నిర్లక్ష్యంతోనే అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2021-10-28T05:47:30+05:30 IST

జిల్లాలోని ఉట్నూర్‌ మద్యం డిపోలో షార్ట్‌ సర్క్యూట్‌తో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో కోట్ల విలువైన మద్యం కాలిబూడిదైంది. బుధవారం ఉదయం 8.30గంటలకు డిపో గోదాంను తెరచి చూడగా పొగ, మంటలు రావడంతో డిపోలో పనిచేసే కార్మికులు డిపో మేనేజర్‌ తొడసం ప్రభుదాస్‌ దృష్టికి తీసుకెళ్లారు.

నిర్లక్ష్యంతోనే అగ్ని ప్రమాదం

ఉట్నూర్‌ మద్యం డిపోలో కాలిబూడిదైన రూ.కోట్ల విలువైన మద్యం 

షార్ట్‌సర్క్యూటే ఘటనకు కారణమంటున్న అధికారులు

సిబ్బంది నిర్లక్ష్యమంటూ పలువురి ఆగ్రహం

మద్యం డిపోను పరిశీలించిన ఎమ్మెల్యే రేఖానాయక్‌

ఆదిలాబాద్‌, అక్టోబరు27 (ఆంధ్రజ్యోతి)/ఉట్నూర్‌: జిల్లాలోని ఉట్నూర్‌ మద్యం డిపోలో షార్ట్‌ సర్క్యూట్‌తో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో కోట్ల విలువైన మద్యం కాలిబూడిదైంది. బుధవారం ఉదయం 8.30గంటలకు డిపో గోదాంను తెరచి చూడగా పొగ, మంటలు రావడంతో డిపోలో పనిచేసే కార్మికులు డిపో మేనేజర్‌ తొడసం ప్రభుదాస్‌ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఉట్నూర్‌, జన్నారం, ఇచ్చోడ, ఆదిలాబాద్‌లలోని ఫైర్‌ ఇంజన్‌లను రప్పించి మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. అయితే నీరు అందుబాటులో లేకపోవడంతో పెర్కగూడెం వాగులో నీటిని సేకరించి అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. కాగా, సుమారుగా రూ.100 కోట్ల వరకు నష్టం జరిగి ఉంటుందని ఎక్సైజ్‌ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే డిపోలో మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు. దర్యాప్తు బృందం పరిశీలించిన అనంతరమే ప్రమాదానికి గల కారణం, నష్టాన్ని వెల్లడించే అవకాశం ఉంటుందని జిల్లా ఎక్సైజ్‌ శాఖ సూపరింటెండెంట్‌ రవీందర్‌రాజు పేర్కొన్నారు. అయితే ఈ ప్రమాదంతో ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాకు మద్యం సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. నిత్యం ఈ డిపో నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారుగా రూ.3కోట్ల మద్యాన్ని సరఫరా చేస్తుంటారు. అయితే పురాతన గోదాంలు కావడం, కొన్నేళ్లుగా విద్యుత్‌ మరమ్మతులు చేపట్టక పోవడంతోనే షార్ట్‌ సర్క్యూట్‌ సంభవించి ఉంటుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి విచారణ అనంతరమే వాస్తవ పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని జిల్లా సూపరింటెండెంట్‌ రవీందర్‌రాజు తెలిపారు.

నిర్లక్ష్యంతోనే ప్రమాదం..!

ఉట్నూర్‌ ఐఎంఎల్‌డిపో గిడ్డంగులు ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో వారుణివాహిని ప్రవేశ పెట్టిన రోజుల్లో నిర్మించారు. రెండు దశాబ్దాల క్రితం కూడా మరో గిడ్డంగిని నిర్మించారు. ఉమ్మడి జిల్లాలోని మూడు జిల్లాలకు మద్యం  సరఫరా కోసం   ప్రతిరోజూ పెద్ద ఎత్తున సరుకు నిల్వ ఉంచడం జరుగుతున్నా.. అధికారులు కావాల్సిన చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. కార్మికులతో పాటు మరికొందరు కరెంట్‌ తీగలు సరిగా లేవని పేర్కొన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తున్నారు.

బాధ్యులు ఎవరు?

ఐఎంఎల్‌ డిపోలో సంభవించిన అగ్ని ప్రమాదానికి కారణం ఎవరని పలువురు ప్రశ్నిస్తున్నారు. అందులో పనిచేసే సిబ్బంది హస్తం ఉండి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ అగ్ని ప్రమాదాలు సంభవించక పోగా ఉన్నట్టుండి ఇప్పుడే భారీ అగ్ని ప్రమాదం ఎలా సంభవించిందని అనుమానిస్తున్నారు. కోట్ల రూపాయల నష్టానికి కారణమైన వారిని గుర్తించాల్సిన బాధ్యత ఉన్నతాధికారులదేనని అంటున్నారు.

డిపోను సందర్శించిన ఎమ్మెల్యే, ఉన్నతాధికారులు..

ఉట్నూర్‌ పర్యటనకు వచ్చిన ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ ఐఎంఎల్‌ డిపోను సందర్శించి అగ్ని ప్రమాదానికి కారణాలను తెలుసుకున్నారు. ఐఎంఎల్‌ డిపో త్వరలోనే పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉట్నూర్‌ జడ్పీటీసీ చారులత రాథోడ్‌, 

ఆర్డీవో జాడీ రాజేశ్వర్‌, తహసీల్దార్‌ సతీష్‌, ఏఎస్పీ హర్షవర్ధన్‌, సీఐ సైదారావు, ఎస్సై సుబ్బారావుతో పాటు ఆదిలాబాద్‌ నుంచి  జిల్లా ఎక్సైజ్‌ అధికారి రవీందర్‌రాజు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బుక్యా కేశవ్‌లు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎక్సైజ్‌ అధికారి మాట్లాడుతూ ఉట్నూర్‌ డిపోలో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల భవనాలకు, మద్యానికి భారీ నష్టం జరిగిందని, మద్యం నష్టం విలువలు వేయాల్సి ఉంటుందని  అన్నారు.  ఇన్‌చార్జి డీఎం ప్రభుదాస్‌ మాట్లాడుతూ వంద కోట్లకు పైగా నష్టం జరిగిందని వివరించారు. ఉట్నూర్‌, ఆదిలాబాద్‌, ఇచ్చోడ, ఆసిపాబాద్‌, కాగజ్‌నగర్‌ సర్కిల్‌లలోని మద్యం షాపులకు మంచిర్యాల డిపో నుంచి,  బైంసా, నిర్మల్‌, ఖానాపూర్‌, కడెం ప్రాంతాలకు నిజామాబాద్‌ డిపో నుంచి మద్యం సరఫరా చేస్తామని తెలిపారు.

Updated Date - 2021-10-28T05:47:30+05:30 IST