శిథిలావస్థలో ప్రభుత్వ భవనాలు

ABN , First Publish Date - 2021-08-28T03:46:43+05:30 IST

జిల్లాలోని ప్రభుత్వ భవనాలు శిథిలావస్థకు చేరాయి. పలు ఆస్పత్రుల భవనాలు కూలిపోయే దశలో ఉన్నా కనీసం మరమ్మతులకు నోచుకోవడం లేదు. స్లాబు పెచ్చులు ఊడి పడుతుండడంతో గదులలోకి వెళ్లాలంటేనే వైద్యులు, సిబ్బంది జంకుతు న్నారు. స్లాబుల పెచ్చులూడి పడడంతోపాటు గోడలు కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. కురుస్తున్న వర్షాలతో స్లాబులు ఉరుస్తున్నాయి.

శిథిలావస్థలో ప్రభుత్వ భవనాలు
శిథిలావస్థకు చేరిన జైపూర్‌ పీహెచ్‌సీ భవనం

అధ్వాన్న స్థితిలో కార్యాలయాలు

పెచ్చులూడి పడుతున్న స్లాబులు

కూలేందుకు సిద్ధంగా ఉన్న గోడలు

గాయాల పాలవుతున్న ఉద్యోగులు

మంచిర్యాల, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ భవనాలు శిథిలావస్థకు చేరాయి. పలు ఆస్పత్రుల భవనాలు కూలిపోయే దశలో ఉన్నా కనీసం మరమ్మతులకు నోచుకోవడం లేదు. స్లాబు పెచ్చులు ఊడి పడుతుండడంతో గదులలోకి వెళ్లాలంటేనే వైద్యులు, సిబ్బంది జంకుతు న్నారు. స్లాబుల పెచ్చులూడి పడడంతోపాటు గోడలు కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. కురుస్తున్న వర్షాలతో స్లాబులు ఉరుస్తున్నాయి. ఆస్పత్రుల గోడలను ఆనుకొని పాములు పుట్టలు పెడుతున్నా పట్టించుకొనే వారు లేరు. లక్షెట్టిపేట మున్సిపాలిటీలో ప్రభుత్వ ఆస్పత్రి భవనం పూర్తి శిథిలావస్థకు చేరగా దాని పక్కనే నిర్మించిన మరో భవనంలోకి మార్చారు. పాత ఆస్పత్రి స్థానంలో రూ.20 కోట్లతో అధునాత న భవనం నిర్మిస్తామన్న ప్రజాప్రతినిధులు హామీలు నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా కార్యరూపం దాల్చలేదు. 

పెచ్చులూడుతున్న స్లాబులు...

ప్రభుత్వ ఆస్పత్రుల భవనాల స్లాబులు అనేక చోట్ల పెచ్చులూడి రాడ్లు బయటపడి ప్రమాదకరంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడంలేదు. సంవత్సరం  క్రితం జిల్లా కేంద్రంలోని పశువుల ఆసుపత్రిలో స్లాబు పెచ్చులూడిపడగా వైద్యుడు త్రుటిలో తప్పించుకున్నాడు. ఈ సంఘటనలో సామగ్రి ధ్వంసంకాగా ఇప్పటికీ అదే పరిస్థితి నెలకొంది.  కాసిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరి సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకోకపోవడంతో స్లాబు పెచ్చులూడి ఇనుప రాడ్లు బయటపడ్డాయి. మరమ్మతులు చేపట్టకపోతే స్లాబు కూలిపోయే ప్రమాదం ఉంది. జైపూర్‌ మండలంలోని కుందారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఎనిమిది గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉన్న ఆస్పత్రి స్థితిగతులకు భయపడి ఇక్కడ చికిత్స పొందేందుకు ప్రజలు జంకుతున్నారని సిబ్బందే చెబుతున్నారు. మందులు నిల్వచేసే గదిలో స్లాబు విరిగి ఇనుపరాడ్లు బయటపడ్డాయి. గోడలకు పెద్ద పెద్ద పగుళ్లు ఏర్పడి కూలేందుకు సిద్ధంగా ఉంది. ఆస్పత్రి గోడను ఆనుకొని పాములు పుట్టలు ఏర్పాటు చేయగా పిచ్చి మొక్కలతో ఆవరణ నిండిపోయింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కొన్ని వార్డుల్లో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. అత్యంత కీలకమైన లేబర్‌ వార్డులో గోడలకు పగుళ్లు తేలి, వర్షాలకు గోడలు నానుతున్నాయి. స్లాబు పెచ్చులూడి ప్రమాదకరంగా తయారైంది. 

గాయపడిన పంచాయతీ అధికారి

ఇటీవల కురిసిన వర్షాల కారణంగా జూలై 18న జైపూర్‌ మండల అభివృద్ధి అధికారి కార్యాలయం స్లాబు పెచ్చులూడి పడి మండల పంచాయతీ అధికారి సతీష్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కార్యాలయంలో పని నిమిత్తం వస్తుండగా హఠాత్తుగా స్లాబు పెచ్చులు విరిగి పడి తలకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే ఇప్పటికీ భవనం పరిస్థితి అలాగే ఉంది. భవనం ఎప్పుడు కూలుతుందో తెలియక అధికారులు, సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి భవనాల స్థితిగతులపై ప్రభుత్వానికి నివేదిక పంపి నూతన కట్టడాలకు అనుమతులు తెప్పించాలని వివిధ శాఖల అధికారులతోపాటు ప్రజలు కోరుతున్నారు. 


Updated Date - 2021-08-28T03:46:43+05:30 IST