అడవుల గండా రహదారులు

ABN , First Publish Date - 2021-01-13T06:04:36+05:30 IST

జిల్లాలో దట్టమైన అడవుల గుండా మరిన్ని రహదారులను నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

అడవుల గండా రహదారులు
అటవీ ప్రాంతం గుండా నిర్మించనున్న బోథ్‌-అడెల్లి రోడ్డు ఇదే..

రవాణా సౌకర్యం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పేరిట ప్రతిపాదనలు

జిల్లాలో మొత్తం 11 రోడ్ల నిర్మాణ అనుమతులు పెండింగ్‌

బోథ్‌-అడెల్లి రోడ్డుకు స్టేజ్‌-1 అనుమతులు

అటవీ సంపదకు పొంచి ఉన్న ముప్పు

అటవీ శాఖ అధికారులపై పెరిగిపోతున్న రాజకీయ ఒత్తిళ్లు

ఆదిలాబాద్‌, జనవరి 12(ఆంధ్రజ్యోతి): జిల్లాలో దట్టమైన అడవుల గుండా మరిన్ని రహదారులను నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రవాణా సౌకర్యం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పేరిట రోడ్ల నిర్మాణానికి పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, ఐటీడీఏ శాఖలు అడ్డగోలుగా ప్రతిపాదనలు రూపొందించి అటవీశాఖపై ఒత్తిళ్లు చేస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో అడవుల విస్తీర్ణం అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. ప్రస్తుతం జిల్లాలో అడవుల విస్తీర్ణం 44 శాతంగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అడవుల గుండా రోడ్లు వేయడంతో అటవీ సంపదకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు. మారుమూల అటవీ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడితే కలప అక్రమ రవాణాతో అడవులు అంతరించిపోయే ప్రమాదం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దట్టమైన కవ్వాల్‌ అభయారణ్యం, టైగర్‌జోన్‌లోనూ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపడంపై ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే జిల్లా మీదుగా వెళ్తున్న 44వ జాతీయ రహదారిపై ప్రమాదాల బారీ న పడి ఎన్నో వన్యప్రాణుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఇటీవల గుడిహత్నూర్‌ మండలం సీతాగోందీ గ్రామ సమీపంలో చిరుతపులి రహదారి ప్రమాదంలో మృతి చెందిన సంఘటన తెలిసిందే. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయాల్సిన ప్రభుత్వమే.. అడ్డగోలు గా అడవుల గుండా దారుల నిర్మాణానికి అనుమతులు ఇచ్చేస్తూ చేతులు దులుపుకుంటుందన్న ఆరోపణలు వస్తున్నాయి. అనుమతులు ఇచ్చే సమయంలో ఎన్నో షరతులు విధిస్తున్నా.. అవి ఆచరణ సాధ్యంకాక పోవడం తో అటవీ సంపదను కోల్పోవాల్సి వస్తుంది. తాజాగా జిల్లాలోని మారుమూల గ్రామాల్లో అటవీ ప్రాంతం గుండా 11 రోడ్ల నిర్మాణ పనులకు అనుమతుల కోసం అటవీ శాఖ  ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇప్పటికే బోథ్‌-అడెల్లి రోడ్డు నిర్మాణానికి స్టేజ్‌-1 అనుమతులు వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. 

స్టేజ్‌-1 కోసం ప్రతిపాదనలు

జిల్లావ్యాప్తంగా 11 రోడ్లకు స్టేజ్‌-1 అనుమతుల కోసం అటవీ శాఖాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇందులో కొన్ని రోడ్లు పూర్తిగా టైగర్‌జోన్‌ పరిధిలోనే ఉన్నాయి. ఐదు హెక్టార్లలోపు రాష్ట్ర ప్రభు త్వం అనమతులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆపై కేంద్ర ప్రభుత్వం అ నుమతులు ఇవ్వాల్సి ఉంది. ఇందులో గణే్‌షపూర్‌, ఇంద్రవెల్లి(కె), లొద్దిగూడ, ఏంపల్లి కోలాంగూడ, బోరెగాం, కుంటాల(కె) నుంచి మథురతండా, పీఆర్‌ రోడ్డు నుంచి లచ్చంపూర్‌(బి), తుమ్మలపహాడ్‌, ఫకీర్‌నాయక్‌తండా, ధర్మసాగర్‌, ముత్నూర్‌ నుంచి ఫకీర్‌నాయక్‌తండా వరకు రోడ్డు నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు రావాల్సి ఉంది. గత కొన్నేళ్లుగా అటవీ శాఖ అభ్యంతరాలు చెబుతున్నా.. రాజకీయ నేతల ఒత్తిళ్లతో ప్రతిపాదనలు పంపించక తప్పడం లేదు. 

బోథ్‌-అడెల్లి రోడ్డుకు లైన్‌ క్లీయర్‌

ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న బోథ్‌-అడెల్లి రోడ్డు నిర్మాణం పనులకు అడ్డంకులు తొలగినట్లు తెలుస్తుంది. గత యేడాది మార్చిలో మంత్రి అల్లో ల ఇంద్రకరణ్‌ రెడ్డి ఈ రోడ్డు నిర్మాణం పనులను ప్రారంభించారు. అయి నా ప్రభుత్వపరమైన ఇబ్బందులు తలెత్తడంతో జాప్యం జరుగుతూనే ఉంది. దాదాపుగా స్టేజ్‌-1 అనుమతులు రావడంతో ఆదిలాబాద్‌ మండలంలోని అంకోలి గ్రామ సమీపంలో సర్వే నెం.92లో కంపెయిన్‌సెటరీ ఆపరేటేషన్‌ ల్యాండ్‌ కింద 22 ఎకరాల భూమిని గుర్తించి సర్వే పూర్తి చేశారు. ఇందులో మొక్కలు నాటి సంరక్షించేందుకు ప్రభుత్వం రూ.కోటీ 37లక్షల 19వేల నిధులను అటవీ శాఖకు అందించింది. అటవీ శాఖకు కేటాయించిన భూమిని రిజర్వ్‌ ఫారెస్టుగా నోటిఫై చేసేందుకు మళ్లీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీని అనంతరం స్టేజ్‌-2 అనుమతులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. అయి నా త్వరలోనే పనులు ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈరోడ్డు పూర్తిగా 5.4 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం గుండానే నిర్మించడంతో భవిష్యత్‌లో అటవీ సంపదకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

అధికారుల హడావిడి

రాజకీయ నేతల ఒత్తిళ్లతో అటవీ శాఖ అధికారులు హడావిడిగా అనుమతులు ఇచ్చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా సర్వే చేయకుండానే అభ్యంతరాలు లేవని చెప్ప డం వెనుక రాజకీయ ఒత్తిళ్లే అసలు కారణమంటున్నారు. అధికారులు రూపొందించిన క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా లు అనుమతులు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ అధికారులు సరైన నిర్ణయాలు తీసుకోనియెడల విలువైన అటవీ సంపదకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంద న్న ఆందోళన కనిపిస్తుంది. అడవుల గుండా రోడ్డు నిర్మాణం అనుమతులు ఇచ్చేముందు అన్నిరకా ల పరిస్థితులను అంచనా వేయాల్సి ఉం టుంది. ఇది వరకు ఇచ్చిన అనుమతుల కారణంగానే జిల్లాలో అడవుల విస్తీర్ణం అంతరించి పోతుందన్న వి మర్శలు ఉన్నాయి. అయితే కొన్ని సం దర్భాల్లో ప్రజల ఇబ్బందులు, రవాణా సౌకర్యాన్ని కూడా దృష్టి లో పెట్టుకొని అనుమతులు ఇచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 

ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం

: చంద్రశేఖర్‌, ఇన్‌చార్జి డీఎ్‌ఫవో, ఆదిలాబాద్‌

జిల్లా అటవీ ప్రాంతంలో నిర్మించే రోడ్ల అనుమతుల విషయమై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. జిల్లావ్యాప్తంగా 11 రోడ్ల నిర్మాణానికి అనుమతులు రావాల్సి ఉంది. నియమ నిబంధనల ప్రకారమే అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిశీలన అనంతరమే స్టేజ్‌-2 అనుమతులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బోథ్‌-అడెల్లి రోడ్డుకు స్టేజ్‌-1 అనుమతులు వచ్చాయి.

Updated Date - 2021-01-13T06:04:36+05:30 IST