‘డ్రంకెన్‌డ్రైవ్’తో ప్రాణాలు పోగొట్టుకోవద్దు
ABN , First Publish Date - 2022-01-01T04:16:09+05:30 IST
మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకోవద్దని జీఎంఆర్ ప్రాజెక్టు మేనేజర్ రాజేంద్రప్రసాద్ సూచించారు.

హైవే ప్రయాణికులకు జీఎంఆర్ అవగాహన
తూప్రాన్, డిసెంబరు 31: మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకోవద్దని జీఎంఆర్ ప్రాజెక్టు మేనేజర్ రాజేంద్రప్రసాద్ సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడంతో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నిత్యం 257 మంది మరణిస్తున్నట్లు ఆయన వివరించారు. శుక్రవారం తూప్రాన్ టోల్‌ప్లాజా వద్ద హైవే 44పై డిసెంబరు 31న నూతన సంవత్సరం సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడపొద్దంటూ జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ చేపట్టిన అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రాణాలు పోగొట్టుకోవద్దని, కుటుంబసభ్యులు, బంధుమిత్రులకు తీరని శోకం మిగల్చవద్దని ఆయన సూచించారు. ఈ సందర్భంగా వాహనదారులకు అవగాహన కల్పిస్తూ మద్యం సేవించి వాహనాలు నడపొద్దంటూ సంతకాలు సేకరించారు. ఇందులో జీఎంఆర్ సిబ్బంది పరంధామం, నాగేశ్వర్‌రావు, ప్రవీణ్‌కుమార్, సతీష్ పట్నాయక్, పౌండేషన్ ఇన్‌చార్జి శ్రీనివాస్, రక్షా సిబ్బంది పాల్గొన్నారు.
జాతీయ రహదారిపై తనిఖీలు
అల్లాదుర్గం, డిసెంబరు 31: అల్లాదుర్గం మండలంలోని 161వ జాతీయ రహదారి పై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణ కోసం స్థానిక పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. ఎస్‌ఐ మోహన్‌రెడ్డి తన సిబ్బందితో శుక్రవారం రహదారిపై వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ వాహన చోదకులు విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలను నడిపినా, రోడ్డు నిబంధనలను అతిక్రమించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.