కారులో కలవరం

ABN , First Publish Date - 2021-08-03T06:11:06+05:30 IST

జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్‌లలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి అసంతృప్తి తాకిడి మొదలైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కారులో కలవరం

ఖానాపూర్‌ టీఆర్‌ఎస్‌లో రగులుతున్న అసంతృప్తి జ్వాల 

ఎమ్మెల్యే వర్సెస్‌ నేతల మధ్య ముదురుతున్న అభిప్రాయ బేధాలు 

ముథోల్‌ సెగ్మెంట్‌లోనూ ఎమ్మెల్యే తీరుపై సీనియర్‌ నేతల కినుక 

పనులు లేక నిర్మల్‌లోనూ చాపకింద నీరులా అసంతృప్తి 

జిల్లాలో మారనున్న రాజకీయ సమీకరణలు 

నిర్మల్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి)  : జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్‌లలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి అసంతృప్తి తాకిడి మొదలైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఖానాపూర్‌, ముథోల్‌ అసెంబ్లీ ని యోజకవర్గాలతో పాటు నిర్మల్‌ నియోజకవర్గంలోనూ పలువురు సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే చాలా మంది తమ అసంతృప్తిని బయటకు వెళ్లగక్కలేని పరిస్థితులతో సతమతమవుతున్నారంటున్నారు. అంతర్గతంగానే అసంతృప్తిని వెళ్లగక్కుతున్నప్పటికీ బహిరంగంగా తమ అభిప్రాయాల ను వెల్లడించలేని పరిస్థితులు ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. స్థానికంగా ఆయా ఎమ్మెల్యేల తీరుతోనే పలువురు సీనియర్‌ నాయకులు మనస్థాపానికి లోనవుతున్నారని చెబుతున్నారు. రాజకీయంగా తమకు ప్రాధాన్యత కల్పించకపోవడం సమస్యల పరిష్కారం విషయంలో తమకు ప్రమేయం లేకుండా చేయడంతో తాము మనస్థాపానికి గురవుతున్నామని పలువురు నేతలు బహిరంగంగా పేర్కొంటున్నా రు. దీంతోపాటు ఆర్థికపరమైన ఇబ్బందుల విషయంలో కూడా ఎమ్మెల్యే లు తమను నిర్లక్ష్యం చేస్తున్నారని, తమ మనుగడ క్రమంగా ప్రశ్నార్థకమవుతుందంటూ పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఖానాపూర్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే వైఖరి పట్ల కొంతమంది సీనియర్‌ నాయకులు అలాగే మరికొంతమంది ప్రజాప్రతినిధులు అసంతృప్తితో రగిలిపోతున్నట్లు బహిరంగంగానే ప్ర చారం జరుగుతోంది. ఇప్పటికే పెంబి జడ్పీటీసీ సభ్యురాలు భుక్య జానకీభాయి టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆమెతో పాటు మరికొంతమంది సీనియర్‌ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌కు దూరమయ్యారు. అలాగే మరో ముఖ్యమైన ప్రజా ప్రతినిధి కూడా ఎమ్మెల్యే తీరుపట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు అంతటా ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితి ఇలా కొనసాగుతున్న క్రమంలోనే గత కొంతకాలం నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గంగ నర్సయ్య సోమవారం తన మార్కెట్‌ చైర్మన్‌ పదవికి అలాగే టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం ఆ పార్టీలోనే కాకుండా రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలు అలాగే ఒంటెద్దు పోకడలతో పాటు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గంగ నర్సయ్య చేసిన ఆరోపణలు చర్చనీయాంశమవుతున్నాయి. గత కొద్దిరోజుల నుంచి గంగనర్సయ్య ఎమ్మెల్యే తీరుపై బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం పట్టణంలోని ఓ రోడ్డు పని శంకుస్థాపన విషయంలో తనను నిర్లక్ష్యం చేశారంటూ ఆయన బహిరంగంగానే నిరసనకు దిగి కలకలం సృష్టించారు. అప్పటి నుంచి ఆయన చాపకింద నీరులా రగిలిపోతూ చివరకు రాజీనామా అస్ర్తాన్ని ప్రయోగించి ఎమ్మెల్యేను టార్గెట్‌గా చేయడం రాబోయే రోజుల్లో ఆసక్తికర పరిణామాలకు కారణం కాబోతోందన్న సంకేతాలను పంపారంటు న్నారు. ఇదిలాఉండగా ముథోల్‌ నియోజకవర్గంలో సైతం అక్కడి ఎమ్మె ల్యే విఠల్‌రెడ్డి తీరుపై పలువురు సీనియర్‌ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేను తమను పట్టించుకోకుండా నేరుగా కలిసే వారికి ప్రాధాన్యతనిస్తున్నారని దీని కారణంగా తాము స్థానికంగా ప్రాభవం కోల్పోతున్నామంటూ ఇక్కడి సీనియర్‌లు వాపోతున్నారు. తమ ప్రాంతానికి సంబంధించిన సమస్యల విషయంలో కూడా ఎమ్మెల్యే సంప్రదించకుండా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారం నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ పార్టీలో హాట్‌టాఫిక్‌గా కొనసాగుతోందంటున్నారు. అలాగే నిర్మల్‌ ని యోజకవర్గంలో కూడా చాలా మంది సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు కొంతకాలం నుంచి అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తామంతా ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నప్పటికి తమను సీనియర్‌లు పట్టించుకోవడం లేదని, ఎన్నికల్లో పోటీ కోసం తాము లక్షల రూపాయలు ఖర్చు చేసి అప్పుల పాలయ్యామంటూ బహిరంగంగానే వాపోతున్నారు. తమ ఆర్థిక పరిస్థితి విషయంలో సీనియర్‌లు నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం ఉంది. 

ఖానాపూర్‌లో మొదటి నుంచి అదే పరిస్థితి

ఖానాపూర్‌ నియోజకవర్గంలో మొదటి నుంచి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అసంతృప్తిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా అక్కడి ఎమ్మెల్యే తీరుపై చాలామంది సీనియర్‌ నాయకులు అంతర్గతంగా విభేధిస్తున్నారంటున్నారు. అయితే పార్టీ అధికారంలో ఉండడం అలాగే ఎదుటిపార్టీల్లో నాయకత్వం సక్రమంగా లేని కారణంగా వారంతా గత్యంతరం లేక టీ ఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నియోజకవర్గంలో చిలికిచిలికి గాలివానలాగా టీఆర్‌ఎస్‌పార్టీలో అంతర్‌యుద్ధం తీవ్రమవుతోందన్న వాదనలున్నాయి. మొన్నటి వరకు చాపకిందనీరులా ఉన్న అసంతృప్తి పరిస్థితి క్రమంగా బహిరంగమవుతోందంటున్నారు. ఇందులో భాగంగానే మొదటపెంబీ జడ్పీటీసీ టీఆర్‌ ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే తీరు పట్ల అసంతృప్తితో పెంబీ జడ్పీటీసీ జానకీభాయి టీఆర్‌ఎస్‌ పార్టీకి గుడ్‌పై చెప్పి బీజేపీలో చేరారు. అలాగే ఖానాపూర్‌కు చెందిన మరోకీలక ప్రజాప్రతినిధి సైతం ఎమ్మెల్యే వ్యవహారశైలితో అసంతృప్తికి లోనయినట్లు చెబుతున్నారు. అయితే ఆయన ఇంకా వేచి చూసే ధోరణితో ఆ పార్టీలో కొనసాగుతున్నారన్న వాదనలున్నాయి. ఈ క్రమంలోనే మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కడార్ల గంగనర్సయ్య తన  పదవికే కాకుండా పార్టీకి కూడా రాజీనామా చేసిన వ్యవహారం ఆ పార్టీలోని అ సంతృప్తి తీవ్రతకు అద్దం పడుతోందంటున్నారు. 

ముథోల్‌, నిర్మల్‌ నియోజకవర్గాల్లో చాప కింద నీరులా అసంతృప్తి 

కాగా ముథోల్‌, నిర్మల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా టీఆర్‌ఎస్‌ క్రమక్రమంగా అసంతృప్తి వైపుదారి తీస్తోంది. ముఖ్యంగా ముథోల్‌ నియోజకవర్గంలో అక్కడి ఎమ్మెల్యే తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయంటున్నారు. అయితే ఎమ్మెల్యే సమస్యల విషయంలోనూ, అభివృద్ధి పనుల మంజూరు విషయంలోనూ కిందిస్థాయి కార్యకర్తలకు ప్రాధాన్యతనిస్తూ సీనియర్‌నేతలైనా తమను విస్మరిస్తున్నారంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారని చెబుతున్నారు. అలాగే పర్యటనల సందర్భంగా కూడా ఎమ్మెల్యే తమకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్య వహరిస్తున్నారంటూ కూడా పలువురు వాపోతున్నారని చెబుతున్నారు. దీంతో పాటు మాజీ ఎమ్మెల్యే వేణుగోపాలచారికి సంబంధించిన అనుచరుల విషయంలో కూడా విఠల్‌రెడ్డి నిర్లక్ష్యధోరణి అవలంభిస్తున్నారంటు న్నారు. ఇప్పటికే ఇక్కడ చారి, విఠల్‌రెడ్డిల మధ్య సఖ్యత లేని విషయం తెలిసిందే. అడపా..దడపా మినహా ఎప్పుడు కూడా వీరిద్దరు అధికారిక కార్యక్రమాల్లో గాని పార్టీ పరమైన కార్యకలాపాల్లో గాని కలిసి పాల్గొనకపోవడం చర్చకు దారితీస్తోందంటున్నారు. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి తీరుపై వేణుగోపాలచారి సైతం తీవ్రఅసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం ఉంది. వీరిద్దరి మధ్య సఖ్యత కుదుర్చేందుకు జరిపిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇక్కడి టీఆర్‌ఎస్‌ కేడర్‌ రెండు వర్గాలు కొనసాగుతోంది. ఇదిలా ఉండగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించే నిర్మల్‌ నియోజకవర్గంలో కూడా అసంతృప్తి చాప కింద నీరులా ఉం దంటున్నారు. ఎవరు కూడా బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేయకపోతున్నప్పటికీ అంతర్గతంగా ఈ అసంతృప్తి మొదలవుతోందంటున్నారు. ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యలతో సతమతమవుతున్న పలువురు నాయకులు మంత్రి తీరుతో విభేధిస్తున్నట్లు సమాచారం. పార్టీ కోసం తాము చాలా యేళ్ల నుంచి కష్టపడి పని చేస్తూ ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తమను ఆదుకునే విషయంలో నిర్లక్ష్యధోరణి ప్రదర్శించడం పట్ల వీరంతా అసంతృప్తికి గురవుతున్నారన్న ప్రచారం ఉంది. మొత్తానికి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో ఈ అసం తృప్తి చిలికి చిలికి గాలివానలా మారే ప్రమాదం ఉందంటూ పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Updated Date - 2021-08-03T06:11:06+05:30 IST