డబుల్‌ కిరికిరి

ABN , First Publish Date - 2021-10-20T05:17:02+05:30 IST

జిల్లాలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పథకానికి అడుగడుగునా రాజకీయ ఆటంకాలు ఎదురవుతున్నాయన్న వాదనలున్నాయి.

డబుల్‌ కిరికిరి
భైంసా సమీపంలో పూర్తయిన డబుల్‌ బెడ్‌రూంలో ఇళ్లు

నిర్మాణం పూర్తయినా మొదలుకాని పంపిణీ 

ఇప్పటికీ పూర్తికాని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ 

అడుగడుగునా రాజకీయ ఆటంకాలు 

నిర్మల్‌, ముథోల్‌ సెగ్మెంట్‌లో స్థానిక నేతల ఒత్తిడి  

నిర్మల్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పథకానికి అడుగడుగునా రాజకీయ ఆటంకాలు ఎదురవుతున్నాయన్న వాదనలున్నాయి. జిల్లా కేంద్రమైన నిర్మల్‌లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పథకంపై అధికార పార్టీ నేతలు పెద్దఎత్తున ఒత్తిళ్లు కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకం ప్రారంభించి దాదాపు ఐదేళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు 10 శాతం ఇళ్లను కూడా లబ్దిదారులకు పంపిణీ చేయలేదు. నిర్మల్‌, ముథోల్‌ నియోజకవర్గాల్లోని కొంతమంది స్థానిక అధికారపార్టీ నేతలు అడుగడుగునా అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి ఆ ఇళ్లను తమ అనుచరులకే కేటాయించే విధంగా చేస్తున్నారంటున్నారు. మరికొన్ని గ్రామాల్లో ఎంపికైన లబ్దిదారుల నుంచి డబ్బులు కూడా వసూలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇటీవల నిర్మల్‌ మండలంలోని ఓ గ్రామంలోనూ, సోన్‌ మండలంలోని మరో గ్రామంతో పాటు ముథోల్‌ నియోజకవర్గంలో జరుగుతున్న అవకతవకలపై ఎంపికైన లబ్దిదారులే గాకుండా అక్కడి గ్రామస్థులు సైతం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. వీరంతా ఏకంగా జిల్లా కలెక్టర్‌కు సైతం అవినీతి అక్రమాలపై ఫిర్యాదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. కాగా జిల్లాకు మొత్తం 6680 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో నుంచి 6582 ఇండ్లకు పరిపాలన పరమైన అనుమతి లభించింది. కాగా మొత్తం 4808 ఇళ్ల నిర్మాణాలకు సంబంధిత యంత్రాంగం టెండర్ల ప్రక్రియను పూర్తి చేయగా ఇప్పటి వరకు 2349 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. మొదటి నుంచి ఈ డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు అనేక రకాల పరిపాలన పరమైన ఆటంకాలతో పాటు క్షేత్రస్థాయి పరిస్థితులు, నిర్మాణ సామాగ్రి వ్యయం పెరగడం లాంటి అవరోధాలు ఏర్పడ్డాయి. దీంతో ఇళ్ల నిర్మాణాల వ్యవహారంలో తీవ్రజాప్యం ఏర్పడింది. కాగా 2029 ఇళ్ల నిర్మాణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు కేవలం 165 ఇళ్లను మాత్రమే లబ్దిదారులకు పంపిణీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. మొత్తం ఇళ్ల నిర్మాణాల కోసం ఇప్పటి వరకు 130.26 కోట్లను ఖర్చు చేశారు. కొన్ని చోట్ల స్థానిక నాయకులు లబ్దిదారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసిన వ్యవహారాలు వెలుగులోకి వస్తుండడం పంపిణీపై ప్రభావం చూపుతోంది. అయితే స్థానిక నేతల ఒత్తిళ్లు, అడుగడుగునా పైరవీల కారణంగా సంబంధిత ప్రజా ప్రతినిధులు ఈ డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పేరేత్తితేనే జడుసుకుంటున్నారు. ఇలా రాజకీయఒత్తిళ్లతో పాటు అనేక రకాల కారణాలతో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను కూడా పూర్తి చేయలేదు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం వేలాది మంది అర్హులైన నిరుపేదలు ఎదురుచూస్తున్న క్రమంలో కొద్దిరోజుల క్రితం నిర్మల్‌ పట్టణంలో మాత్రం దరఖాస్తులు స్వీకరించారు. పంపిణీ చేయాల్సిన ఇళ్లకన్నా దరఖాస్తులు నాలుగింతలు ఎక్కువగా రావడంతో అదికారులు లబ్దిదారుల ఎంపిక వ్యవహారాన్ని తాత్కలికంగా పక్కన పెట్టారు. అలాగే మరికొన్ని నియోజకవర్గాల్లో లబ్దిదారుల ఎంపిక వ్యవహారం రాజకీయంగా తమకు వ్యతిరేక ప్రభావం చూపవచ్చన్న భావనతో జాప్యం చేస్తున్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

స్థానిక నేతల చేతివాటంతో ఇక్కట్లు

కాగా కొన్నిగ్రామాల్లో అధికార పార్టీకి చెందిన స్థానిక నేతలు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లపై గురి పెట్టారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిర్మల్‌ పట్టణానికి సమీపంలో ఉన్న ఓ గ్రామంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ వ్యవహారం తీవ్రదుమారం రేపుతోంది. ఆ గ్రామంలోని ఇండ్లను అర్హులైన వారికి పంపిణీ చేసినప్పటికి సదరు ప్రజా ప్రతినిధి లబ్దిదారుల నుంచి సీఎం కేసీఆర్‌, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఫొటోల పేరిటా బలవంతంగా డబ్బులు వసూలు చేసిన వ్యవహారం వివాదాస్పదమయ్యింది. సదరు స్థానికనేత తీరుపై లబ్దిదారులే కాకుండా గ్రామస్థులు సైతం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఫిర్యాదు చేయ డం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఈ ఫిర్యాదు మేరకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్థానిక నేతపై సీరియస్‌ అవ్వడమే కాకుండా అవకతవకలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకునేందుకు వెనకాడేది లేదంటూ హెచ్చరించడం గమనార్హం. అయినప్పటికీ మరికొంతమంది స్థానిక నేతలు సంబంధిత అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఇప్పటి పూర్తయిన ఇళ్లు 2349 మాత్రమే

కాగా జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు గానూ 4808 డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు టెండర్‌ ప్రక్రియను పూర్తి చేశారు. కాని ఇప్పటి వరకు కేవలం 2349 ఇండ్ల నిర్మాణాలను మాత్రమే పూర్తి చేశారు. ఈ పథకం ప్రారంభించి యేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు 60శాతం ఇళ్ల నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. మరో 2029 ఇళ్ల నిర్మాణాలు పూర్తికావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఇళ్ల నిర్మాణాల పనులు నత్తనడకను తలపిస్తూ కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు కేవలం పూర్తయిన ఇళ్ల నుంచి 165 ఇండ్లను మాత్రమే పంపిణీ చేశారు. ఈ పంపిణీ వ్యవహారంలో కూడా పలు ఆరోపణలు తలెత్తుతున్నాయి. కాగా పూర్తయిన ఇళ్లతో పాటు ప్రస్తుతం నిర్మాణాలు కొనసాగుతున్న ఇళ్లను ఎప్పటిలోగా అర్హులైన పేదలకు పంపిణీ చేస్తారన్న అంశంపై స్పష్టత కనిపించడం లేదు. యేళ్ళ నుంచి కొనసాగుతున్న ఈ పథకంపై క్రమక్రమంగా అర్హులైన పేదలు సైతం ఆశలు వదులుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


Updated Date - 2021-10-20T05:17:02+05:30 IST