టెన్షన్‌...టెన్షన్‌...

ABN , First Publish Date - 2021-12-20T03:34:02+05:30 IST

ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులను ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన విభజించేందుకు ఈ నెల 6న జీవో నంబర్‌ 317ను విడుదల చేసింది. పదోన్నతులు లేక అసంతృప్తితో ఉన్న ఉపాధ్యాయుల్లో బదిలీల జీవో తీవ్ర ఆందోళనకు గురి చేసింది. బదిలీ ప్రక్రియలో స్థానికతను పరిగణలోకి తీసుకోకుండా సీనియారిటీ ప్రాతిపదికన ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఇతర జిల్లాలకు కేటాయించే ప్రక్రియను చేపట్టింది.

టెన్షన్‌...టెన్షన్‌...

ఉద్యోగ, ఉపాఽధ్యాయ బదిలీల్లో ముగిసిన ఆప్షన్లు

ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన అభ్యంతరాల స్వీకరణ

బదిలీలపై నేడు తుది జాబితా విడుదల

బదిలీ ప్రక్రియపై నేడు సెల్‌ఫోన్‌కు సంక్షిప్త సమాచారం

మంచిర్యాల, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులను ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన విభజించేందుకు ఈ నెల 6న జీవో నంబర్‌ 317ను విడుదల చేసింది. పదోన్నతులు లేక అసంతృప్తితో ఉన్న ఉపాధ్యాయుల్లో బదిలీల జీవో తీవ్ర ఆందోళనకు గురి చేసింది. బదిలీ ప్రక్రియలో స్థానికతను పరిగణలోకి తీసుకోకుండా సీనియారిటీ ప్రాతిపదికన ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఇతర జిల్లాలకు కేటాయించే ప్రక్రియను చేపట్టింది. 2018 ఆగస్టు 30న రాష్ట్ర ప్రభుత్వం 124 జీవో విడుదల చేసి, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయని పేర్కొన్నప్పటికీ ప్రస్తుతం స్థానికతకు ప్రాధాన్యం లేకుండానే ఆప్షన్ల ప్రక్రియ ముగించింది. సీనియారిటీకి ప్రాధాన్యం ఇవ్వడంతో జూనియర్లకు తీరని నష్టం జరిగిందనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఉదాహరణకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోని మంచిర్యాల జిల్లాలో విద్యాభ్యాసం పూర్తిచేసిన స్థానికుడైన ఉపాధ్యాయుడు జూనియర్‌ పేరుతో కొమరంభీం జిల్లాలో, ఆదిలాబాద్‌ జిల్లాకో శాశ్వతంగా వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 

సొంత జిల్లా ఆశలు గల్లంతు

రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలను విభజించి కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాలు ఉండగా వాటి సంఖ్యను 33 జిల్లాలకు పెంచింది. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇక తమ సొంత జిల్లాల్లోనే ఉద్యోగాలు చేసుకోవచ్చుననే తరుణంలో వారి ఆశలను అడియాసలు చేస్తూ ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన బదిలీలు చేపట్టింది. ఈ ప్రక్రియను ఉద్యోగ, ఉపాధ్యాయులు జీర్ణించుకోలేక పోతున్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు పెండింగ్‌లో ఉండగా చొరవ చూపని ప్రభుత్వం ఉద్యోగుల విభజన మాత్రం హడావుడిగా చేపట్టడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో సీనియారిటీ జాబితాలు పూర్తికాకముందే ఉపాధ్యాయుల నుంచి ఆప్షన్లు తీసుకోవడం, బదిలీల జాబితాలో నెలకొన్న తప్పుల సవరణ పూర్తికాక ముందే ఆప్షన్ల ప్రక్రియను ముగించడంతో విమర్శలు వస్తున్నాయి. దీంతో సీనియారిటీ జాబితాలో తన పేరు ఏ నెంబరులో ఉందో, తనకంటే ముందు, వెనుక ఎంత మంది ఉన్నారో తెలియక ముందే ఉమ్మడి జిల్లా పరిధిలో కొత్తగా ఏర్పడిన జిల్లాల ప్రకారం ఆప్షన్లు ఇవ్వాల్సి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

నేడు ఉద్యోగుల సెల్‌ఫోన్లకు సమాచారం

బదిలీల విషయమై తొలుత ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ప్రభుత్వం జీవో నెంబర్‌ 317 ప్రకారం ఈ ప్రక్రియ ప్రారంభమైన తరువాత మొక్కుబడిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉపాధ్యాయులతో ఈ నెల 13న చర్చలు జరిపి ప్రతిపాదనలు తీసుకున్నారు. స్వీకరించిన ప్రతిపాదనల్లో ఎన్ని అమలు చేస్తున్నారో స్పష్టత లేకపోవడం, ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీలు గందరగోళంగా మారడంతో ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. దీనికి తోడు ఇప్పటికే ఈ విషయమై అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ పూర్తికాగా సోమవారం డైరెక్టుగా ఏ జిల్లాలకు బదిలీ అయ్యారనే విషయం మొబైల్‌కు మెసేజ్‌ వస్తుందని తెలుస్తోంది. తాము పుట్టి పెరిగిన జిల్లాలో కాకుండా అలాట్‌ చేయబడే జిల్లాలో శాశ్వతంగా స్థానికులుగా మారడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. జిల్లాలో 33 ప్రభుత్వ శాఖలకు సంబంధించి మొత్తం 4,500 పైచిలుకు ఉద్యోగ, ఉపాధ్యాయులు పని చేస్తుండగా, వారిలో ఎక్కువసంఖ్యలో ఉపాధ్యాయులే ఉన్నారు. జిల్లాలో 2,840 ఉపాధ్యాయ పోస్టులు మంజూరుకాగా ప్రస్తుతం 2500 మంది పని చేస్తున్నారు. ఇదిలా ఉండగా వేర్వేరు జిల్లాల్లో పని చేస్తున్న భార్యభర్తలను ఒకే చోటుకి, అంతర్‌జిల్లా, సాధారణ బదిలీలు, పదోన్నతుల కౌన్సెలింగ్‌ వంటి హామీలు సంవత్సరాలు గడుస్తున్నా నెరవేరకపోవడం గమనార్హం. 

జూనియర్లకు న్యాయం జరిగేలా చూడాలి

తపస్‌ రాష్ట్ర అదనపు కార్యదర్శి బండి రమేష్‌

ఉద్యోగ, ఉపాధ్యాయుల విభజన ప్రక్రియలో జూనియర్లకు తగిన న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం హడావుడిగా ఈ ప్రక్రియను ముగిస్తుండటం బాధాకరం. ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపినప్పటికీ స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వలేదు. తుది జాబితా పూర్తిగాక ముందే ఉపాధ్యాయుల నుంచి ఆప్షన్లు తీసుకున్నారు. స్థానికులై ఉండి  ఇతర జిల్లాలకు కేటాయించే ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి సొంత జిల్లాలకు రావడానికి అవకాశం ఇవ్వాలి. భార్యభర్తలు ఒకే చోట పనిచేసేలా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.

Updated Date - 2021-12-20T03:34:02+05:30 IST