సరిహద్దుకు రాజమార్గం

ABN , First Publish Date - 2021-12-19T06:02:01+05:30 IST

గత రెండు దశాబ్దాల నుంచి అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ప్రజలను వేరు చేస్తున్న ఓ ప్రధానరోడ్డు నిర్మాణానికి కొద్దిరోజుల క్రితం మోక్షం లభించింది.

సరిహద్దుకు రాజమార్గం
అడెల్లి నుంచి బోథ్‌ మండలంలోని రఘునాథ్‌పూర్‌ వరకు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న దృశ్యం

మహారాష్ట్ర లోని కిన్వట్‌తో నిర్మల్‌కు అనుసంధానం 

చురుకుగా సాగుతున్న                                                      

అడెల్లి - బోథ్‌ రోడ్డు నిర్మాణ పనులు 

అటవీశాఖ అనుమతులతో తొలగిన ఇబ్బందులు 

ఇరు రాష్ట్రాలకు తగ్గనున్న 30 కిలోమీటర్ల దూరభారం 

నిర్మల్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : గత రెండు దశాబ్దాల నుంచి అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ప్రజలను వేరు చేస్తున్న ఓ ప్రధానరోడ్డు నిర్మాణానికి కొద్దిరోజుల క్రితం మోక్షం లభించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాలం నుంచి ఈ రోడ్డు సమస్యకు పరిష్కారం లభించక ఇరువైపుల ప్రజలు తీవ్రఇబ్బందులకు గురయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అటు ప్రభుత్వం ఇటు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ రోడ్డు నిర్మాణానికి ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేశారు. జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన అడెల్లిపోచమ్మ దేవాలయం నుంచి బోథ్‌ మండలంలోని రఘునాథ్‌పూర్‌ వరకు దాదాపు ఆరు కిలోమీటర్ల పొడవుతో ప్రస్తుతం జరుగుతున్న రోడ్డునిర్మాణ పనులు మహారాష్ట్ర - తెలంగాణ సరిహద్దులను అనుసంధానం చేయబోతోంది. రూ.9.80 కోట్లతో నిర్మిస్తున్న ఈ రోడ్డుకు మొదట్లో అనేక ఆటంకాలు మొదలయ్యాయి. ప్రభుత్వం మం జూరు చేసిన నిధులను విడుదల చేయకపోవడం అలాగే ప్రతిపాదన రూపకల్పనలో సైతంజాప్యం జరగడంతో పాటు  కీలకమైన అటవీశాఖ అనుమతులు లభించకపోవడం మొన్నటి వరకు ఈ రోడ్డు నిర్మాణానికి శాపంగా మారాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ అటవీ శాఖ రోడ్డు నిర్మాణ పనుల అనుమతులకు అనేక అవరోధాలు సృష్టించింది. అటవీశాఖ అనుమతుల కోసం స్థానిక ప్రజా ప్రతినిధులు అన్ని రకాల ప్రయత్నాలు కొనసాగించారు. ప్రభుత్వం సైతం కిందిస్థాయిలో అటవీ అనుమతుల సాధనకు ప్రయత్నించింది. జిల్లాకు చెందిన అటవీ శాఖ మంత్రి అల్లోలఇంద్రకరణ్‌రెడ్డి తన శక్తి సామర్థ్యాల మేరకు అటవీ అనుమతుల కోసం పట్టుపట్టారు. ఎట్టకేలకు అటవీ ఈ రోడ్డు నిర్మాణ పనులకు గ్రీన్‌ సిగ్నల్‌ జారీ చేసింది. దీంతో సంబందిత శాఖ ఎట్టకేలకు పనులను మొదలుపెట్టింది. ఆరు కిలో మీటర్ల రోడ్డు మధ్యలో రెండు చోట్ల బ్రిడ్జిలను సైతం నిర్మిస్తున్నారు. మొదట ఈ బ్రిడ్జిల నిర్మాణాన్ని కూడా అటవీ శాఖ అడ్డుపడింది. అనుమతులు మంజూరైన కారణంగా పనులు మొదలుపెట్టడంతో అటు మహారాష్ట్ర ఇటు జిల్లా ప్రజల సమస్య ఎట్టకేలకు దూరం కాబోతోందంటున్నారు. ప్రతిరోజూ మహారాష్ట్రలోని కిన్వట్‌తో పాటు మరికొన్ని గ్రామాల ప్రజలు నిర్మల్‌కు పెద్దసంఖ్యలో వ్యాపార పనులతో పాటు ఇతర పనులపై కూడా వస్తుంటారు. అలాగే జిల్లావాసులు కిన్వట్‌కు సమీప గ్రామాలకు కూడా పెద్దసంఖ్యలో వెళ్లి వస్తుంటారు. ఇప్పటి వరకు రోడ్డు లేని కారణంగా వీరు అదనంగా 30 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. రోడ్డునిర్మాణం పూర్తయితే ఇరు వైపుల వారికి 30 కిలోమీటర్ల మేరకు దూరభారం తగ్గబోతోందంటున్నారు. రోడ్డునిర్మాణం పూర్తయితే రవాణారంగం, వ్యాపార, వాణిజ్య రంగాలు సైతం విస్తరించే అవకాశాలు ఏర్పడతాయని చెబుతున్నారు. 

అనుసంధానం కానున్న ఇరు రాష్ట్రాలు 

అడెల్లి నుంచి బోథ్‌ మండలంలోని రఘునాథ్‌పూర్‌ వరకు నిర్మిస్తున్న రోడ్డు కారణంగా అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ రాష్ర్టాల సరిహద్దు లు అనుసంధానం కానున్నాయంటున్నారు. జిల్లావాసులు చాలా మందికి కిన్వట్‌వాసులతో అలాగే అక్కడి వారికి నిర్మల్‌వాసులతో సమీప బంధుత్వాలున్నాయి. శుభకార్యాలు, పెండ్లివేడుకలకు అలాగే వ్యాపారాల కోసం సైతం ఇరువైపులా వారు వెళ్లి వస్తుంటారు. అయితే రోడ్డుమార్గం లేని కారణంగా వీరంతా 30 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించి గమ్య స్థా నాలకు చేరుకుంటున్నారు. చాలా సంవత్సరాల నుంచి ఇరు రాష్ర్టాల సరిహద్దు వాసులు అడెల్లి నుంచి బోథ్‌ వరకు రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఈ డిమాండ్‌ను అంతగా పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ రోడ్డు మార్గంపై స్థానికులే కాకుండా ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు సైతం గళమెత్తారు. ఎట్టకేలకు ఈ రోడ్డు నిర్మాణ ప నులకు మోక్షం లభించడంతో ఇరు రాష్ర్టాల సరిహద్దుల వాసులు సం బురపడుతున్నారు. 

అడ్డుకున్న అటవీ అనుమతులు

ఇదిలా ఉండగా అడెల్లి నుంచి బోథ్‌ వరకు నిర్మించ తలపెట్టిన రోడ్డు మార్గానికి అటవీశాఖ అనుమతులు ఆటంకాలు సృష్టించాయి. దాదాపు రెండు దశాబ్దాల నుంచి అటవీశాఖ ఈ రోడ్డు నిర్మాణానికి అనుమతులు జారీ చేయకుండా జాప్యం చేసింది. ఈ రోడ్డు మార్గం దట్టమైన అడవుల మధ్య ఉన్న కారణంగా అనుమతులపై అటవీశాఖ అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆరు కిలోమీటర్ల పొడవుతో అడవుల మధ్య నిర్మించే ఈ రోడ్డుపై రెండు కల్వర్టులను నిర్మించనున్న కారణంగా అటవీశాఖ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని అనుమతులకు మోకాలు అడ్డింది. అయి తే జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అటవీశాఖ నేతృత్వ బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఈ రోడ్డు నిర్మాణం కోసం అటవీ అనుమతుల సాధనను టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఆయన రాష్ట్రస్థాయిలోనే కాకుండా డిల్లీ స్థాయిలో అటవీ, పర్యావరణ శాఖ అనుమతులను ఎట్టకేలకు సాఽధించగలిగారు. అటవీశాఖ అనుమతులు మంజూరు కాగానే సంబంధిత అధికారులు శరవేగంగా పనులను మొదలుపెట్టారు. ఇప్పటి వరకు రూ.9 కోట్ల విలువైన పనులకు గానూ దాదాపు రూ. 5 కోట్ల పనులను పూర్తి చేశారు. అలాగే రూ.2 కోట్లతో బ్రిడ్జిలను సైతం నిర్మిస్తున్నారు. 

విస్తరించనున్న వ్యాపార, వాణిజ్య రంగాలు

అడెల్లి నుంచి బోథ్‌ వరకు రోడ్డు నిర్మాణంతో అటు మహారాష్ట్ర సరిహద్దులు, ఇటు జిల్లా సరిహద్దుల్లో వ్యాపార వాణిజ్య రంగాలు విస్తరించనున్నాయంటున్నారు. అలాగే పవిత్ర క్షేత్రమైన అడెల్లి మహాపోచమ్మను దర్శించుకునేందుకు వచ్చే బోథ్‌, ఆదిలాబాద్‌ తదితర ప్రాంతాల వాసులు ఈ మార్గం ద్వారా చేరుకునే అవకాశం ఉంటుంది. దాదాపు 30 నుంచి 40 కిలో మీటర్ల దూరభారం తగ్గవచ్చంటున్నారు. 

మార్చిలోగా రోడ్డు నిర్మాణ పనులు పూర్తి

ఈ విషయమై రోడ్డు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ అశోక్‌ కుమార్‌ను సంప్రదించగా అడెల్లి గ్రామం నుంచి ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం రఘునాథ్‌పూర్‌ గ్రామం వరకు చేపట్టే ఈ రోడ్డు నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 9.08 కోట్లను మంజూరు చేసిందన్నారు. ప్రస్తుతం రూ. 5 కోట్ల నిధులు ఖర్చు అయ్యాయని తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రయాణికులకు దూరభారం తగ్గడమే కాకుండా వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు మెరుగుపడతాయన్నారు. రాబోయే మార్చి మాసం కల్లా ఈ రోడ్డు నిర్మాణం పను లు పూర్తవుతాయని ఆయన వివరించారు. 


Updated Date - 2021-12-19T06:02:01+05:30 IST