-12-19T17:14:20+05:30 IST