డివిజన్‌ కార్యాలయాన్ని తెరిపించరూ!

ABN , First Publish Date - 2021-02-07T05:28:12+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలుల్లోకి తెచ్చిన జలవనరుల శాఖను జిల్లా కేంద్రానికే పరిమితం చేస్తున్న అధికారులు.. పాత డివిజన్‌ కార్యాలయాన్ని తెరిపించడంలో విఫలం అవుతున్నారని ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులు వాపోతున్నారు.

డివిజన్‌ కార్యాలయాన్ని తెరిపించరూ!
ఇదే ఉట్నూర్‌లో మూతపడ్డ ఇరిగేషన్‌ కార్యాలయం

ఉట్నూర్‌లో మూతపడ్డ మైనర్‌ ఇరిగేషన్‌ శాఖ కార్యాలయం 

ఇటీవల జిల్లా కేంద్రానికి మరో రెండింటిని పరిమితం చేస్తూ జీవో జారీ

ఉట్నూర్‌, ఫిబ్రవరి 6: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలుల్లోకి తెచ్చిన జలవనరుల శాఖను జిల్లా కేంద్రానికే పరిమితం చేస్తున్న అధికారులు.. పాత డివిజన్‌ కార్యాలయాన్ని తెరిపించడంలో విఫలం అవుతున్నారని ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులు వాపోతున్నారు. మూడు దశాబ్దాల క్రితం ఉట్నూర్‌ ఐటీడీఏ ఆధ్వర్యంలో మైనర్‌ ఇరిగేషన్‌ శాఖ డివిజన్‌ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఐటీడీఏ పరిధిలోని ఉమ్మడి జిల్లాలో ఉన్న గిరిజన ప్రాంతాలలో గిరిజనుల వ్యవసాయ భూములకు సాగునీరు అందించేలా చెరువులు, చెక్‌డ్యాంలు, కుంటలు నిర్మిస్తూ..  ప్రతి యేటా కోట్లాది రూపాయలతో పథకాలు అమలు చేశారు. ఫలితంగా గిరిజన ప్రాంతాలలో భూగర్భ జలాలు అభివృద్ది చెంది గిరిజనులు సాగు నీరును ఉపయోగించుకుంటూ కొన్ని ప్రాంతాల రైతులు పంటలు సాగు చేస్తూ వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా ఉట్నూర్‌ ఐటీడీఏ పీవోగా పని చేసిన ఆర్వీ కర్ణన్‌ ఉట్నూర్‌ ఐటీడీఏలో ఉన్న డివిజన్‌ కార్యాలయంతో అంతగా పని లేదంటూ తెలుపుతూ ఉన్నతాధికారులకు నివేదికలు పంపడంతో ఐటీడీఏ పరిధిలో ఉన్న డివిజన్‌ కార్యాలయాన్ని ఎత్తి వేశారు. తెలంగాణ ప్రభుత్వం 2014లో జిల్లాలు పునర్విభజన చేసిన నాటి నుంచి డివిజన్‌ కార్యాలయం జిల్లా కేంద్రానికి చేరడంతో ఉట్నూర్‌ ఏజెన్సీలోని గిరిజన ప్రాంతాల రైతులకు సేవలు దూరమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన మిషన్‌ కాకతీయ పథకం ద్వారా చెరువుల మరమ్మతుల పనులను మాత్రమే నిర్వహిస్తున్న ఇరిగేషన్‌ శాఖ అధికారులు, కొత్త చెరువుల నిర్మాణాలకు ఏ మాత్రం కృషి చేయడం లేదు. ఉట్నూర్‌లో ఉన్న కార్యాలయాన్ని పునరుద్ధరించాలని స్థానిక ప్రజాప్రతినిధులు కోరుతున్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు. 

జలవనరుల శాఖ వచ్చినా!!

తెలంగాణ ప్రభుత్వం ఇరిగేషన్‌ శాఖను పునర్‌ వ్యవస్థీకరించి జలవనరుల శాఖగా మార్చినప్పటికీ జిల్లాకేంద్రానికే డివిజన్‌ కార్యాలయాలను పరిమితం చేస్తూ ప్రభుత్వం జీవో నెం.1ని ఈనెల 9న విడుదల చేసింది. జలవనరుల శాఖకు సీఈ కార్యాలయంతో పాటు జిల్లా కేంద్రంలోనే మరో రెండు డివిజన్‌ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. ఒక డివిజన్‌ జిల్లాకేంద్రంలో, మరో డివిజన్‌ ఉట్నూర్‌లో ఏర్పాటు చేస్తే గిరిజన ప్రాంతాల రైతులకు మేలు కలుగుతుందని, ఇప్పటికైనై ప్రభుత్వం ఉట్నూర్‌లో డివిజన్‌ కార్యాలయాన్ని పునరుద్ధరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

ఉట్నూర్‌లో కార్యాలయ ఏర్పాటుకు కృషి చేస్తా

: రేఖానాయక్‌, ఎమ్మెల్యే, ఖానాపూర్‌

ఉట్నూర్‌లో జలవనరుల శాఖ డివిజన్‌ కార్యాలయం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తా. గతంలో ఎత్తి వేసిన ఈ కార్యాలయాన్ని పునరుద్ధరించాలని తెలిపినప్పటికీ అమలు కాలేకపోయింది. జిల్లా కేంద్రంలో రెండు డివిజన్‌ కార్యాలయాలు మంజూరు అయినందున ఉట్నూర్‌లో ఒకటి ఏర్పాటు చేసేలా కృషి చేస్తా.


Updated Date - 2021-02-07T05:28:12+05:30 IST