ఎదురుచూపులు

ABN , First Publish Date - 2021-10-30T04:56:42+05:30 IST

ప్రభుత్వం జారీ చేసే డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన రిజిస్ర్టేషన్‌ కార్డుల కోసం వాహనదారులకు ఎదురు చూపులు తప్పడం లేదు. జిల్లా రవాణా శాఖలో స్మార్ట్‌కార్డుల కొరత ఏర్పడడంతో నెలల తరబడి పూర్తిస్థాయి సేవలు అందడం లేదు. దసరా పండుగకు వివిధ రకాల కంపెనీలు ఆఫర్లను ప్రకటించడంతో భారీగా ద్విచక్ర వాహనాలు, ఫోర్‌విల్‌ వాహనాలను కొనుగోలు చేశారు. దీంతో పక్షం రోజులుగా రిజిస్ర్టేషన్ల సంఖ్య మరింత పెరుగుతోంది.

ఎదురుచూపులు

జిల్లా రవాణా శాఖలో స్మార్ట్‌కార్డుల కొరత

నెలల తరబడి నిలిచిపోయిన సేవలు

రిజిస్ట్రేషన్‌ పేరిట ఫైన్లతో బాదుతున్న పోలీసులు

అధికారుల చుట్టూ తిరుగుతున్న వాహనదారులు

ఆదిలాబాద్‌, అక్టోబరు29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం జారీ చేసే డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన రిజిస్ర్టేషన్‌ కార్డుల కోసం వాహనదారులకు ఎదురు చూపులు తప్పడం లేదు. జిల్లా రవాణా శాఖలో స్మార్ట్‌కార్డుల కొరత ఏర్పడడంతో నెలల తరబడి పూర్తిస్థాయి సేవలు అందడం లేదు. దసరా పండుగకు వివిధ రకాల కంపెనీలు ఆఫర్లను ప్రకటించడంతో భారీగా ద్విచక్ర వాహనాలు, ఫోర్‌విల్‌ వాహనాలను కొనుగోలు చేశారు. దీంతో పక్షం రోజులుగా రిజిస్ర్టేషన్ల సంఖ్య మరింత పెరుగుతోంది. మళ్లీ దీపావళి పండుగ దగ్గర పడడంతో మార్కెట్‌లోకి మరిన్ని కొత్త వాహనాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కానీ రవాణా శాఖ అవసరమైన ఏర్పాట్లను చేసుకున్నట్లు కనిపించడం లేదు. సెప్టెంబరు 1 నుంచి అక్టోబరు 29 వరకు జిల్లా వ్యాప్తంగా 3వేల 19 రిజిస్ర్టేషన్‌ స్మార్ట్‌కార్డులు నిలిచి పోయినట్లు అధికారులు చెబుతున్నా ఈ సంఖ్య రెండింతలుగా ఉంటుందని తెలుస్తోంది. గత కొన్ని నెలల క్రితం వాహన రిజిస్ర్టేషన్‌ చేసుకున్న వారికే స్మార్ట్‌కార్డులు జారీ కాకపోవడంతో ప్రస్తుతం కొత్తగా రిజిస్ర్టేషన్‌ చేసుకున్న వారికి మరెంత కాలం పడుతుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్మార్ట్‌కార్డుల కొరత కారణంగా కొందరు రిజిస్ర్టేషన్లను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి సరఫరా లేక పోవడంతోనే స్మార్ట్‌కార్డుల జారీలో కొంత ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు.

తీవ్ర జాప్యం..

జిల్లాలో స్మార్ట్‌కార్డుల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా వేలమంది వాహనదారులు రిజిస్ర్టేషన్‌ చేసుకున్న వాహన రిజిస్ర్టేషన్‌, టీవో, డ్రైవింగ్‌ లైసెన్స్‌ కార్డుల జారీకి ఆలస్యమవుతోంది. జిల్లా ప్రధాన కార్యాలయంలో నిత్యం 100 నుంచి 200 వరకు రిజిస్ర్టేషన్లు జరుగుతుంటాయి. ఈ లెక్కన నెలలో 5వేల నుంచి 6వేల వరకు వాహనదారులకు స్మార్ట్‌కార్డులను జారీచేయాల్సి ఉంటుంది. కానీ తీవ్ర జాప్యం జరగడంతో నిత్యం స్మార్ట్‌కార్డుల కోసం వాహనదారులు అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇదిగో అదిగోఅంటూ అధికారులు కాలం గడుపుతున్నారే తప్ప సమస్యకు పరిష్కారం చూపడం లేదని వాపోతున్నారు. ఆర్సీ, లైసెన్స్‌ కార్డులను పోస్టాఫీసుల ద్వారా పంపుతామని చెబుతున్నా మరింత ఆలస్యమే జరుగుతోంది. అసలు కార్డు చేతికి వస్తుందా రాదా అనే అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం వాహనాన్ని కొనుగోలు చేసినా నెల రోజుల తర్వాత ఖచ్చితంగా రిజిస్ర్టేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే రిజిస్ర్టేషన్‌ చేసుకున్న ఆర్సీ కార్డులు జారీకాక పోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. 

అడుగడుగునా తనిఖీలు..

ప్రస్తుతం జిల్లాలో వాహనాల ఆర్సీ, లైసెన్స్‌కార్డులు వెంట లేకుండా బయటకు వెళ్లే పరిస్థితులు లేవు. ఎందుకంటే అడుగడుగున పోలీసుల వాహనాల తనిఖీలే కనిపిస్తున్నాయి. తనిఖీ సమయంలో వాహనాల సంబంధిత పత్రాలను చూపాలని పోలీసులు అడగడంతో దిక్కులు చూడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. వాహనం రిజిస్ర్టేషన్‌ పూర్తయినా ఆర్సీ కార్డులు చేతికందక పోవడంతో ఏమిచేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఒకవేళ రిజిస్ర్టేషన్‌ ఉందని చెప్పినా పోలీసులు వినిపించుకునే పరిస్థితులో లేరని వాహనదారులు పేర్కొంటున్నారు. ఆన్‌లైన్‌ చలాన్‌ పేరిట ఫైన్లు బాధడంతో చెల్లించలేక తప్పడం లేదు. ఆ తర్వాత జప్తు చేసిన వాహనాన్ని తీసుకెళ్లాలన్నా ఆర్సీకార్డు తప్పని సరిగా ఉండాలన్న నిబంధనలు పెడుతున్నారు. దీంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. చివరకు పోలీసుల వద్ద మంచి పలుకుబడి ఉన్న నేతల చుట్టూ తిరుగుతున్నా ఫలితం దక్కడం లేదు. అసలు నిబంధనల ప్రకారం ఆర్సీకార్డు అందక పోయినా ఆర్టీఏ ఎం-వ్యాలెట్‌ యాప్‌ ద్వారా రిజిస్ర్టేషన్‌ ఆధారాన్ని చూపే అవకాశం ఉన్నా పోలీసులు అంతగా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. రవాణా శాఖాధికారులు ప్రభుత్వ యాప్‌ సేవలపై ముమ్మర ప్రచారం చేయక పోవడంతోనే వాహనదారుల్లో అవగాహన లేక ఆన్‌లైన్‌ చలాన్‌లతో ఫైన్లు చెల్లిస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు.

ఏడాది గడుస్తున్నా స్మార్ట్‌కార్డు అందలేదు..

 సురేష్‌రెడ్డి (భాగ్యనగర్‌ కాలనీ, ఆదిలాబాద్‌)

గత ఏడాది నవంబరులో మా కూతురి పేరిట ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసి రిజిస్ర్టేషన్‌ చేయించాం. ఇప్పటి వరకు వాహనం రిజిస్ర్టేషన్‌ స్మార్ట్‌కార్డు(ఆర్సీ) అందడం లేదు. పలుమార్లు ఆర్టీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం కనిపించడం లేదు. పోస్టల్‌ అధికారులను సంప్రదించాలని సలహాలు ఇస్తున్నారు. ఏడాదిగా వాహనం రిజిస్ర్టేషన్‌కార్డు వెంటలేక పోవడంతో భయంగానే బయట తిరగాల్సి వస్తోంది.

ప్రభుత్వం నుంచే సరఫరా కావాల్సి ఉంది..

 శ్రీనివాస్‌ (ఎంవీఐ, ఆదిలాబాద్‌)

వాహన రిజిస్ర్టేషన్‌, లైసెన్సులకు సంబంధించిన స్మార్ట్‌కార్డులు ప్రభుత్వం నుంచే సరఫరా కావాల్సి ఉంది. కొద్ది రోజులుగా సరఫరా లేక పోవడంతోనే కార్డుల జారీలో జాప్యం జరుగుతోంది. త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపుతాం. కొన్ని కార్డులను జారీ చేసినా పోస్టల్‌ డిలేకారణంగా ఆలస్యమవుతున్నాయి. జిల్లాలో రెండు నెలలుగా పూర్తిగా కార్డుల జారీ నిలిచిపోయింది. రిజిస్ర్టేషన్‌ చేసుకున్న వాహనదారునికి తప్పకుండా స్మార్ట్‌కార్డులను అందిస్తాం.

Updated Date - 2021-10-30T04:56:42+05:30 IST