ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి

ABN , First Publish Date - 2021-05-05T05:43:18+05:30 IST

మండలంలోని ప్రజలందరు వ్యాక్సిన్‌ వేయించుకొని కరోనా వైరస్‌ నుంచి రక్షణ పొందాలని జడ్పీటీసీ రాథోడ్‌ చారులత అన్నారు. మంగళవారం స్థానిక సివిల్‌ ఆసుపత్రిలో రెండో డోసు వ్యాక్సిన్‌ వేయించుకున్న సందర్భంగా మాట్లాడారు.

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి
ఉట్నూర్‌లో జరిమానా విధిస్తున్న పంచాయతీ సిబ్బంది

ఉట్నూర్‌, మే4: మండలంలోని ప్రజలందరు వ్యాక్సిన్‌ వేయించుకొని కరోనా వైరస్‌ నుంచి రక్షణ పొందాలని జడ్పీటీసీ రాథోడ్‌ చారులత అన్నారు. మంగళవారం స్థానిక సివిల్‌ ఆసుపత్రిలో రెండో డోసు వ్యాక్సిన్‌ వేయించుకున్న సందర్భంగా మాట్లాడారు. సెకండ్‌వేవ్‌ కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉందని ప్రభుత్వం వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంచినందున ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందాలన్నారు. మండలంలోని  దంతన్‌పల్లి, హస్నాపూర్‌, శ్యాంపూర్‌ పీహెచ్‌సీలతో పాటు సీహెచ్‌సీలో వ్యాక్సినేషన్‌ ఉందన్నారు. 18ఏళ్లు నిండిన వారికి సైతం త్వరలోనే వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు. ప్రజలు అత్యవసర సమయాలోనే భయటకు రావాలని ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు.

మాస్కు లేకుంటే జరిమానా..

మాస్కు లేకుండా తిరుగుతున్న వారిని గుర్తించి పంచాయతీ అధికారులు జరిమానా విధిస్తున్నారు. మంగళవారం ఉట్నూర్‌ పట్టణంలోని ప్రధాన మార్కెట్‌లో మాస్కులు ధరించని కమలేశ్‌, పర్శురాం, రామ్‌, శంకర్‌లకు రూ.900 జరిమానా విధించినట్లు పంచాయతీ కార్యదర్శి ఉప్పుల సత్యనారాయణ తెలిపారు. ఆయన వెంట పంచాయతీ సిబ్బంది ఎలమల మనోహర్‌ తదితరులున్నారు.

సోనాలలో నిలిచిన పరీక్షలు..

బోథ్‌: మండలంలోని సోనాల ఆసుపత్రిలో కరోనా కిట్లు లేక వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరగలేదు. పరీక్షల కోసం వచ్చిన వారు కిట్లు లేవని తేలడంతో వెనుదిరిగారు. అలాగే బోథ్‌ ఆసుపత్రిలో 36 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 13 మందికి వైరస్‌ సోకినట్లు డాక్టర్‌ రవీంద్రప్రసాద్‌ తెలిపారు.

ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఇష్టారాజ్యం..

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లా కేంద్రంలోని ఖుర్షీద్‌నగర్‌ ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కరోనా నిర్ధారణ టెస్టుల కోసం వెళ్లిన వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. మంగళవారం సంజయ్‌నగర్‌ వార్డు కౌన్సిలర్‌తో పాటు సుమారు 60 మంది  టెస్టుల కోసం వెళ్లగా ఆరోగ్య కేంద్రం సిబ్బంది తమ ఇష్టమున్న వారికి టోకెన్లు ఇస్తున్నారు. దీనిపై ప్రశ్నించిన వారిపై తిరగబడుతున్నారు. ఈ విషయంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని కలిసి ఫిర్యాదు చేస్తామని సంజయ్‌నగర్‌ వార్డు కౌన్సిలర్‌ బడాల సృజన్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2021-05-05T05:43:18+05:30 IST