వర్షం.. హర్షం...
ABN , First Publish Date - 2021-07-09T04:02:29+05:30 IST
జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. రోడ్లన్ని జలమయమయ్యాయి. వాగులు, చెరువుల్లోకి వర్షపు నీరు చేరింది. జిల్లా కేంద్రంలోని రాళ్లవాగు ఉప్పొంగి ప్రవహించింది.

జిల్లాలో 2.5 సెం.మీ వర్షపాతం నమోదు
ఎల్లంపల్లి ప్రాజక్టులోకి భారీగా వరద
బురదమయంగా మారిన రోడ్లు
గనుల్లో బొగ్గు ఉత్పత్తికి స్వల్ప అంతరాయం
మంచిర్యాల, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. రోడ్లన్ని జలమయమయ్యాయి. వాగులు, చెరువుల్లోకి వర్షపు నీరు చేరింది. జిల్లా కేంద్రంలోని రాళ్లవాగు ఉప్పొంగి ప్రవహించింది. వంతెన కూలిన చోట పోసిన మట్టి బురదమయంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా సింగరేణి ఓపెన్ కాస్టు ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తిలో అంతరాయం ఏర్పడింది. భారీ వర్షంతోపాటు పిడుగులు పడడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
జిల్లాలో 2.5 సెం.మీ వర్షపాతం నమోదు...
గడిచిన 24 గంటల్లో జిల్లాలో 2.5 సెంటీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జన్నారం మండలంలో గరిష్టంగా 8.2 సెంటీమీటర్ల నమోదుకాగా, దండేపల్లిలో 6.8 సెం.మీ, లక్షెట్టిపేటలో 3.8 సెం.మీ, మందమర్రిలో 1.4 సెం.మీ, మంచిర్యాలలో 4.4 సెం. మీ, జైపూర్‌లో 3.9 సెం.మీ, చెన్నూరులో 0.8 సెం.మీ, కాసిపేటలో 3.5 సెం.మీ, తాండూరులో 0.9 సెం.మీ, బెల్లంపల్లిలో ఒక సెంటీమీటర్ వర్షం కురిసింది. ఈయేడు జూన్ 1 నుంచి జూలై 8 వరకు జిల్లాలో 26.3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
ఎల్లంపల్లి ప్రాజెక్టుకు జలకళ...
హాజీపూర్ మండలం గుడిపేట సమీపంలో ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. పెద్ద మొత్తంలో వరద నీరు చేరుతుండటంతో ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలకు ప్రస్తుతం 15.378 టీఎంసీల నీరు చేరింది. వర్షం కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి 23,370 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. తొలి వర్షాలకే ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరడంతో జలాశయం నిండుకుండను తలపిస్తోంది. గత సంవత్సరం జూలై 8వ తేదీన ప్రాజెక్టులో నీటి మట్టం 139.94 మీటర్లు ఉండగా, 4.848 టీఎంసీల నీరు చేరింది. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇప్పటివరకు దాదాపు 10 టీఎంసీల నీరు అధికంగా చేరింది.
బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
భారీ వర్షం కారణంగా సింగరేణి ఉపరితల, భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి స్వల్ప అంతరాయం ఏర్పడింది. వర్షం నీరు ఓసీలలో నిలిచి ఉండటంతో ఉత్పత్తికి ఆటంకం కలిగింది. మందమర్రి ఏరియాలో 12,981 క్యూబిక్ మీటర్ల బొగ్గు వెలికితీత లక్ష్యం కాగా శుక్రవారం 9450 క్యూబిక్ మీటర్ల ఉత్పత్తి జరిగింది. బెల్లంపల్లి ఏరియాలో 8593 క్యూబిక్ మీటర్లకు 3019 క్యూబిక్ మీటర్లు, శ్రీరాంపూర్ ఏరియాలో 17,519 క్యూబిక్ మీటర్లకుగాను 16,109 క్యూబిక్ మీటర్ల బొగ్గు ఉత్పత్తి జరిగింది. మూడు ఏరియాల్లో 10, 515 క్యూబిక్ మీటర్ల బొగ్గు ఉత్పత్తికి వర్షం ఆటంకం కలిగించింది.