సింగరేణిలో ఇండ్ల పట్టాలకు లైన్‌క్లియర్‌

ABN , First Publish Date - 2021-08-11T04:07:23+05:30 IST

సింగరేణి స్థలాల్లోని నివాస గృహాలకు పట్టాలు ఇచ్చేందుకు ఎట్టకేలకు లైన్‌క్లియర్‌ అయింది. జిల్లా వ్యాప్తంగా సింగరేణి పరిధిలోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్‌ ఏరియాల్లోని సింగరేణి స్థలాల్లో వేలాది మంది కార్మికులు, కార్మికేతరులు ఇండ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. బొగ్గు గనుల ఆవిర్భావం అనంతరం సింగరేణి ప్రాంతాలైన జిల్లాలోని బెల్లంపల్లి, కాసిపేట, రామకృష్ణాపూర్‌, నస్పూర్‌, శ్రీరాంపూర్‌, మందమర్రిలో వారంతా నివాసాలు ఏర్పాటు చేసుకోగా వీరందరికి పట్టాలు ఇవ్వాలనే డిమాండ్‌ ఉంది.

సింగరేణిలో ఇండ్ల పట్టాలకు లైన్‌క్లియర్‌

మూడు ఏరియాల్లో 6వేల పైచిలుకు దరఖాస్తులు

తొలుత మందమర్రి పరిధిలోని నివాసాలకు

ఇప్పటికే ప్రారంభమైన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ

ఈనెల 12 నుంచి పంపిణీకి సన్నాహాలు

మంచిర్యాల, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): సింగరేణి స్థలాల్లోని నివాస గృహాలకు పట్టాలు ఇచ్చేందుకు ఎట్టకేలకు లైన్‌క్లియర్‌ అయింది. జిల్లా వ్యాప్తంగా సింగరేణి పరిధిలోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్‌ ఏరియాల్లోని సింగరేణి స్థలాల్లో వేలాది మంది కార్మికులు, కార్మికేతరులు ఇండ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. బొగ్గు గనుల ఆవిర్భావం అనంతరం సింగరేణి ప్రాంతాలైన జిల్లాలోని బెల్లంపల్లి, కాసిపేట, రామకృష్ణాపూర్‌, నస్పూర్‌, శ్రీరాంపూర్‌, మందమర్రిలో వారంతా నివాసాలు ఏర్పాటు చేసుకోగా వీరందరికి పట్టాలు ఇవ్వాలనే డిమాండ్‌ ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా సింగరేణి ప్రాంతాల్లో నివాసాలు ఉంటున్న వారికి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. సీఎం హామీ ఇచ్చి మూడు సంవత్సరాలు గడుస్తుండగా, ఎట్టకేలకు పట్టాలు జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం 2019లో జారీ చేసిన జీవో నంబర్‌ 76 ప్రకారం 02-06-2014కు ముందు నుంచి సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారందరికీ పట్టాలు అందజేయనున్నారు. 

6వేల పైచిలుకు దరఖాస్తులు

జిల్లాలోని మూడు ఏరియాల్లో నివాసాలు ఉంటున్న వారి నుంచి పట్టాల కోసం 6 వేల పైచిలుకు మంది దరఖాస్తు చేసుకున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. మందమర్రి ఏరియాలోని క్యాతన్‌పల్లిలో 3,934, శ్రీరాంపూర్‌ ఏరియాలో 2,843, బెల్లంపల్లి ఏరియాలో 2,272 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుదారులకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వ నిబంధనల మేరకు సూచించిన ఫీజును సంబంధిత ప్రజలు డీడీ రూపంలో రెవెన్యూ అధికారులకు అందజేశారు. దరఖాస్తు చేసుకున్న వారి నివాసాలకు సంబంధించి రెవెన్యూ అధికారులు సర్వేలు  చేపట్టారు. సర్వే అనంతరం నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. 

ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు

ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చేందుకు సర్వే పూర్తికావడంతో అధికారులు ఎట్టకేలకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు. ఈనెల 7వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం కాగా తొలుత మందమర్రి ఏరియా పరిధిలోని క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలోని లబ్ధిదారులకు పట్టాలు అందజేయనున్నారు. మంచిర్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మూడు రోజుల్లో దాదాపు 250 వరకు రిజిస్ట్రేషన్లు పూర్తిచేశారు. స్ర్కూటినీ అనంతరం క్యాతన్‌పల్లిలో వెయ్యి పైచిలుకు పట్టాలు జారీ చేయాల్సి ఉండగా, మిగతావి ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా ఈనెల 11వ తేదీ నుంచి బెల్లంపల్లి ఏరియాలోని లబ్ధిదారులకు మూడు రోజులపాటు రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. అనంతరం శ్రీరాంపూర్‌ ఏరియాలో రిజిస్ట్రేషన్‌లు ప్రారంభించనుండగా, సగటున రోజు 90 నుంచి 100 డాక్యుమెంట్లను పూర్తి చేస్తున్నారు. మూడు రోజుల చొప్పున మూడు ప్రాంతాల్లో మొత్తం 900 పైచిలుకు రిజిస్ట్రేషన్లు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. మిగతా రిజిస్ట్రేషన్లు ఎప్పుడు పూర్తవుతాయో, తమకు పట్టాలు ఎప్పుడు అందజేస్తారోనని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.

కేటీఆర్‌ చేతుల మీదుగా పంపిణీ

క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటి వరకు పూర్తయిన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన పట్టాలను లబ్ధిదారులకు రాష్ట్ర మున్సిపల్‌ శాఖా మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా అందజేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 12న కేటీఆర్‌ జిల్లాలో పర్యటిస్తారని ప్రచారం జరుగుతుండగా, అదేరోజు మంత్రి చేతుల మీదుగా పట్టాలు అందజేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తికాకుండానే పట్టాలు అందజేస్తే మిగిలిన దరఖాస్తులు మరుగున పడే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్‌ ఎన్నికల ముందు క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11 మందికి మాత్రమే పట్టాలు అందజేయగా, మిగతా వారు ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని దరఖాస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా అర్హత కలిగిన వారికి అధికారులు పూర్తిస్థాయిలో పట్టాలు జారీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.  

Updated Date - 2021-08-11T04:07:23+05:30 IST