డేంజర్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు

ABN , First Publish Date - 2021-08-22T05:20:02+05:30 IST

ఇటీవల కురిసిన భారీవర్షాల వరదతో నీట మునిగిపోయిన స్థానిక జీఎన్‌ఆర్‌ కాలనీ సంఘటన అధికార యంత్రాంగం పూర్తిగా విస్మరిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

డేంజర్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు
నిర్మల్‌లోని సిద్దాపూర్‌ వాగు సమీపంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళు

ముంపు ప్రాంతంలో 600 ఇళ్ల నిర్మాణాలు 

సిద్దాపూర్‌ వద్ద చురుకుగా కొనసాగుతున్న పనులు 

ఇటీవల వరదకు మునిగిన ఇళ్ల పునాదులు 

పొంచి ఉన్న హైటెన్షన్‌ టవర్‌ ముప్పు 

స్థానికుల అభ్యంతరాలపై స్పందించని పాలకులు 

నిర్మల్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి)  : ఇటీవల కురిసిన భారీవర్షాల వరదతో నీట మునిగిపోయిన స్థానిక జీఎన్‌ఆర్‌ కాలనీ సంఘటన అధికార యంత్రాంగం పూర్తిగా విస్మరిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు లేఅవుట్‌ అనుమతులు లేకుండా అడ్డగోలుగా జీఎన్‌ఆర్‌ కాలనీని నిర్మించారన్న ఆరోపణల నేపథ్యంలోనే సాక్ష్యాత్తు ప్రభుత్వమే సిద్దాపూర్‌వాగు పక్కన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను నిర్మిస్తుండడంపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా యి. సిద్దాపూర్‌వాగుకు ఇటువైపు నీట మునిగిన జీఎన్‌ఆర్‌ కాలనీకి ఆనుకునే నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముంపు ముప్పు పొంచి ఉన్న ఈ ప్రాంతంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను చేపట్టడం అనాలోచిత చర్యనే అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పూర్తిగా సుద్దవాగు పరివాహకంలో ఈ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మిస్తున్న కారణంగా ఎప్పుడైనా ప్రమాదం పొంచి ఉంటుందంటున్నారు. అధికారులు ఈ ప్రాంతంలో సుమారు రూ.33 కోట్ల వ్యయంతో 600 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించ తలపెట్టారు. ఇప్పటికే ఈ ఇళ్లకు సంబంధించిన పునాదులు, పిల్లర్లకు  సంబందించి పనులు కూడా పూర్తయ్యాయి. అయితే ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యం లో చేపట్టిన ఇక్కడి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు భవిష్యత్‌లో ముంపు బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు. కొద్దిరోజుల క్రితం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఈ డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అయితే ప్రస్తుతం ఈ స్థలంలో కేవలం 408 ఇళ్లకే స్థలం సరిపోతుందని మరో 200 ఇళ్లను మరో చోట నిర్మించాల్సిన పరిస్థితి నెలకొందంటున్నారు. కాగా సిద్దాపూర్‌వాగు పక్కనే నిర్మిస్తున్న ఈ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు అటువాగుకు సంబంధించిన వరదనీటితో పాటు ఇటు హై టెన్షన్‌ విద్యుత్‌ స్తంభాలు ఉండడంతో ఈ ప్రాంతం జనం నివసించేందుకు అనుకూలం కాదంటున్నారు. మొన్నటి మాదిరిగా సిద్దాపూర్‌ వాగు వరదల కారణంగా పొంగి పొర్లితే జీఎన్‌ఆర్‌ కాలనీ మాదిరిగానే ఈ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లన్నీ నీట మునిగిపోవడం ఖాయమంటున్నారు. అ యితే దీనిపై అధికారులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. వరద ఎప్పుడో ఓసారి మాత్రమే వస్తుందని, దానిని దృష్టిలో పెట్టుకొని డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను నిలిపి వేయడం సమంజసం కాదంటు న్నారు. అయినా గాని ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకుపోతామని సంబంధిత ఆర్‌ అండ్‌ బీ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. 

సిద్దాపూర్‌ వాగు పరీవాహకంలోనే

జీఎన్‌ఆర్‌ కాలనీకి అటువైపు వాగు పరీవాహకంలోనే ప్రస్తుతం నిర్మిస్తున్న 600 డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తి ప్రమాదపుటంఛులో ఉండబోతున్నాయంటున్నారు. ఇటీవలే వాగుకు ఆనుకొని ఉన్న జీఎన్‌ ఆర్‌ కాలనీ సంఘటనను సంబంధిత అధికారులు పరిగణలోకి తీసుకోకపోవడం చర్చకు తావిస్తోంది. అధికారులు భవిష్యత్‌ పరిణామాలను పరిగణలోకి తీసుకోకుండా అందుబాటులో ఉన్న స్థలానికి ప్రాధాన్యతనిచ్చి ఈ డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను చేపడుతుండడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ముంపు ప్రమాదాన్ని పక్కన పెట్టి టార్గెట్‌ను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారంటున్నారు. క్షేత్రస్థాయిలో లోటుపాట్లను అలాగే భౌతిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా చేపడుతున్న ఈ డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలపై స్థానికులు సైతం వ్యతిరేకిస్తున్నారు. అధికారులు కొనసాగిస్తున్న ఈ పనులను ఇప్పటి వరకు నాణ్యత నియంత్రణ సంబంధించిన అధికారులు పర్యవేక్షించకపోవడం అలాగే ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయక పోవడం గమనార్హం. 

గందరగోళంగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల వ్యవహారం

కాగా జిల్లాలో చేపడుతున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల వ్యవహారం అంతా గందరగోళంగా మారిందన్న విమర్శలున్నాయి. కేవలం ఎల్లపెల్లి గ్రామంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను మాత్రమే లబ్దిదారులకు పంపిణీ చేయగా రత్నాపూర్‌ కాండ్లి, బంగల్‌పేట్‌ మహాలక్ష్మి వాడ తదితర చోట్ల నిర్మించిన వందలాది డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ఇప్పటి వరకు పేదలకు పంపిణీ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. కొద్దిరోజుల క్రితం అర్హులైన పేదల నుంచి ఈ డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించినప్పటికి అర్హులైన వారిని మాత్రం ఇప్పటి వరకు ఎంపిక చేయలేదు. దాదాపు రెండేళ్ల క్రితం నిర్మించిన ఈ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు క్రమంగా శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. కొత్త ఇళ్ళ సంగతి దేవుడేరుగు గాని నిర్మించిన ఇళ్లను లబ్దిదారులకు పంపిణీ చేస్తే కొంత మేరకైనా ఇళ్ళు లేని పేదలకు ఆవాసం కల్పించినట్లవుతుందంటున్నారు. 


Updated Date - 2021-08-22T05:20:02+05:30 IST