కమల దళంలో అసమ్మతి సెగలు

ABN , First Publish Date - 2021-12-26T05:55:02+05:30 IST

అధికార పార్టీకి ప్రత్యామ్నాయమంటూ చెప్పుకునే కమలదళానికి అసమ్మతి సెగ తగలడంతో ఆ పార్టీలో ఆందోళన రేపుతోంది. పైపైకి అంతా భాగానే కనిపిస్తున్నా.. కొందరు నేతలు మాత్రం లోలోన ఒకరిపై ఒకరు రగిలి పోతున్నట్లు తె లుస్తుంది. ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఆ పార్టీలో మరిన్ని విభేదాలకు కారణమయ్యాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కమల దళంలో అసమ్మతి సెగలు
ఆదిలాబాద్‌ జిల్లాకేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయం

బీజేపీలో చిచ్చుపెట్టిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు

పార్టీ అధిష్ఠానం పెద్దలకు పోటాపోటీగా నేతల ఫిర్యాదులు

ఎన్‌ఆర్‌ఐ కందితో టచ్‌లో ఉంటున్న కొందరు సీనియర్లు

అగ్రనేతల తీరుపై పార్టీ శ్రేణుల అసంతృప్తి 

ఆదిలాబాద్‌, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): అధికార పార్టీకి ప్రత్యామ్నాయమంటూ చెప్పుకునే కమలదళానికి అసమ్మతి సెగ తగలడంతో ఆ పార్టీలో ఆందోళన రేపుతోంది. పైపైకి అంతా భాగానే కనిపిస్తున్నా.. కొందరు నేతలు మాత్రం లోలోన ఒకరిపై ఒకరు రగిలి పోతున్నట్లు తె లుస్తుంది. ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఆ పార్టీలో మరిన్ని విభేదాలకు కారణమయ్యాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి బీజేపీ పార్టీ అధికారికంగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలుపక పోయినా.. కొంత మంది నేతలు అనధికారికం గా స్వతంత్ర అభ్యర్థులను రంగంలోకి దింపి అధికార పార్టీకి అమ్మేసుకున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. చివరకు బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి పెందూరు పుష్పరాణికి మద్దతునిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు బహిరంగంగానే ప్రకటన చేసి వెనుకడుగు వేయడంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ కౌన్సిలర్లు మద్దతు తెలిపిన మరో స్వాతంత్ర అభ్యర్థి టీఆర్‌ఎస్‌లో చేరిపోవడంతో తలోకొంత దండుకున్నారనే ఆరోపణలు కూడా లేక పోలేదు. గతంలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికలు, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ అగ్రనేతలు వ్యవహరించిన తీరుపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల ఎపిసోడ్‌లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ పూర్తిగా విఫలమైందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఫ గల్లీ నుంచి ఢిల్లీకి ఫిర్యాదులు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కొంత మంది జిల్లా బీజేపీ నేతల తీరుపై విమర్శలు వస్తున్నాయి. దీంతో గల్లీ నుంచి ఢిల్లీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో మూడు వర్గాలుగా విడిపోయి పని చేస్తున్న బీజేపీ ముఖ్య నేతలు ఒకరిపై ఒకరు పోటాపోటీగా అధిష్ఠానం పెద్దలకు ఫిర్యాదులు చేసుకోవడం పరిపాటిగానే మారుతుంది. కొత్తగా మరో ఎన్‌ఆర్‌ఐ నేత తీరు కూడా పార్టీకి కొంత ఇబ్బందికరంగానే మారుతుందంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మద్ధతు తెలిపిన అభ్యర్థులు తమ నామినేషన్లను విత్‌డ్రా చేసుకోవడంపై రగడ కొనసాగుతుంది. అసలు తమ పార్టీ అభ్యర్థి ఎన్నికల బరిలో లేకపోయినా.. స్వతంత్ర అభ్యర్థులకు ఎందుకు మద్దతునిచ్చారో? మళ్లీ ఎందుకు విత్‌డ్రా చేయించారో? అంతుచిక్కడం లేదంటున్నారు. అధికార పార్టీ అగ్రనేతలకు తలొగ్గే ఆ పార్టీ అభ్యర్థి గెలుపునకు సహకరించారనే అపవాదులు వస్తున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా జరిగిన డబ్బు పంపకాల్లో తేడాలు రావడంతోనే కొంత మంది స్థానిక ప్రజా ప్రతినిధులు అగ్రనేతల తీరును నిలదీసినట్లు తెలుస్తుంది. ఈ కారణంగానే కొందరు ప్రజాప్రతినిధులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నట్లు ప్రచారం కూడా జరిగింది. బీజేపీ నేతల తీరుపై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శ లు రావడం పెద్ద దుమారం రేపింది. దీనిపై కేంద్ర రాష్ట్ర అధిష్ఠానం పెద్దలకు కొందరు ఫిర్యాదు చేయడంతో అసలు జరిగిన తతంగంపై రహస్యంగా పార్టీ పెద్దలు విచారణ చేపట్టినట్లు పార్టీలో చర్చ జరుగుతుంది. 

ఫ సీనియర్ల పక్క చూపులు

ఎన్నో ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని పని చేస్తున్న అధికారం దక్కక పోవడంతో కొందరు సీనియర్లు అసంతృప్తికి లోనవుతూ పక్కచూపులు చూస్తున్నట్లు తెలుస్తుంది. రాబోయే సాధారణ ఎన్నికల్లో అభ్యర్థి మార్పు కచ్చితంగా ఉంటుందని పార్టీలో ప్రచారం జరుగుడంతో కొంత మంది సీనియర్‌ నేతల ముందుచూపుతో ఉన్నట్లు కనిపిస్తుంది. గత కొంత కాలంగా ఎన్‌ఆర్‌ఐ కంది శ్రీనివాస్‌రెడ్డి బీజేపీలో చేరిపోతారని విస్త్రృత ప్రచారం జరిగింది. జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పే సీనియర్‌ నాయకుడు సంతోష్‌జీ అండదండలు ఆయనకు పుష్కలంగా ఉండడంతో వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. గతంలో బీజేపీ అగ్రనేతల ఫొటోలతో కూడిన బ్యానర్లు, కటౌట్లను ఏర్పా టు చేయడం పెద్దఎత్తున చర్చకు దారి తీసింది. భారీ బడ్జెట్‌తో కంది శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికల బరిలో దిగుతారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఎవరికి అవకాశమిచ్చినా.. పని చేస్తామనే భావనతో కొందరు సీనియర్‌ నేతలు ఉన్నట్లు తెలిసింది. దీంతో నిత్యం కంది శ్రీనివాస్‌రెడ్డితో కొందరు సీనియర్లు టచ్‌లో ఉంటూ ఆదిలాబాద్‌ నియోజకవర్గంలోని రాజకీయ పరిణామాలపై ఆయనకు వెంట వెంటనే సమాచారం అందిస్తున్నట్లు తెలుస్తుంది. పార్టీ అధిష్ఠానం ఎవరికి అవకాశమిచ్చినా.. పని చేస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్న సీనియర్లు ఇప్పటి నుంచే కోవర్టులుగా మారి పార్టీలో మరిన్ని విభేదాలకు కారణమవుతున్నారని ఓ వర్గం నేతలు మండిపడుతున్నారు. ఏది ఏమైనా జిల్లా బీజేపీ పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. 

Updated Date - 2021-12-26T05:55:02+05:30 IST