రేషన్‌ కార్డుల కోసం ఎన్నాళ్లీ ఎదురుచూపులు

ABN , First Publish Date - 2021-05-07T04:41:47+05:30 IST

జిల్లాలో అర్హులైన పేదలకు నూతన రేషన్‌కార్డులు అందక తీవ్రంగా నష్టపోతున్నారు.

రేషన్‌ కార్డుల కోసం ఎన్నాళ్లీ ఎదురుచూపులు

- జిల్లాలో జాడలేని కొత్త రేషన్‌కార్డులు

- ఏళ్లుగా అర్హులకు అందని సంక్షేమ పథకాలు

- దరఖాస్తు చేసుకున్నా పరిశీలించని అధికారులు

- కరోనాఉధృతి సమయంలో నష్టపోతున్న నిరుపేదలు

చింతలమానేపల్లి, మే 6: జిల్లాలో అర్హులైన పేదలకు నూతన రేషన్‌కార్డులు అందక తీవ్రంగా నష్టపోతున్నారు. ఏళ్లుగా రేషన్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. మూడునెలల క్రితం నల్గొండ జిల్లాలోని హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ అర్హులైన వారికి త్వరలో రేషన్‌ కార్డులు అందజేస్తామని ప్రకటించడంతో ప్రజలు కొంత ఊరట చెందారు. కానీ ఇప్పటివరకు కొత్త రేషన్‌ కార్డుల జారీ ఊసే లేక పోవడంతో నిరుపేదల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రాష్ట్రంలో మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సమగ్రకుటుంబ సర్వేతో పాత రేషన్‌ కార్డులను రద్దు చేసింది. దీంతో లబోదిబోమన్న లబ్ధిదారులు కొత్త కార్డులు ఇప్పించాలంటూ కార్యాలయాల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇదిగో అదిగో అంటూ రేషన్‌ కార్డుల మంజూరులో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో 2017నుంచి ఇప్పటి వరకు రెండుసార్లు కొత్త కార్డుల కోసం దరఖాస్తులను తహసీల్దార్‌లు ఆయా మండలాల్లో స్వీకరించారు. అలాగే 2020మార్చి 15వరకు మరోసారి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు త్వరలోనే కొత్త కార్డులు ఇస్తామని ప్రకటించినప్పటికీ మంజూరులో జాప్యం చేస్తుండడంపట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవు తున్నాయి. 

జిల్లాలో 1,37,306 ఆహార భద్రత కార్డులు..

జిల్లాలో మొత్తం ఆహారభద్రత కార్డులు 1,37,306 ఉండగా 278రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. ఇందులో కొత్తగా 3850మంది ఆహారభద్రత కార్డుల కోసం దర ఖాస్తు చేసుకున్నారు. మ్యూటేషన్‌ కోసం 5028 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులు వచ్చినప్పటికీ జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించి రేషన్‌ కార్డుల మంజూరులో జాప్యం చేసున్నారు. దీంతో నిరుపేదలు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. ఇదే సమయంలో కరోనా వైరస్‌ ప్రబలడంతో ప్రజలు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. గతేడాది మార్చి 22న దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూ అమలు చేసి మరుసటి రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రక టించింది. రెండు నెలలుగా లాక్‌డౌన్‌ అమలులో ఉండ డంతో మధ్య తరగతి, సామాన్య ప్రజలు కార్డులు లేక ప్రభుత్వం అందించిన ఉచిత బియ్యంతో పాటు రూ.1500 అందక ఆందోళన చెందారు. జిల్లా వ్యాప్తంగా సుమారు వేలమంది కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ మంజూరు కాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మరో రెండు నెలల పాటు ఉచిత బియ్యం పంపిణీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అయితే ఈ సారి కూడా తమకు కొత్త కార్డులు రాకపోవడంతో బియ్యం రావేమోనని జిల్లాలోని నిరుపేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేయాలని కోరుతున్నారు. 

కార్డు ఉంటేనే పథకాల్లో లబ్ధి..

రేషన్‌ కార్డు కేవలం రేషన్‌ బియ్యం కోసమే కాకుండా ప్రభుత్వ సంక్షేమపథకాలు లబ్ధి పొందడానికి అవసరమ వుతుంది. కార్డు ఉంటేనే పథకాలకు అర్హులవుతారు. ఆహార భద్రత కార్డు ఉంటే ఆరోగ్యశ్రీకార్డు, ఆరోగ్యశ్రీ ఉంటే ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందుతుంది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, సీఎంఆర్‌ఎఫ్‌ వంటి సాయం పొందడానికి రేషన్‌ కార్డు అవసరమవు తోంది. అయితే రేషన్‌ కార్డు లేక అర్హులైన అనేక మంది ఆయా పథకాల్లో లబ్ధి పొందలేకపోతున్నారు. ఈ విష యమై జిల్లా పౌరసరఫరాల అధికారి స్వామికుమార్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. 

అర్హులకు రేషన్‌ కార్డులు మంజూరు చేయాలి..

- మోహన్‌, బాబాసాగర్‌

జిల్లాలోని అర్హులైన నిరుపేదలకు కొత్త రేషన్‌ కార్డు లను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలకు అర్హులవుతాం. ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేసి న్యాయం చేయాలి.

కొత్త రేషన్‌ కార్డు కోసం గతంలోనే దరఖాస్తు..

- చౌదరి శేఖర్‌, కర్జెల్లి

నేను కొత్త రేషన్‌ కార్డు కావాలని సంవత్సరం క్రితమే మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేశా. ఇప్పటి వరకు మంజూరు కాలేదు. దీంతో ప్రభుత్వ పథకాలకు దూరమ వుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కొత్త రేషన్‌ కార్డులను మంజూరు చేయాలి.

Updated Date - 2021-05-07T04:41:47+05:30 IST