ముంచెత్తిన వాన

ABN , First Publish Date - 2021-08-20T06:08:05+05:30 IST

జిల్లా వ్యాప్తంగా మూడు రోజలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గురువారం జిల్లా వ్యాప్తంగా 76.7మి.మీల వర్షపాతం నమోదైంది.

ముంచెత్తిన వాన

పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు  

జలమయమైన లోతట్టు ప్రాంతాలు

నీట మునిగిన పంటలు 

ఆందోళనలో జిల్లాలోని రైతులు

ఆదిలాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా మూడు రోజలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గురువారం జిల్లా వ్యాప్తంగా 76.7మి.మీల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా తలమడుగు మండలంలో 128మి.మీలు, తాంసిలో 112.8, బజార్‌హత్నూర్‌లో 120.3 మి.మీల వర్షపాతం నమోదైంది. మత్తడివాగు ప్రాజెక్టు నీటి మట్టం 277.00 మీటర్లకు చేరుకోగా 5 వరద గేట్లను ఎత్తి 23వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు. అలాగే సాత్నాల ప్రాజెక్టు 285.65 పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో 2 వరద గేట్లను ఎత్తి దిగువకు 2300 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఇంద్రవెల్లి మండలం మల్లాపూర్‌ గ్రామంలో చెక్‌డ్యాం తెగిపోవడంతో పత్తి, కంది పంటలు ధ్వంసమైంది. ఎగువ ప్రాంతమై మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా సరిహద్దుల్లో ప్రవహిస్తున్న పెన్‌గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నది పరివాహక ప్రాంతంలో ఉన్న పొలాలు నీటమునిగాయి. చాంద, తర్ణం వాగులు ఉధృతంగా ప్రవహించాయి. 

చెరువులకు జలకళ..

ఉట్నూర్‌: వరుసగా కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీ ప్రాంతంలోని చెరువులు జలకళ సంతరించుకున్నాయి. మండలంలోని శంభు మత్తడిగూడ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో అక్కడి నుంచి ఉట్నూర్‌ ప్రాంతంలో ఉన్న గొలుసు చెరువులకు వరద నీరు చేరింది. మత్తడిగూడ ప్రాజెక్టు కింద ఉన్న బాయమ్మకుంట పీడర్‌ చానల్‌ ద్వారా సరస్వతి చెరువు, గంగన్నపేట చెరువు, నేరేడిచెరువు, గోపాయిచెరువు, ఎల్లమ్మ చెరువులకు నీరు చేరడంతో ఈ ప్రాంతంలోని చెరువులకు జలకళ ఉట్టిపడుతోంది. గురువారం నార్నూర్‌, గాదిగూడ మండలాల్లో 89 మి.మీ. ఇంద్రవెల్లి మండలంలో 70 మి.మీ., ఉట్నూర్‌ మండలంలో 20మి.మీ. వర్షపాతం నమోదయింది. 

నీట మునిగిన పంటలు..

బజార్‌హత్నూర్‌: మండలంలో బుధవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి మండలంలోని వాగులు, వంకలు పొంగి పొర్లడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్ప డింది. ముంపు గ్రామమైన దేగామ గ్రామంలో చెరువులోకి భారీగ వరద నీరు వచ్చి చేరడంతో సమీపంలోని కాలనీ లలో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కున్నారు. మడలంలోని కడెంవాగు, కొల్హారివాగు, బండ్రెవ్‌వాగు, బలన్‌పూర్‌ వాగుల పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ భూములలోకి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో మొత్తం పంటలు నీటమునిగిపోయాయి.

సాత్నాల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత..

జైనథ్‌: పెన్‌గంగా నది వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో సాత్నాల ప్రాజెక్టు గరిష్ఠ సామర్థ్యం 286.50 అడుగుల మీటర్లు ఉండగా గురువారం ప్రాజెక్టు సామర్థ్యం 286.65 అడుగులు రాగా ప్రాజెక్టు నీటి సామర్థ్యం 1.24 వరద టీఎంసీగా చేరుకోవడంతో ప్రాజెక్టుకు సంబంధించిన మూడు గేట్లను వదిలి వరద నీటిని తరలించారు. ప్రస్తు తం ప్రాజెక్టు నీటి సామర్థ్యం 1.036 టీఎంసీలు ఉండగా ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 4500 క్యూ సెక్కులు, ఔట్‌ ఫ్లో 4500 క్యూసెక్కులు ఉందని డీఈ శ్రీనివాస్‌రావ్‌, ఈఈ విఠల్‌రాజు, జేఈలు ప్రసాద్‌, మారుతిలు తెలిపారు. కాగా మండలంలో గురువారం 49.8 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది.

ఐదు గేట్లు ఎత్తివేత..

తాంసి: మండలంలోని వడ్డాడి గ్రామ సమీపంలో ఉన్న మత్తడివాగు ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. గురువారం మధ్యాహ్నం వరకు కురిసిన వర్షంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో ప్రాజెక్టు 5 గేట్లను ఎత్తి 23 వేల క్యూసెక్కుల నీటిని బయటకు వదిలారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 277.50మీటర్లు కాగా, గురువారం మధ్యాహ్నానికి 277 మీటర్లకు చేరుకుంది.  

ఇళ్లల్లోకి వరద నీరు..

గుడిహత్నూర్‌: మండలంలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. మండలంలోని మన్నూర్‌ ఎస్సీ కాలనీలో పలువురి ఇండ్లలోకి వరద నీరు చేరడంతో వస్తువులు తడిసి పోయాయి. అలాగే వరద నీరు రోడ్లపైకి చేరడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడ్డారు.

అన్నదాతల అవస్థలు..

తలమడుగు: మండలంలో కజ్జర్ల గ్రామంలోని కాలనీలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వందల ఎకరాల్లో పంటలు నీట మునగడంతో అన్నదాతకు తీవ్ర నష్టం వాటిల్లింది. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం అందక ముందే మళ్లీ పంటలు నీట మునగడంతో అన్నదాతలు అతలాకుతలమవుతున్నారు. కజ్జర్ల గ్రామ సమీపంలోని కెనాల్‌ వాగుకు మరమ్మతులు సక్రమంగా చేపట్టక పోవడంతో వర్షపు నీరు ఇండ్లలోకి ప్రవహించి నిత్యావసర సరుకులు తడిసి ముద్దయ్యాయని కాలనీ వాసులు వాపోయారు.  

ఉప్పొంగిన వాగులు, వంకలు..

బోథ్‌రూరల్‌: మండల వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు గురువారం మండలంలోని పలు వాగులు, వంకలు ఉప్పొంగి పారుతున్నాయి. ముఖ్యంగా లోలెవల్‌ వంతెనలు గల నక్కలవాడ, మందతోగడ, ధన్నూర్‌, వాగులు బ్రిడ్జిల పై నుంచి పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నక్కలవాడ బ్రిడ్జిపై పోలీసులు తాడును ఏర్పాటుచేసి ప్రజలనువాగును దాటించారు. 

 తెగిన చెక్‌డ్యాం కట్ట..

సిరికొండ/ఇంద్రవెల్లి: సిరికొండ మండలం మల్లాపూర్‌ గ్రామపంచా యతీ పరిధిలోని చెక్‌డ్యామ్‌ గండి పడడంతో దిగువ ప్రాంతంలోని  పొలా ల్లోకి ఒక్కసారిగా నీరు చేరడంతో పూర్తిగా దెబ్బతిన్నాయి. వర్షానికి దాదాపు 25 ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

Updated Date - 2021-08-20T06:08:05+05:30 IST