భ్రూణ హత్యలు!
ABN , First Publish Date - 2021-08-17T05:54:11+05:30 IST
గర్భంలో ఆడపుట్టుక ప్రాణం పోసుకుందని తెలిస్తే..
జిల్లాలో యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు
స్కానింగ్ సెంటర్ నిర్వాహకుల ఇష్టారాజ్యం
గుట్టుచప్పుడుకాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో దందా
తేలికగా తీసుకుంటున్న వైద్య ఆరోగ్య శాఖ
ఆదిలాబాద్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): గర్భంలో ఆడపుట్టుక ప్రాణం పోసుకుందని తెలిస్తే చాలు అంతలోనే అంతమొందిస్తున్నారు. ఇలా జిల్లాలో ఏటా భ్రూణహత్యలు పెరిగిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. అసలే అంతంత మాత్రంగా అక్షరాస్యత ఉన్న జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం వెయ్యి మంది పురుషులకు గాను 934 మంది స్ర్తీలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఆడపిల్ల అంటేనే సమాజంలో అదోరకమైన భావన ఉండడంతో స్ర్తీల లింగ నిష్పత్తి తగ్గిపోవడానికి అసలు కారణంగా చెప్పవచ్చు. 1994 భ్రూణహత్యల నివారణ చట్టం ప్రకారం భ్రూణహత్యలకు పాల్పడిన లేక ప్రోత్సహించిన చట్టరీత్యా శిక్షార్హులు. కానీ అధికార యంత్రాంగం అలసత్వంతో చట్టాలు అమలుకు నోచుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం జిల్లాలో ఎక్కడో ఓ చోట గుట్టుచప్పుడు కాకుండా భ్రూణహత్యలు జరిగిపోతున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం తేలికగానే తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న ప్రసవాలపై అధికారుల వద్ద ఉన్న గణాంకాలు వాస్తవ దూరంగానే ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు క్షేత్ర స్థాయిలో ప్రసవాల సం ఖ్యను తెలుసుకునేందుకు అంతగా ఆసక్తి చూపించక పోవడంతో ప్రైవేట్ వైద్యులు చెప్పిందే లెక్కాగా మారుతోంది. ఏదో నామమాత్రంగా వివరాలను సేకరిస్తూ ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నారనే విమర్శలు లేక పోలేదు. వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకోవడం లేదని తెలుస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రులపై ప్రత్యేక నిఘాను సారిస్తే భ్రూణహత్యలకు అడ్డుకట్ట పడే అవకాశాలు ఉన్నాయి.
స్కానింగ్ పేరిట దోపిడీ..
గర్భంలోని శిశువు ఏదైనా ప్రమాదం పొంచి ఉందనుకున్నప్పుడే తప్పని సరి పరిస్థితుల్లో స్కానింగ్ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కానీ కొందరు వైద్యులు చిన్న చిన్న సమస్యలకు సైతం స్కానింగ్ పరీక్షలు చేయడం తప్పని సరిగా చేస్తున్నారు. దీంతో గర్భంలో పెరిగే శిశువు ఆడ, మగ అని అప్పుడే తెలిసి పోవడంతో భ్రూణహత్యలకు దారి తీస్తోంది. ఒక్కో స్కానింగ్ పరీక్షలకు నిర్వాహకులు రూ.2వేల నుంచి రూ.3500 వరకు దండుకుంటున్నారు. ముఖ్యంగా కొన్ని స్కానింగ్ సెంటర్లు ఎలాంటి అనుమతులు లేకుండానే వైద్యుల సహకారాలతో విచ్చలవిడిగా భ్రూణహత్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కొందరు సీనియర్ వైద్యులు భ్రూణహత్యలను చేయడంలో ఆరితేరినట్లు చర్చించుకుంటున్నారు. ఈ వ్యవహారంలో సంబంధిత వైద్యులకు కూడా కమీషన్లు ఉండడంతో స్కానింగ్ సెంటర్ యజమానులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. నిబంధనలకు విరుద్ధంగా లింగా నిర్ధారణ పరీక్షలు చేస్తున్న స్కానింగ్ సెంటర్ యజమానులు భృణహత్యలకు పరోక్షంగా కారకులవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రైవేట్ ఆసుపత్రుల ఇష్టారాజ్యం..
గర్భిణుల అవసరాన్ని అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా భ్రూణహత్యల దందాకు తెరలేపుతున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రసూతి ఆసుపత్రులు ఇదే పనిగా పెట్టుకుని కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. పట్టణంలోని టీఎన్జీఓస్ రోడ్డులో ఉన్న ఓ ఆసుపత్రితో పాటు రైల్వేగేటు, మరికొన్ని ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రుల్లో ఇలాంటి సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్తువెత్తుతున్నాయి. ఒక్కో అబార్షన్ కేసుకు రూ.20వేల నుంచి రూ.25వేల వరకు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. గర్భంలోని పిండం వయస్సును బట్టి మరి రేటును పెంచుతూ వసూళ్లకు పాల్పడుతున్నారు. వైద్యులను ఆశ్రయించిన బాధితులను భయబ్రాంతులకు గురి చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. ఈ విషయం ఎక్కడా బయటకు పొక్కనివ్వకుండా ముం దస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ఎక్కువగా ఇలాంటి సంఘటనలే చోటు చేసుకుంటున్నాయి. స్థానిక ఆర్‌ఎంపీలు ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వైద్యం పేరిట కాసులు దండుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని పలువురు వైద్యులను సంప్రదిస్తూ బాధితులను బురిడి కొట్టిస్తున్నారు.
నామమాత్రంగా కమిటీల పనితీరు..
భ్రూణహత్యను రూపుమాపేందుకు పలు శాఖల సమన్వయంతో ప్రత్యేక కమిటీలుగా ఏర్పాడి పని చేయాల్సి ఉంటుంది. కానీ వాటి పనితీరు నామమాత్రంగానే కనిపిస్తోంది. దీంతో తరచూ సంఘటనలు పునరావృతమవుతునే ఉన్నాయి. ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు శాఖ, రెవెన్యూ శాఖల అధికారులు జిల్లా వైద్యాధికారి ఆధ్వర్యంలో తరచూ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లను పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. కానీ క్షేత్ర స్థాయిలో ఎలాంటి పర్యవేక్షణ లేక పోవడంతో ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు చేసిన స్కానింగ్ సెంటర్లపై కొరడ ఝలిపించి సీజ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క స్కానింగ్ సెంటర్‌పై అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.