‘నామినేటెడ్‌’పై నాన్చుడేనా?

ABN , First Publish Date - 2021-02-07T05:25:19+05:30 IST

రాష్ట్రంలో రెండోసారి అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పలువురు జిల్లా నేతలు భారీ ఆశలు పెట్టుకున్నారు. అయినా ప్రభుత్వం నామినెట్‌ పదవులపై నాన్చుడు ధోరణితోనే కనిపిస్తోందని వాపోతున్నారు.

‘నామినేటెడ్‌’పై నాన్చుడేనా?

ప్రభుత్వ తీరుపై టీఆర్‌ఎస్‌ జిల్లా నేతల్లో అసహనం

పదవుల కేటాయింపుపై అధిష్ఠానం ఊగిసలాట

ఆశావహులకు తప్పని ఎదురుచూపులు

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెండోసారి అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పలువురు జిల్లా నేతలు భారీ ఆశలు పెట్టుకున్నారు. అయినా ప్రభుత్వం నామినెట్‌ పదవులపై నాన్చుడు ధోరణితోనే కనిపిస్తోందని వాపోతున్నారు. ఇదిగో.. అదిగో.. అంటూ ఊరిస్తూ వస్తున్న నామినెట్‌ పదవుల కేటాయింపుపై అధికార పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. గతేడు మార్చి నుంచి కరోనా పరిస్థితులు నెలకొన డంతో కరోనా పేరు చెప్పి అధిష్ఠానం పెద్దలు ఇన్నాళ్లు తప్పించు కున్నారు. ఇప్పటికే దసరా, దీపావళి పండుగలకు నామినెట్‌ పదవులు పక్కాగా ఉంటాయని అందరూ భావించారు. అలాగే నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలు కూడా గడిచిపోయినా.. ప్రభుత్వంనామినెట్‌ పదవులపై ఊసెత్తడమే లేదని నిరాశకు గురవుతున్నారు. దుబ్బాక, గ్రేటర్‌ ఎన్నికల తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నామినెట్‌ పదవులపై ప్రకటన చేయడంతో ఆశావహుల్లో మళ్లీ ఆశలు రేకెత్తించాయి. ఇకనైనా అధిష్ఠానం పెద్దలు మనస్సు మార్చుకొని నామినెట్‌ పదవులను కేటాయిస్తారని ఆశించినా.. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో కేటీఆర్‌ ముఖ్యమంత్రి ఎప్పుడన్న చర్చ ఊపందుకోవడంతో నామినెట్‌ పదవులపై పట్టింపే లేకుండా పోయిందంటున్నారు. అయితే అనుకున్న సమయం మించిపోతుండడంతో పదవుల కేటాయింపుపై సందిగ్ధత పరిస్థితులు నెలకొంటున్నాయి. అందరూ అనుకున్నట్లుగానే జమిలి ఎన్నికలు వస్తే ఈసారి నామినెట్‌ పదవులు ఇక ఉండవనే టాక్‌ వినిపిస్తోంది. పదవులు ఆశిస్తున్న నేతలంతా తమ అనుచరులకు సమాధానం చెప్పుకోలేక, ప్రభుత్వాన్ని ప్రశ్నించ లేక అయో మయానికి గురవుతున్నారు. ఇప్పటికే సగం సమయం మించి పోయిందని, దీంతో పదవి దక్కిన చేసేదేమి లేదంటూ లోలోన మదన పడిపోతున్నారు. గత రెండున్నరేళ్లుగా ఎదురు చూస్తున్నా.. ఇప్పటి వరకు పదవి దక్కక పోవడంతో అధికార పార్టీ నేతల ఆశలు సన్నగిల్లుతున్నాయి. పార్లమెంట్‌ ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎంపీ గేడం నగేష్‌కు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని అధికార పార్టీలో జోరుగా చర్చ జరిగింది. అయినా ఇప్పటి వరకు పార్టీ పెద్దలు స్పష్టత ఇచ్చినట్లు కనిపించడం లేదు. అలాగే డీసీసీబీ ఎన్నికల్లో చివరి వరకు ప్రయత్నాలు చేసినా.. పదవి దక్కక పోవడంతో కొంత అసంతృప్తికి లోనైనా సీనియర్‌ నాయకులు ప్రస్తుత జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డికి కార్పొరేట్‌ చైర్మన్‌ పదవి ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరో సీనియర్‌ నాయకుడు బాలూరి గోవర్ధన్‌రెడ్డికి కూడా నామినెట్‌ పదవి వస్తుందని ప్రచారం జరిగింది. అఽధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్ఠానం ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోబోతుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నిత్యం రాష్ట్ర స్థాయి నేతలతో టచ్‌లో ఉంటూ పదవుల కేటాయింపు పైననే ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు.

ఎమ్మెల్యేల మద్దతు ఎవరికి..?!

జిల్లా నేతలకు నామినెట్‌ పదవులు దక్కాలంటే ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరిగా కనిపిస్తోంది. అయితే మాజీ ఎంపీ గోడం నగేష్‌ పార్లమెంట్‌ సభ్యుడిగా ఓడిపోయిన తర్వాత పలువురు ఎమ్మెల్యేలపై అధిష్ఠానం పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. గేడం నగేష్‌ సీనియర్‌ నేత కావడంతో ఆయనకు మంత్రి కేటీఆర్‌తో పాటు కేసీఆర్‌తోను మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ చనువుతోనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి దాదాపుగా ఖరారైనట్లేనన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆదిలాబాద్‌, బోథ్‌ ఎమ్మెల్యేలు అడ్డి భోజారెడ్డిని అధిష్ఠానం పెద్దల వద్దకు తీసుకెళ్లి హామీ ఇప్పించినట్లు అధికార పార్టీలో చర్చించుకుంటున్నారు. అలాగే దాదాపుగా డీసీసీబీ చైర్మన్‌ ఖరారైన తర్వాత రాజకీయ పరిస్థితులతో పదవి చేజారి పోవడంతో నిరాశకు గురైన బాలూరి గోవర్ధన్‌రెడ్డికి రాష్ట్ర పాడి పరిశ్రమల చైర్మన్‌ లోక భూమారెడ్డి, మంత్రి అల్లోల ఆశీస్సులతో నామినెట్‌ పదవులు ఖాయమన్న వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యేలను కాదని అధిష్ఠానం పెద్దలు నిర్ణయం తీసుకునే అవకాశాలు లేవంటున్నారు. 

రాజధానికి ఉరుకులు పరుగులు

నామినెట్‌ పదవులను ఆశిస్తున్న పలువురు అధికార పార్టీ జిల్లా నేతలు తరుచుగా రాజధానికి ప్రయాణమవుతున్నారు. ప్రభుత్వంలో ఏమి జరు గుతుందోనని ఆరా తీస్తున్నారు. తాము నమ్ము కున్న అధిష్ఠానం పెద్దలకు తరుచూ టచ్‌లో ఉంటూ ఆశీస్సులు ఉండేలా జాగ్రత్త పడుతు న్నారు. ఏ చిన్న అవకాశం వచ్చిన అధిష్ఠానం పెద్దల ముందు కనిపించేలా గంటల వ్యవధిలోనే రాజధానికి ఉరుకులు పరుగులు పెడుతున్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాలను తూ.చా. తప్పకుండా పాటిస్తూ అధిష్ఠానం పెద్దల దృష్టిలో మంచి మార్కు లు పడేలా ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో ఎమ్మెల్యేలు చేపట్టే ఏ చిన్న కార్యక్రమానికైనా హాజరవుతూ ప్రజల్లో కనిపిస్తున్నారు. అయితే ప్రజాధరణను బట్టే నామినెట్‌ పదవులు వస్తాయని అధిష్ఠానం సూచించడంతో నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వివిధ కార్యక్రమా లు చేపడుతున్నారు. పదవి ఎప్పుడు వస్తుందని అనుచరులు అడి గినప్పుడల్లా అధిష్ఠానం ఆశీస్సులు, అదృష్టం కలిసి వస్తే పదవి వస్తుందని చెబుతు జారుకుంటున్నారు. అయితే పదవులపై అధిష్ఠానం పెద్దలు ఊగిసలాడడంతో నామినెట్‌ పదవులపై నేతలు కచ్చితంగా చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది.

Updated Date - 2021-02-07T05:25:19+05:30 IST