అడవుల సంరక్షణ అందరి బాధ్యత

ABN , First Publish Date - 2021-10-22T05:04:36+05:30 IST

అంతరిస్తున్న అడవులను కాపాడడం అందరి బాధ్యత అని జియోట్యాగ్‌, ఫెన్సింగ్‌ చేయడం ద్వారా అడవులను కాపాడుకోవచ్చని రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శి శాంతికుమారి అన్నారు. పోడు భూముల సమస్యలు, క్షేత్ర స్థాయిలో అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల బృందం గురువారం ఉట్నూర్‌లోని పీఎంఆర్సీ భవనంలో ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, కుమ్రంభీం(ఆసిఫాబాద్‌), పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు, అటవీ, రెవెన్యూ అధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు.

అడవుల సంరక్షణ అందరి బాధ్యత
సమావేశంలో మాట్లాడుతున్న అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శి శాంతికుమారి

ఉట్నూర్‌, అక్టోబరు 21: అంతరిస్తున్న అడవులను కాపాడడం అందరి బాధ్యత అని జియోట్యాగ్‌, ఫెన్సింగ్‌ చేయడం ద్వారా అడవులను కాపాడుకోవచ్చని రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శి శాంతికుమారి అన్నారు. పోడు భూముల సమస్యలు, క్షేత్ర స్థాయిలో అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల బృందం గురువారం ఉట్నూర్‌లోని పీఎంఆర్సీ భవనంలో ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, కుమ్రంభీం(ఆసిఫాబాద్‌), పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు, అటవీ, రెవెన్యూ అధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ 23న ప్రగతి భవన్‌లో సీఎం ఆధ్వర్యంలో నిర్వహించనున్న సమీక్షకు అటవీ, రెవెన్యూ అధికారులు హాజరుకావాలన్నారు. అదేవిధంగా జిల్లాల వారిగా పెండింగ్‌ సమస్యల నివేదికలు తీసుకరావాలని అన్నారు. అటవీ హక్కుల చట్టం 2006 డిసెంబరు నాటికి పోడు సాగుచేస్తున్న గిరిజనులకు హక్కు పత్రాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అడవుల సంరక్షణ కోసం పోలీస్‌, రెవెన్యూ, అటవీశాఖ, గిరిజన సంక్షేమ శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. అయితే క్షేత్రస్థాయిలో పోడు భూముల సమస్య గతంలో కంటే పెరిగిందని, అనర్హులు కూడా పోడు వ్యవసాయం చేయడంతో పాటు అటవీ భూములను ఆధీనంలో ఉంచుకుంటున్నారని అటవీ శాఖ అధికారులు సమావేశం దృష్టికి తీసుకవచ్చారు. నిర్మల్‌ జిల్లాలో 130 ఎకరాల్లో 121 మంది అటవీ భూములను ఆక్రమించారని, వారిని అటవీ సరిహద్దు ప్రాంతానికి తరలించి ట్రంచ్‌లు ఏర్పాటు చేసి అడవులకు వెళ్లకుండా నిరోదించామని అధికారులు తెలిపారు. దీంతో పీసీసీఎఫ్‌ శోభ, గిరిజన సంక్షేమ కమిషనర్‌ క్రిష్టినా జడ్‌ చోంగ్దు, సీఎం కార్యాలయం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌, అదనపు పీసీసీఎఫ్‌ మోహన్‌చంద్రపర్గీన్‌లు జిల్లా అధికారులతో పోడుభూములు, అటవీ సంరక్షణ, హరితహారం కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో కామారెడ్డి, పెద్దపల్లి, కుమ్రం భీం, నిర్మల్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల కలెక్టర్లు జితేష్‌వి పాటిల్‌, సంగీతసత్యనారాయణ, రాహుల్‌రాజ్‌, ముషారఫ్‌, సిక్తాపట్నాయక్‌, భారతీహోలికేరి, సీఎఫ్‌ రామలింగం, కేటీఆర్‌ సీఎఫ్‌ వినోద్‌కుమార్‌, కరీంనగర్‌ సర్కిల్‌ సీఎఫ్‌ సైదులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T05:04:36+05:30 IST