డయాగ్నస్టిక్ సెంటర్ల లీలలు..!
ABN , First Publish Date - 2021-10-22T03:54:04+05:30 IST
రోగి నాడి పట్టి రోగమేంటో తెలుసుకునేవారు... రోగి చెప్పిన లక్షణాలను బట్టి మందులిచ్చేవారు. అవి వాడినా ఫలితం కనిపించకపోతే పరీక్షలకు పంపేవారు. కానీ నేడు ముందు పరీక్షలు చేసిన అనంతరమే మందులు రాస్తున్నారు. కొన్ని డయాగ్నస్టిక్ సెంటర్ల నిర్వాహకులు అర్హతలేని టెక్నీషియన్లతో పరీక్షలు చేయిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

పలువురు వైద్యులతో నిర్వాహకుల కుమ్మక్కు
అవసరం లేకున్నా రకరకాల పరీక్షలు
ల్యాబ్‌ల వద్ద కనిపించని ధరల పట్టికలు
నిలువు దోపిడీకి గురవుతున్న ప్రజలు
పట్టింపులేని వైద్య, ఆరోగ్యశాఖ
రోగికి పరీక్షే..
మంచిర్యాల (ఆంధ్రజ్యోతి): రోగి నాడి పట్టి రోగమేంటో తెలుసుకునేవారు... రోగి చెప్పిన లక్షణాలను బట్టి మందులిచ్చేవారు. అవి వాడినా ఫలితం కనిపించకపోతే పరీక్షలకు పంపేవారు. కానీ నేడు ముందు పరీక్షలు చేసిన అనంతరమే మందులు రాస్తున్నారు. కొన్ని డయాగ్నస్టిక్ సెంటర్ల నిర్వాహకులు అర్హతలేని టెక్నీషియన్లతో పరీక్షలు చేయిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వైద్యులతో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 20 నుంచి 30 శాతం కమీషన్లు ఇస్తూ అడ్డగోలు ఫీజులు గుంజుతున్నారు. మరోవైపు ల్యాబ్‌ల వద్ద ధరల పట్టికలు ఏర్పాటు చేయాలనే నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి, కట్టడి చేయాల్సిన వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు.
పుట్టగొడుగుల్లా డయాగ్నస్టిక్ సెంటర్లు
జిల్లాలోని వివిధ పట్టణాల్లో రోజురోజుకూ డయాగ్నస్టిక్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. కనీస అర్హతలు లేనివారు డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా అఽధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. సిఫార్సు చేసిన డయాగ్నస్టిక్ సెంటర్‌లోనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అందుకు భిన్నంగా మరో చోట పరీక్షలు చేయించుకుంటే రిపోర్టులు సరిగ్గా లేవంటూ తిరిగి పరీక్షలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంతోపాటు బెల్లంపల్లి, లక్షెట్టిపేట, చెన్నూరు పట్టణాల్లో ఈ తరహా ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటరు కోకొల్లలుగా ఉన్నాయి.
అర్హతలేని వారితో పరీక్షలు
జిల్లాలోని అనేక డయాగ్నస్టిక్ సెంటర్లలో అర్హతలేని వారితో పరీక్షలు చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని డయాగ్నస్టిక్ సెంటర్లలో మౌలిక వసతులు లేకపోవడం వీరికి కలిసి వస్తోంది. ప్రైవేటు సెంటర్లలో కొద్దిగా అనుభవం ఉన్న టెక్నీషియన్లతోనే నిర్వాహకులు పరీక్షలు చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అర్హతలేని టెక్నీషియన్లతో పరీక్షలు చేయిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా, సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక డయాగ్నస్టిక్ సెంటర్ ఇచ్చిన రిపోర్టుకు, మరో సెంటర్ ఇచ్చే రిపోర్టుకు తేడా ఉంటోంది. జిల్లా కేంద్రంలో ఇలాంటి సంఘటనలు అనేకం బయటపడ్డా పట్టించుకునేవారు కరువయ్యారు.
అడ్డగోలుగా ఫీజులు
జిల్లాలోని డయాగ్నస్టిక్ సెంటర్లలో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. రక్తంలో కొవ్వు నిల్వల కోసం చేయించే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్‌ల విషయంలో ఇష్టం వచ్చిన రీతిలో ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. లిపిడ్ ప్రొఫైల్ టెస్టుకు రూ.500, లివర్ ప్రొఫైల్ పరీక్షకు రూ.500, థైరాయిడ్ ప్రొఫైల్‌కు రూ.500, కిడ్నీ ప్రొఫైల్ రూ.650, బ్లడ్ యూరియా రూ.150, యూరిక్ యాసిడ్ రూ.200, ఎలక్రోలైట్స్ టెస్టుకు రూ.500, టైఫాయిడ్, మలేరియా నిర్ధారణకు రూ.150, షుగర్ టెస్టు రూ.100, డెంగ్యూ నిర్ధారణకు రూ. 800 నుంచి 1200, బ్లడ్ గ్రూప్ తెలుసుకొనేందుకు రూ.100, క్యాల్షియం పరీక్షకు రూ.200, కామెర్ల పరీక్షకు రూ.200, హెచ్‌ఐవీ పరీక్షకు రూ.250, హెచ్‌బీ పరీక్ష రూ.100 వరకు వసూలు చేస్తున్నారు. ఒకే డయాగ్నస్టిక్ సెంటర్‌లో వైద్యులకు ఇచ్చే కమీషన్‌ను బట్టి వివిధ రకాల ఫీజులు వసూలు చేస్తున్నారు. డయాగ్నస్టిక్ సెంటర్ల వద్ద వివిధ పరీక్షలకు సంబంధించి ధరల పట్టికలను ఏర్పాటు చేయాల్సి ఉన్నా జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు.
తనిఖీలు నిర్వహిస్తాం
డాక్టర్ సుబ్బారాయుడు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి
డయాగ్నస్టిక్ సెంటర్లలో అర్హతలేని వారితో పరీక్షలు చేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. బాధితులు సమాచారం ఇస్తే సదరు కేంద్రంలో తనిఖీలు చేపడతాం. అన్ని అర్హతలు ఉన్నవారినే డయాగ్నస్టిక్ సెంటర్ల నిర్వాహకులు టెక్నీషియన్లుగా నియమించాలి. అక్రమాలకు పాల్పడినట్లు తేలితే డయాగ్నస్టిక్ సెంటర్లను మూసివేయిస్తాం.