శిథిలావస్థలో ఆస్పత్రులు

ABN , First Publish Date - 2021-08-26T03:09:42+05:30 IST

కాగజ్‌నగర్‌ ఎల్లాగౌడ్‌ తోటలోని పీహెచ్‌సీ భవనంలో సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని విధులు నిర్వహిస్తున్నారు. పాత భవనం కావడంతో కొత్తది పూర్తి కాక స్థలాభావంతో తప్పనిసరిగా డ్యూటీలు చేయాల్సి పరిస్థితి నెలకొంది.

శిథిలావస్థలో ఆస్పత్రులు

- ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని విధులు

- క్షణక్షణం.. భయంభయం

- పెచ్చులూడుతున్న భవనం పైకప్పు

- దశాబ్దాల కిందట నిర్మాణం

- తప్పనిసరి పరిస్థితుల్లో విధులు

- ఏళ్లు గడుస్తున్నా పూర్తికాని నూతన భవనం

కాగజ్‌నగర్‌ టౌన్‌, ఆగస్టు 25: కాగజ్‌నగర్‌ ఎల్లాగౌడ్‌ తోటలోని పీహెచ్‌సీ భవనంలో సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని విధులు నిర్వహిస్తున్నారు. పాత భవనం కావడంతో కొత్తది పూర్తి కాక స్థలాభావంతో తప్పనిసరిగా డ్యూటీలు చేయాల్సి పరిస్థితి నెలకొంది. గతంలో పలుమార్లు ఆయా గదుల్లోని స్లాబ్‌ పెచ్చులూడి కిందపడిన సంఘటనలున్నాయి. రోగులు, సిబ్బంది ఈ భవనంలోకి వెళ్లాలంటేనే జంకుతున్నారు. పక్కనే ఉన్న సీమాంక్‌ సెంటర్‌ పది సంవత్సరాల కిందట నిర్మించగా అక్కడ ప్రసూతి సేవలు, వాక్సినేషన్‌ ఇతర కార్యకలాపాలకే ఆ భవనం సరిపోతోంది. పాత పీహెచ్‌సీ భవనంలో మందులు, ల్యాబ్‌, సిబ్బంది కంప్యూటర్‌ గది, మలేరియా యూనిట్‌ తదితర పనులకు వాడుతున్నారు. ఈనెల 23న విధుల్లో ఉన్న కంప్యూటర్‌ ఆపరేటర్‌ చంద్రయ్య తలపై పెచ్చులూడి పడడంతో తీవ్రగాయాలయ్యాయి. ఐతే కాగజ్‌నగర్‌ పట్టణ జనాభాకు సరిపడాలనే ఉద్దేశ్యంతో మరో భవనాన్ని సైతం నిర్మిస్తున్నారు. కానీ ఈ భవనం పూర్తి చేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పీహెచ్‌సీ పాత భవనం, సిమాంక్‌ భవనం రెండు కలిపి కొనసాగాలంటే నూతన భవనం తప్పనిసరి. 

ఐదేళ్లుగా సాగుతున్న పనులు..

మూడు దశాబ్దాల కిందట నిర్మితమైన పీహెచ్‌సీ భవనంలో రోగులు, సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మెలుగుతున్నారు. స్లాబ్‌ ఇనుప చువ్వలు బయటపడి దర్శనమిస్తున్నాయి. ఈ భవనంలో సుమారు 12గదులు ఉన్నాయి. ప్రతీ గదిలోనూ స్లాబ్‌ పెచ్చులూడి కింద పడుతోంది. అయినా తప్పని సరి పరిస్థితుల్లో విధులు నిర్వహించాల్సి వస్తోందని పేర్కొంటున్నారు.  కాగజ్‌నగర్‌ పీహెచ్‌సీ అప్‌గ్రేడ్‌ అయిన తర్వాత కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌గా మార్పు చేశారు. పక్కనే నూతనంగా 30పడకల  ఆస్పత్రి భవనాన్ని రూ.4 కోట్ల అంచనాలతో చేపడుతున్నారు. 30 పడకల ఆస్పత్రి భవన నిర్మాణం కోసం 19-5-2016లో ఒకసారి, అంతకుముందు 15-2-2009లో కూడా అదే నూతన 30పడకల ఆస్పత్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రెండు ప్రభుత్వాల్లో చేపట్టిన శిలాఫలాకాలు కనిపిస్తున్నా పనులు మాత్రం నత్తనడకన కొనసాగుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా భవనం పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్‌ కూడా జాప్యం చేస్తూ వస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కొంతకాలం చురుకుగానే సాగిన పనులు బిల్లులు మంజూరు కాకపోవడంతో నెమ్మదించాయి. ప్రస్తుతం రెండు నెలల్లో భవనం అందుబాటులోకి వస్తుందని ఇంజనీరింగ్‌ అధికారులు పేర్కొంటున్నారు. 

శిథిలావస్థకు చేరిన ఈఎస్‌ఐ భవనాలు..

పట్టణంలోని ఈఎస్‌ఐ ఆస్పత్రి భవనాలు, క్వార్టర్లు దశాబ్దాల కిందట నిర్మించినవే. వీటిలోనూ పెచ్చులూడుతున్నాయి. వర్షాకాలంలో ఆయా భవనాలు, సిబ్బంది నివాసం ఉండే క్వార్టర్లు శిథిలమౌతున్నాయి. పురాతన భవనాలలో పెద్ద ప్రమాదాలు చోటు చేసుకోక ముందే ఈ భవనానికి మరమ్మతులైనా చేయాలని, లేదా శాశ్వతంగానైనా మూసివేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా నూతన భవనం పూర్తి చేసి వైద్య సేవలు అందించాలని పట్టణవాసులు కోరుతున్నారు. 

దిక్కుతోచని పరిస్థితుల్లో విఽధులు చేస్తున్నాం..

-నియాజుద్దీన్‌, పీహెచ్‌సీ సీనియర్‌ అసిస్టెంట్‌, కాగజ్‌నగర్‌ 

ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని విధులు నిర్వహిస్తున్నాం. ఇప్ప టికే పలుసార్లు స్లాబ్‌ పెచ్చులూడి పడ్డాయి. చాలాసార్లు రాత్రి వేళల్లో పెచ్చులూడి పడడంతో ప్రమాదాలు తప్పాయి. కార్యాలయం, ఆస్పత్రికి సరిపోయే స్థలం లేదు. త్వరగా పూర్తయి నూతన భవనంలోకి మారితే బాగుంటుంది. పాత పీహెచ్‌సీ భవనం కావడంతోపాటు ఇటీవల భారీ వర్షాలకు స్లాబ్‌ కూలు తోంది. ఆయా గదుల్లోని వస్తువులు, పరికరాలు దెబ్బతిన్నాయి.

Updated Date - 2021-08-26T03:09:42+05:30 IST