వాగు దాటేదెలా?

ABN , First Publish Date - 2021-09-03T04:41:21+05:30 IST

వానాకాలం వచ్చిందంటే ఆసిఫాబాద్‌ ఏజెన్సీలోని మారుమూల గ్రామాల ప్రజలకు వాగుల రూపంలో వరద గండాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలను పూర్తిగా తెంచివేస్తున్నాయి.

వాగు దాటేదెలా?

- దశాబ్దాలు గడిచినా దశ మారలేదు

- హామీలు తప్ప పూర్తి కాని వంతెనలు

- మారుమూల గ్రామాల ప్రజలకు తప్పనితిప్పలు

(ఆసిఫాబాద్‌, ఆంధ్రజ్యోతి):

వానాకాలం వచ్చిందంటే ఆసిఫాబాద్‌ ఏజెన్సీలోని మారుమూల గ్రామాల ప్రజలకు వాగుల రూపంలో వరద గండాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలను పూర్తిగా తెంచివేస్తున్నాయి. దాంతో వర్షాకాలం అంటేనే జిల్లాలోని ఈ గ్రామాలకు ఎక్కడా లేని భయం.. వర్షాకాలం ముగిసేంతవరకు మారుమూల గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది.

దశాబ్దాలుగా కొనసా...గుతున్న వంతెనల నిర్మాణాలు..

జిల్లాలోని వాంకిడి, దహెగాం, పెంచికల్‌పేట్‌, ఆసిఫాబాద్‌, కెరమెరి మండలాల్లోని వివిధ గ్రామాల్లో నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు దశాబ్ధాలుగా నత్తను మించిన నడకతో కొనసాగుతున్నాయి. దీంతో ప్రజలు ప్రతీ ఏటా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆసిఫాబాద్‌ మండలంలోని పెద్దవాగుపై గుండి గ్రామానికి వెళ్లేందుకు ప్రజలు నడుములోతు నీటిలో అవస్థలు పడుతున్నారు. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం కోసం 2005లో రూ.3.5కోట్లు అంచనా వేయంతో శంకుస్థాపన పనులు ప్రారంభించారు. మొదట్లో నాబార్డ్‌ నిధులు మంజూరు చేసినా ఆ తర్వాత నిధులు నిలిచిపోవడంతో ఈ పనిని 2016లో ఆర్‌అండ్‌బీకి బదలాయించారు. తట్ట మట్టి తీయకుండానే ఆర్‌అండ్‌బీ చేతులు దులుపుకోవడంతో తాజాగా రూ.11కోట్ల అంచనాతో పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ ద్వారా నిర్మాణానికి ప్రతిపాదించారు. అయినా పనుల్లో ఏమాత్రం ముందడుగు లేదు. వర్షాకాలం ముగిసే వరకు ప్రజలకు ఇబ్బందులు తప్పవు. కెరమెరి మండలంలోని ఉమ్రి వంతెన అసంపూర్తిగా ఉండడం వల్ల మహారాష్ట్రలోని 12గ్రామాల ప్రజలకు వర్షాకాలంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. అలాగే పెంచికల్‌పేట్‌ మండలంలో పెద్దవాగుపై సరిగ్గా 14సంవత్సరాల క్రితం బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించినా నేటికీ పిల్లర్ల దశను దాటలేదు. అలాగే దహెగాం మండలం దిగడ గ్రామం వద్ద పెద్దవాగుపై నిర్మిస్తున్న వంతెన పనులు ఆదిలోనే నిలిచిపోయాయి. ఇక్కడ 2019లో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పెంచికల్‌పేట మండలం కమ్మర్‌గాం నుంచి దహెగాం మండలం దిగడ మీదుగా మంచిర్యాల జిల్లా వేమనపల్లి వరకు బీటీ రోడ్డు, వంతెన నిర్మించేందుకు ప్రభుత్వం నక్సల్స్‌ ప్రాంతాల అభివృద్ధి పథకం కింద రూ.14 కోట్లు మంజూరు చేసింది. నిన్నమొన్నటి వరకు పనులు సాగినా దిగడ వద్ద పెద్దపులి దాడి చేసి ఓ యువకుడిని చంపివేయడంతో పనులకు బ్రేక్‌ పడింది. ఇక కాగజ్‌నగర్‌-వాంకిడి మండలాల మధ్య కనర్‌గాం వద్ద బ్రిడ్జి నిర్మాణం 15సంవత్సరాల నుంచి అసంపూర్తిగా ఉంది. వారం రోజులుగా కురుస్తున్న భారీవర్షాల కారణంగా రెండు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కెరమెరి మండలంలోని అనార్‌పల్లి- కరంజివాడ, లక్మాపూర్‌, ఉమ్రి వంతెనల నిర్మాణ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. దీంతో అయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పెంచికల్‌పేట పెద్దవాగుపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండడంతో ఆయాగ్రామాల ప్రజలు నాటు పడవలను ఆశ్రయిస్తూ మృత్యువాత పడుతున్నారు. తిర్యాణి మండలం లోని అమీన్‌గూడ, ఎదులపాడ్‌ల సమీపంలోని వాగులపై వంతెనలు మంజూ రైనా అటవీశాఖ అనుమతుల కారణంగా పనులు ప్రారంభం కాలేదు. ఇదిలా ఉంటే వాస్తవానికి జిల్లా వ్యాప్తంగా ఈ వంతెనలే కాకుండా 136చిన్న చిన్న వంతెనలు కాజ్‌వేలు, మధ్యతరహా కల్వర్టులు నిర్మించాల్సి ఉందని పంచాయతీరాజ్‌శాఖ ప్రతిపాదనలు తయారు చేసింది. ఇందుకుగాను మొత్తం 172.60కోట్లు నిధులు అవసరమవుతాయని అంచనా వేసి ఐదేళ్లక్రితమే ప్రభుత్వానికి నివేదికలు పంపినా నేటికీ మోక్షం లభించలేదు. 

వంతెన నిర్మాణ పనులు చేపట్టాలి..

- బొమ్మకంటి కిరణ్‌, గుండి

గుండి పెద్దవాగుపై నిర్మిస్తున్న వంతెన పనులు వెంటనే ప్రారంభించాలి. 15ఏళ్లుగా నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ప్రతి ఏటా గుండి ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రానికి రావాలంటే వాంకిడి మండలం ఖమాన మీదుగా రావాల్సిన పరిస్థితి నెలకొంది. 

గుండి వంతెన నిర్మాణానికి రీటెండర్‌..

- రాంమోహన్‌రావు, ఈఈ పంచాయతీరాజ్‌

ఆసిఫాబాద్‌ మండలంలోని గుండి పెద్దవాగుపై వంతెన నిర్మాణానికి మళ్లీ రీటెండర్‌ పిలువనున్నాం. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాం. కెరమెరి మండలం అనార్‌పల్లి-కరంజివాడ వంతెన నిర్మాణ పనులు ఇటీవలే ప్రారం భించాం. వర్షాల కారణంగా పనులు నిలిచిపోయాయి.

Updated Date - 2021-09-03T04:41:21+05:30 IST