చిగురిస్తున్న ఆశలు

ABN , First Publish Date - 2021-01-20T05:38:12+05:30 IST

జిల్లా వాసుల్లో గాలి మోటార్‌ ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) జిల్లా కేంద్రంలో విమానాశ్రయ నిర్మాణానికి సాను కూల నిర్ణయం తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా నివేదిక ఇచ్చింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో మరోసారి కదలిక వచ్చింది.

చిగురిస్తున్న ఆశలు
ఇటీవల విమానాశ్రయ స్థలంలో సాయిల్‌ టెస్టు చేస్తున్న అధికారులు

జిల్లా కేంద్రంలో విమానాశ్రయ ఏర్పాటుకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా సానుకూల నివేదిక

సర్వే పనులకు అడ్డుచెప్తున్న ఎయిర్‌ఫోర్స్‌ అథారిటీ 

దశాబ్దాలుగా నిర్మాణానికి నోచుకోని విమానాశ్రయం

కేంద్ర ప్రభుత్వం చొరవ చూపితేనే కల సాకారం

ఆదిలాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): జిల్లా వాసుల్లో గాలి మోటార్‌ ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) జిల్లా కేంద్రంలో విమానాశ్రయ నిర్మాణానికి సాను కూల నిర్ణయం తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా నివేదిక ఇచ్చింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో మరోసారి కదలిక వచ్చింది. ఇన్నాళ్లు ఇదిగో విమానాశ్రయం.. అదిగో అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఊరిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉడాన్‌ పథకం కింద ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమ తులు ఇచ్చింది. అయినా అనుకున్నంత స్థాయిలో పనులు ముందుకు సాగడం లేదు. ఇప్పటికే సర్వే పనులను పూర్తిచేసి కేంద్రానికి నివేదిక ఇవ్వడంతో గాలిమోటార్‌పై ఆశలు చిగురించిన అంతలోనే ఆటంకాలు ఎదురయ్యాయి. అయితే విమానాశ్రయం నిర్మించే స్థలంలో సాయిల్‌ టెస్టుకు ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో ఆలస్యం జరుగుతోందని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ప్రైవేట్‌ స్థలంలో సాయిల్‌ టెస్టును పూర్తిచేసిన అధికారుల బృందం ప్రభుత్వం కేటాయించిన స్థలంలో సాయిల్‌ టెస్టు చేయకుండానే వెళ్లి పోయింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యం త్రాంగం రంగంలోకి దిగి విమానాశ్రయం నిర్మాణం కోసం దాదాపుగా 1590 ఎకరాల స్థల సేకరణను పూర్తి చేశారు. మహారాష్ట్రలోని ప్రధాన వాణిజ్య కేంద్రమైన నాగ్‌పూర్‌కు అతి సమీపంలో ఉండడం, హైదరా బాద్‌తో పాటు మహానగరాలకు సుదూరంగా ఉండడంతో ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో విమానాశ్రయ నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం తప్పని సరిగా మారింది. అయితే అనూహ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను విభజించి కుమరం భీం, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాలను ఏర్పాటు చేశా రు. దీంతో జిల్లా ప్రాంతానికి కొంత మేరకు ప్రాధాన్యత తగ్గినట్లయింది. నిర్మల్‌ జిల్లా ప్రాంతం నిజామాబాద్‌ జిల్లాకు చేరువ కావడం, మంచిర్యాల జిల్లా కరీంనగర్‌ జిల్లాకు దగ్గర కావడంతో ఆదిలాబాద్‌ జిల్లా మహారాష్ట్ర సరిహద్దులకే పరిమితమయ్యింది. మొత్తానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నాన్చుడు ధోరణితో జిల్లా వాసులకు ఎదురు చూపులు తప్పడం లేదు. 

మరోసారి తెరపైకి..

ఇప్పటికే పలుమార్లు వివిధ సంస్థలు విమానాశ్రయ నిర్మాణానికి కావాల్సిన సర్వేలను పూర్తిచేసిన జాప్యం జరుగుతూనే ఉంది. తాజాగా ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించే ఆరు విమానాశ్రయాల నిర్మాణానికి ఇచ్చిన సానుకూల నివేదికలో ఆదిలాబాద్‌ జిల్లా పేరు కూడా ఉండడంతో మరోసారి విమానాశ్రయ నిర్మాణం తెరపైకి వచ్చింది. పూణేకు చెందిన రాజ్‌కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ సర్వే చేసి 20కి.మీల దూరం ప్రాంతంలో ఉన్న ఇబ్బంది ప్రాంతాలను గుర్తించింది. ఇందులో సీసీఐలో ఉన్న నిర్మాణాలు, సాత్నాల, ఖానాపూర్‌ రోడ్డుపై ఉన్న వాటర్‌ ట్యాంక్‌, విమానాశ్రయ నిర్మాణానికి దగ్గరలో ఉన్న హైటెన్షన్‌ పోల్స్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇటీవల జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జిల్లా కేంద్రంలో విమానాశ్రయ నిర్మాణం కోసం తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం స్థల సేకరణ పూర్తి చేసి అప్పగిస్తే వెంటనే పనులు ప్రారంభించేలా చొరవ తీసుకుంటానని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి సానుకూల నివేదిక ఇవ్వడంతో జిల్లా వాసుల్లో విమానాశ్రయ నిర్మాణంపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. 


సమన్వయం కరువు..

కేంద్ర ప్రభుత్వ సంస్థలైనా ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా, ఎయిర్‌పోర్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాల మధ్య సమన్వయం కొరవ డినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే జిల్లా కేంద్రంలో విమానాశ్రయం నిర్మించే స్థలంపై అభ్యంతరాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే సాధ్య సాధ్యాలను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఏఏఐని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో స్పందించిన ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా జిల్లాలో పర్యటించి సర్వే చేసేందుకు రంగంలోకి దిగిం ది. ఇంతలోనే ఎయిర్‌ఫోర్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సర్వే పనులకు అడ్డుచెప్పడంతో అర్ధాంతరంగానే సర్వే పనులు నిలిచిపోయాయి. ఇకనైనా కేంద్ర ప్రభుత్వమే ప్రత్యేక చొరవ తీసుకొని స్థల వివాదం సద్దుమనిగేలా చూడాలంటున్నారు.

ఇదే మంచి తరుణం..

జిల్లా కేంద్రంలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతం మెరుగైన అవకాశాలున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థే జిల్లాలో ఎంపీగా విజయం సాధించారు. దీంతో కేంద్రంలోనూ బీజేపీ అధికారంలో ఉండడంతో ఇక విమానాశ్రయ నిర్మాణానికి మార్గం మరింత సుగమమైందని జిల్లా వాసులు భావిస్తున్నారు. ఇప్పటికే ఎంపీ సోయం బాపూరావు పలు మార్లు పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రస్తావిస్తూ జిల్లాలో విమానాశ్రయ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయితే అనుకు న్నంత స్థాయిలో పనులు వేగవంతం కాకపోవడంతో మళ్లీ అనుమా నాలే వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ సారి విమానాశ్రయ నిర్మాణం పనులు పూర్తికాకుంటే ఇక భవిష్యత్‌లో భరోసా లేనట్లేనన్న అభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2021-01-20T05:38:12+05:30 IST