అడవిలో వేటగాళ్లు

ABN , First Publish Date - 2021-03-14T05:39:18+05:30 IST

కొంతకాలం క్రితం వరకు జిల్లాలోని అడవుల్లో సద్దుమణిగిన వన్యప్రాణుల వేట మళ్లీ తెరపైకి వస్తుండడం ఆందోళనను రేకేత్తిస్తోంది.

అడవిలో వేటగాళ్లు

జిల్లాలో రెచ్చిపోతున్న వేటగాళ్లు..!

అడవుల్లో జోరుగా హంటింగ్‌ 

నిర్మల్‌ కేంద్రంగా కృష్ణ జింకల రాకెట్‌ 

ఇతర జంతువుల స్మగ్లింగ్‌ దందా 

నిర్మల్‌ మీదుగా హైదరాబాద్‌కు తరలింపు 

వేటగాళ్ల ఉచ్చులో వన్యప్రాణులు 

నిర్మల్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి)  : కొంతకాలం క్రితం వరకు జిల్లాలోని అడవుల్లో సద్దుమణిగిన వన్యప్రాణుల వేట మళ్లీ తెరపైకి వస్తుండడం ఆందోళనను రేకేత్తిస్తోంది. కొద్దిరోజుల నుంచి జిల్లాలోని మారుమూల అటవీప్రాంతాల్లో వన్యప్రాణుల వేట పెద్దఎత్తున సాగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణజింకలు, సాధారణ జింకలతో పాటు మనుబోతులు, కుందేళ్లు, అడవిపందుల కోసం వేటగాళ్లు దట్టమైన అడవుల్లో గాలింపులు జరుపుతూ వేట కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కుభీర్‌ మండలం చాత గ్రామంలో జరిగిన కృష్ణ జింకలవేట వ్యవహారం మళ్లీ ఇక్కడి పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తోందంటున్నారు. ఈ గ్రామానికి చెందిన చౌవాన్‌శంకర్‌ అనే వ్యక్తి అడవుల్లో వన్య ప్రాణులను వేటాడుతూ ఇతర ప్రాంతాలకు వేటాడిన జంతువులను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్‌, హైదరాబాద్‌, బోధన్‌ తదితర ప్రాంతాలకు చెందిన ఓ ముఠాతో జిల్లాలోని పలువురు వేటగాళ్లకు సంబంధాలున్నట్లు వెల్లడవుతోంది. హైదరాబాద్‌కు చెందిన కొంతమంది జంతువుల మాంసం అలాగే వాటిచర్మం, ఇతర అవశేషాలతో పెద్ద ఎత్తున అక్రమవ్యాపారం సాగిస్తున్నారంటున్నారు. వీరు నిర్మల్‌ జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించి స్థానిక వేటగాళ్లతో మిలాఖత్‌ అవుతున్నారన్న వాదనలున్నాయి. హైదరాబాద్‌ కేంద్రంగా సాగుతున్న ఈ వేట రాకెట్‌ వన్యప్రాణుల మాంసాన్ని ఇతర రాష్ర్టాలకు సైతం తరలిస్తున్నట్లు చెబుతున్నారు. పోలీసులు కుభీర్‌ మండలానికి చెందిన చౌవాన్‌శంకర్‌తో పాటు నిజామాబాద్‌కు చెందిన మహ్మద్‌ జుబేర్‌, హైదరాబాద్‌కు చెందిన సల్మానొద్దీన్‌, బోధన్‌కు చెందిన ఇమ్రాన్‌లతో మిలాఖతై కృష్ణజింకల వేటను కొనసాగిస్తున్నారంటున్నారు. కుభీర్‌ మండలంతో పాటు కడెం, దస్తూరాబాద్‌, పెంబి, మామడ తదితర మండలాల్లోని మారుమూల అడవులను లక్ష్యంగా చేసుకొని ఈ తంతును కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. అయితే అటవీశాఖ ప్రధానంగా చెట్ల నరికివేత, కలప స్మగ్లింగ్‌పై దృష్టి కేంద్రీకరిస్తున్న కారణంగా వేటగాళ్లు వారిని దృష్టి మరలించి తమ వేట దందాను దర్జాగా సాగిస్తున్నారంటున్నారు. స్థానికంగా పేరున్న కొంతమంది వేటగాళ్లతో హైదరాబాధ్‌కు  చెందిన ప్రొఫెషనల్‌ హంటర్స్‌ ఓ రాకెట్‌గా ఏర్పడినట్లు ప్రచారం జరుగుతోంది. వేటాడిన వన్యప్రాణుల మాంసం కళేబరాలను కార్లు, ఇతర లగ్జరీ వాహనాల్లో దర్జాగా హైదరాబాద్‌తో పాటు మరికొన్ని ప్రాంతాలకు తరలించుకుపోతున్నారని పేర్కొంటున్నారు. 

హైదరాబాద్‌ కేంద్రంగా సాగుతున్న రాకెట్‌

ఇదిలా ఉండగా హైదరాబాద్‌కు చెందిన కొంతమంది ప్రొఫెషనల్స్‌ హంటర్స్‌ నిర్మల్‌ జిల్లాను కేంద్రంగా చేసుకొని ఈ హంటింగ్‌ రాకెట్‌ను నడుపుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. వీరు తమకున్న పాత పరిచయాలను అస్త్రంగా మలుచుకుంటూ మారుమూల గ్రామాల్లోని కొంతమంది స్థానిక వేటగాళ్లతో జతకట్టి వన్యప్రాణుల వేటను సాగిస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌ ప్రొఫెషనల్‌ హంటర్స్‌కు నిజామాబాద్‌, భోధన్‌లకు చెందిన మరికొంతమంది హంటర్స్‌ తోడవుతున్నారని వీరంతా ప్రత్యేకవాహనాల్లో జిల్లాకు వచ్చి స్థానిక వేటగాళ్లు వేటాడే జంతువుల మృతదేహాలను తరలించుకుపోతున్నారంటున్నారు. ముఖ్యంగా డిమాండ్‌ ఎక్కువగా ఉన్న జంతువులనే వీరు లక్ష్యంగా చేసుకొని వేటను కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెషనల్‌ హంటర్స్‌ స్థానిక వేటగాళ్లకు పెద్దమొత్తంలోనే డబ్బులు చెల్లించి కృష్ణజింకలు, సాధారణ జింకలను లక్ష్యంగా చేస్తున్నారని పలు వురు అభిప్రాయపడుతున్నారు. స్థానిక వేటగాళ్లు తాము వేటాడిన జం తువులను హైదరాబాద్‌ ముఠాకు అప్పగించగా వీరు ఆ జంతువులను కార్లలో హైదరాబాద్‌కు తరలించుకువెళుతున్నారని చెబుతున్నారు. ఫారెస్ట్‌ చెక్‌పోస్టులను సైతం ఈ ముఠా దాటుకుంటూ వెళుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. 

మారుమూల అటవీ ప్రాంతాలే లక్ష్యంగా..

ఇదిలా ఉండగా జిల్లాలోని పలు మారుమూల మండలాల్లో గల దట్టమైన అడవులను ఈ హంటింగ్‌ రాకెట్‌ లక్ష్యంగా చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. జిల్లాలోని కడెం, పెంబి, దస్తూరాబాద్‌, ఖానాపూర్‌, మా మడ, కుభీర్‌ లాంటి మారుమూల మండలాలను ఈ ముఠా ఎంపిక చేసుకొని ఈ వేట దందాను యథేచ్చగా సాగిస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. స్థాని కంగా వేటను వృత్తిగా చేసుకుంటున్న వారిని వీరు తమ దందా కోసం ఎంపిక చేస్తున్నారంటున్నారు. ఈ వేటగాళ్ళకు పెద్దమొత్తంలో డబ్బు లు ఆశచూపి వారిని విలువైన వన్య ప్రాణుల వేటకు ఉసిగొలుపుతున్నారంటున్నారు. ఈ ముఠా ఎరకు చిక్కుకుంటున్న స్థానిక వేటగాళ్ళు రాత్రివేళల్లో వేటకు వెళ్లి పలు ప్రమాదాలకు కూడా గురవుతున్నారంటున్నారు. మరికొంతమంది ఈ ప్రమాదాల్లో ప్రాణాలు సైతం కోల్పోతున్నారని చెబుతున్నారు. దట్టమైన అటవీ ప్రాంతాల్లో అటవీ శాఖ నిఘా తక్కువగా ఉంటుండడం వీరికి కలిసి వస్తుందని చెబుతున్నారు. రాత్రి వేళల్లోనే వీరు తమ వేట వ్యవహారాన్ని దర్జాగా సాగిస్తూ ఉదయం వరకు హంటింగ్‌ ఆపరేషన్‌ను పూర్తి చేస్తున్నట్లు సమాచారం. తమ వేట పూర్తి కాగానే వేటాడిన వన్యప్రాణులను ఈ రాకెట్‌కు అప్పజెప్పుతున్నట్లు సమాచారం. అయితే అడపాదడపా వేట విషయంలో స్థానిక వేటగాళ్లే అటవీశాఖ అధికారుల వలలకు చిక్కుకొని కేసుల పాలవుతున్నారు. 

జిల్లా వన్య ప్రాణులకు భారీగా డిమాండ్‌

జిల్లాలోని టేకు కలపకే కాకుండా ఇక్కడి వన్యప్రాణులకు సైతం భారీగా డిమాండ్‌ ఉందంటున్నారు. మొన్నటి వరకు ఇక్కడి టేకు చెట్లను నరికి పెద్దఎత్తున ఆ దుంగలను స్మగ్లింగ్‌ చేసేవారు. అడవులు తగ్గిపోవడం, అటవీశాఖ కఠినచర్యలు చేపడుతుండడంతో కలప స్మగ్లింగ్‌ కొంత మేరకు తగ్గుముఖం పట్టిందంటున్నారు. అయితే కలప స్మగ్లింగ్‌ తగ్గినప్పటికి వన్యప్రాణులను వేటాడడం మాత్రం తగ్గలేదని పేర్కొంటున్నారు. స్థానికంగా ఉన్న కొంతమంది వేటగాళ్లు వేటను వృత్తిగా చేసుకుంటున్నారంటున్నారు. జిల్లాకు చెందిన వన్యప్రాణుల మాంసం రుచిగా ఉంటుం దని అలాగే వాటి చర్మాలకు, ఇతర అవశేషాలకు ఎక్కువ డిమాండ్‌ ఉంటుండడంతో ఈ ప్రొఫెషనల్‌ హంటర్స్‌ రాకెట్‌ జిల్లాను టార్గెట్‌ చేసుకుందంటున్నారు. ఇతర రాష్ర్టాల్లో జిల్లాలోని వన్య ప్రాణుల చర్మాలకు, కొమ్ములు, గోర్లకు భారీగా డిమాండ్‌ ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. దీని కారణంగానే హైదరాబాద్‌కు చెందిన ఈ ముఠా జిల్లాను లక్ష్యంగా చేసుకొని స్థానికులను వేట ఉచ్చులోకి దింపుతోందన్న అభిప్రాయాలున్నాయి. 

వన్య ప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటాం

ఈ విషయమై ఎఫ్‌ఆర్‌ఓ కోటేశ్వర్‌ను సంప్రదించగా వన్య ప్రాణులను వేటాడితే చట్ట రీత్యాచర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇటీవల మండలంలోని కొంతమంది వ్యక్తులు వన్య ప్రాణులను వేటాడి హైదరాబాద్‌కు తరలించడం జరిగిందని తెలిపారు. వన్య ప్రాణులను వేటాడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌కు తరలించిన నిందితుడు కుభీర్‌ మండలంలోని చాత గ్రామానికి చెందిన వాడని తెలిపారు. జింకలు ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి చౌవాన్‌ వధించినట్లు సమాచారం. 

Updated Date - 2021-03-14T05:39:18+05:30 IST